లక్ష్యం చేజారినా ఆ సక్సెస్ మరో రూపంలో!
సినిమా రంగంలోకి రాకముందు కొంత మందికి వేర్వేరు లక్ష్యాలుంటాయి. నటుడు ఆర్. మాధవన్ విషయంలో కూడా ఇదే జరిగింది.
By: Srikanth Kontham | 4 May 2026 7:00 AM ISTసినిమా రంగంలోకి రాకముందు కొంత మందికి వేర్వేరు లక్ష్యాలుంటాయి. నటుడు ఆర్. మాధవన్ విషయంలో కూడా ఇదే జరిగింది. మాధవన్ కు చిన్నప్పటి నుండి భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే బలమైన కోరిక ఉండేది. కేవలం కోరికగానే మిగిలిపోకుండా? దాని కోసం ఆయన ఎంతో శ్రమించారు. కాలేజీ రోజుల్లో అత్యుత్తమ ఎన్సీసీ క్యాడెట్‌గా ఎంపికై, కెనడాలో శిక్షణ పొందే అవకాశం కూడా దక్కించుకున్నారు. ఒక దశలో ఆయన ఆర్మీలో చేరడానికి అన్ని అర్హతలను సాధించి ఆ కలకు అత్యంత సమీపంలోకి వెళ్లారు. అయితే విధి మరొకలా తలచింది. ఆర్మీలో చేరడానికి నిర్ణీత వయస్సు నిబంధన ఉంటుంది.
మాధవన్ అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా? వయస్సు పరిమితి ఆరు నెలలు మించడంతో ఆర్మీలో చేరే అవకాశం చేజారిపోయింది. ఎంతో ఆశగా పెట్టుకున్న డ్రీమ్ ఇలా చిన్న కారణంతో చెదిరిపోవడంతో మాధవన్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. తన జీవిత లక్ష్యం ముగిసిపోయిందని ఆ సమయంలో ఎంతో ఆవేదన చెందారు. కానీ ఆ పట్టుదలే ఆయనను మోడలింగ్ ఆ తర్వాత సినీ రంగం వైపు నడిపించింది. ఆర్మీలోకి వెళ్లలేకపోయానన్న వెలితి మాధవన్‌ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. కానీ ఆ కోరికను ఆయన వెండితెర పాత్రల ద్వారా తీర్చుకున్నారు. తాజాగా ఆయన నటించిన `ధురంధర్` చిత్రం ఆయనలోని దేశభక్తికి నిదర్శనంగా నిలిచింది.
ఈ సినిమాలో మ్యాడీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్ర పోషించని సంగతి తెలిసిందే. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించే ఒక పవర్‌ఫుల్ స్పైని (గూఢచారిని) తయారు చేసే కింగ్ మేకర్‌గా అద్భుతమైన నటనను కనబరిచారు. ఓ రకంగా చెప్పాలంటే ఆర్మీలో చేయలేకపోయిన సేవను ఈ పాత్ర ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారు. ధురంధర్ ఒక సినిమాగానే కాదు. వాస్తవిక ఘటనల ఆధారంగా రూపొంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడంలో ఒక గూఢచారి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో? ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
మాధవన్ పోషించిన పాత్ర యంగ్ స్పైని తీర్చిదిద్ది, శత్రువుల అంచనాలను తలకిందులు చేసే తీరు థియేటర్లలో చప్పట్ల వర్షం కురిపించింది. ఆయన శిక్షణలో తయారైన స్పై చేసే విన్యాసాలు దేశ రక్షణలో గూఢచారుల ప్రాముఖ్యతను గుర్తుచేశాయి. ఈ సినిమా విడుదల తర్వాత దౌత్యపరంగా కూడా చర్చలు జరిగాయి. ముఖ్యంగా పాకిస్తాన్ వైపు నుండి ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో? అక్కడి ఉగ్రవాద నెట్‌వర్క్‌పై ఈ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉందో సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరిగింది. ఒక గూఢచారి వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉంటే శత్రు దేశాల కుతంత్రాలను చిత్తు చేయవచ్చో ఈ చిత్రం నిరూపించింది. ఈ క్రమంలో మాధవన్ పోషించిన మెంటార్ పాత్ర ఆయనను నిజమైన కింగ్ మేకర్‌గా నిలబెట్టింది. తన కలను వెండితెరపై ఆవిష్కరించి భారతీయుల మనసు గెలుచుకున్నారు.
మాధవన్ ఆర్మీలోకి వెళ్లలేకపోవడం సైన్యానికి లోటు కావొచ్చు. కానీ సినీ పరిశ్రమకు మాత్రం ఒక గొప్ప నటుడు దొరికాడని చెప్పాలి. `ధురంధర్` లాంటి చిత్రాల ద్వారా ఆయన యువతలో దేశభక్తిని రగిలిస్తున్నారు. కల చెదిరినా కృంగిపోకుండా? తనలోని ఆవేశాన్ని కళా రూపంలోకి మార్చి దేశం గర్వించే సినిమాలను అందిస్తున్నారు. మాధవన్ ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. లక్ష్యం చేజారినా మరో మార్గంలో ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చని మాధవన్ నిరూపించారు.
