బ్రిటిష్ రాణికి కూడా తప్పని వేధింపులు.. ఆమె చేసిన పనికి హాట్సాఫ్!
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఆడవారు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి వార్తలు బయటకు వస్తున్నాయి.
By: Madhu Reddy | 2 Sept 2025 11:29 AM ISTసోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఆడవారు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ ఆడవారికి భద్రత నాటి కాలం నుంచే లేకపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. ఆడవారు అంటేనే చిన్నచూపు చూడడం.. వారిని మానసికంగా, శారీరకంగా హింసించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి వేధింపులు సెలబ్రిటీలు, సామాన్యులకే అనుకున్నారు.. కానీ బ్రిటిష్ రాణికి కూడా తప్పలేదని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాను ఎదుర్కొన్న ఈ లైంగిక వేధింపుల సమయంలో ఆమె చేసిన పనికి ప్రతి ఒక్కరు హ్యాట్సాఫ్ కూడా చెబుతున్నారు. మరి అసలు ఏం జరిగింది? ఎప్పుడో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఎలా బయటపడింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
అసలు విషయంలోకి వెళ్తే.. బ్రిటిష్ రాణి కెమిల్లా.. టీనేజ్ లో ఉన్నప్పుడు లండన్ లో భూగర్భ రైలులో ప్రయాణించారట. ఆ సమయంలో పక్క సీటులో కూర్చున్న ఒక ఆకతాయి ఆమెను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించారట. అప్పుడు కెమిల్లా వెంటనే తన కాలి బూటు తీసి అతడి వృషణాల మీద కొట్టారట. ముఖ్యంగా ఆకతాయిలతో ఇలానే ప్రవర్తించాలని, తన తల్లి అంతకుముందే తనకు సలహా ఇచ్చారని, ఆ సలహాను తనకు ఎదురైన ఇబ్బందుల సమయంలో తూచా తప్పకుండా పాటించానని ఆమె తెలిపారు.
1960లలో జరిగిన ఈ ఉదంతాన్ని "పవర్ అండ్ ది ప్యాలెస్" పుస్తకం తాజాగా బయటపెట్టింది. ఈ పుస్తకాన్ని టైమ్స్ ఆఫ్ లండన్ మాజీ విలేకరి వాలంటైన్ రాశారు. బ్రిటన్ పూర్వ ప్రధాని బోరిస్ జాన్సన్ లండన్ కి మేయర్ గా పనిచేసినప్పుడు ఈ లైంగిక దాడి గురించి కెమిల్లా ఆయనకు తెలిపారట. ఈ విషయాన్ని బోరిస్ జాన్సన్ సహాయకుడు ఒకరు వాలెంటైన్ కి తెలియజేసినట్లు సమాచారం. ఇకపోతే అప్పట్లో ఈ విషయాన్ని బ్రిటిష్ పత్రికలన్నీ కూడా ప్రముఖంగా ప్రచురించాయి. ఈ ఉదంతం గురించి ఎప్పుడూ కూడా కెమిల్లా బయట పెట్టలేదు. పైగా ఇతర మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న దారుణాలతో పోల్చుకుంటే తనకు జరిగిన విషయం చాలా చిన్నదని ఆమె చెబుతూ ఉంటారు.
కెమిల్లా విషయానికి వస్తే.. ఈమె ఎక్కువగా మహిళలకు మద్దతు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా గృహహింసకు గురవుతున్న మహిళలకు చేయూతనిచ్చే దాతృత్వ సంస్థలకు కూడా ఈమె గట్టి మద్దతుదారుగా పనిచేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బ్రిటిష్ రాణి కూడా వేధింపులు ఎదుర్కొంది. కానీ ఆమె ధైర్య సాహసాలను ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. అందుకే అమ్మాయిలు, మహిళలు ఎవరైనా సరే ఇలాంటి వేధింపులు ఎదురైనప్పుడు.. వెంటనే భయపడి పోకుండా తమ శక్తిని ఉపయోగించి ఎదురుదాడి చేయాలి అని.. వారిపై దాడికి దిగాలి అని కోరుతున్నారు నెటిజన్స్. కనీసం ఇప్పటికైనా మహిళలు తమ శక్తులను తెలుసుకొని.. తమపై జరిగే దారుణాలను అడ్డుకోవాలని కూడా సలహాలు ఇస్తూ ఉండడం గమనార్హం.
