మూడు నెలల్లో ముగించే ఇదే ఏడాది!
గత సినిమాలు సరిగ్గా ఆడని నేపథ్యంలో మరో ప్లాప్ ఎదురైతే మార్కెట్ పైనా ప్రభావం పడుతుంది. సినిమా ఆలస్యం కూడా ప్రతికూలంగా మారుతుంది.
By: Srikanth Kontham | 2 May 2026 12:56 PM ISTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం `క్వీన్`. దాదాపు పదేళ్ల తర్వాత ఈ సెన్సేషనల్ మూవీకి సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి కొత్త అప్డేట్ ఒకటి వైరల్ అవుతుంది. మూడు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేయాలనే పక్కా ప్లాన్‌తో కంగనా రంగంలోకి దిగుతుంది. ఇటీవలే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైన నేపథ్యంలో కంగన మూడు నెలల్లో ముగించేస్తాననడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కంగన ఎంపీగాను కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. రాజకీయ బాధ్యతలను, సినిమా షూటింగ్‌ను సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తూ ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.
దర్శకుడు వికాస్ బహల్ మరింత ఆసక్తికరమైన కథాంశంతో `క్వీన్ 2` ను రూపొందిస్తున్నారు. మొదటి భాగంలో పారిస్ నేపథ్యంలో సాగిన రాణి ప్రయాణం రెండవ భాగంలో భారతదేశంలోని వివిధ నగరాల చుట్టూ తిరగనుంది. ముఖ్యంగా ఉత్తర భారతానికి చెందిన ఓ చిన్న పట్టణ యువతి ముంబై వంటి మెట్రో నగరానికి వచ్చినప్పుడు ఎదురయ్యే పరిస్థితులు, ఆమె వ్యక్తిత్వ వికాసాన్ని చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. అలాగే సౌత్ లోకొన్ని మెట్రో సిటీస్ లోనూ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. కంగనకు పాన్ ఇండియాలో ఇమేజ్ ఉంది కాబట్టి అనన్ఇ భాషల్లో క్వీన్ 2 రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో సౌత్ లోనూ షూటింగ్ చేస్తే మార్కెట్ పరంగానూ కలిసొస్తుంది. కంగన పై మూడు నెలల్లో షూటింగ్ పూర్తయితే? రిలీజ్ కు కూడా పెద్దగా సమయం పట్టదు. అటుపై మరో రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కేటాయించిన పని పూర్తవుతుంది. ఆ రకంగా చూస్తే ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ముగింపులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కథా బలమున్న సినమిఆ కాబట్టి టెక్నికల్ గా హైలైట్ చేసే అంశాలు చాలా తక్కువగానే ఉంటాయి. కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా పెద్దగా సమయం పట్టదు. కంగనకు సక్సెస్ అనివార్య మైంది.
గత సినిమాలు సరిగ్గా ఆడని నేపథ్యంలో మరో ప్లాప్ ఎదురైతే మార్కెట్ పైనా ప్రభావం పడుతుంది. సినిమా ఆలస్యం కూడా ప్రతికూలంగా మారుతుంది. అందుకే కంగన `క్వీన్ 2` విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ ముంబైలోని గ్రాంట్ రోడ్ పరిసరాల్లో జరుగుతోంది. కథానాయిక ఇంటికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. పార్లమెంటు సభ్యురాలిగా ఢిల్లీలో సమావేశాలకు హాజరవుతూనే కంగన రాత్రిపూట ముంబైకి చేరుకుని షూటింగ్‌లో పాల్గొంటుంది.
పగలు సమావేశాలు..రాత్రి షూటింగ్ తో కంగన ఎంతగా శ్రమిస్తుందన్నది అద్దం పడుతుంది. మొదటి భాగంలో రాజ్ కుమార్ రావు, లీసా హేడెన్ వంటి నటులు కీలక పాత్రలతో అలరించారు. అయితే సీక్వెల్‌లో కనిపిస్తారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కథా పరంగా ఇది మొదటి భాగానికి కొనసాగింపు కాదు. ఒక సరికొత్త ప్రయాణమని సమాచారం. వికాస్ బహల్ ఈ చిత్రానికి దర్శకుడిగానే కాకుండా రచయితగా, సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.
