Begin typing your search above and press return to search.

PVR ఐనాక్స్ 5ఏళ్ల‌లో మ‌రో 1000 స్క్రీన్లు.. షేర్ ధ‌ర పెంపు ప్ర‌కంప‌న‌లు!

భారతదేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ రంగానికి చెంది విజయం సాధిస్తున్న పివిఆర్ ఐనాక్స్ (PVR INOX) తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించేందుకు ముమ్మర ప్రణాళికలు సిద్ధం చేసింది.

By:  Sivaji Kontham   |   1 Sept 2026 9:00 PM IST
PVR ఐనాక్స్ 5ఏళ్ల‌లో మ‌రో 1000 స్క్రీన్లు.. షేర్ ధ‌ర పెంపు ప్ర‌కంప‌న‌లు!
X

భారతదేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ రంగానికి చెంది విజయం సాధిస్తున్న పివిఆర్ ఐనాక్స్ (PVR INOX) తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించేందుకు ముమ్మర ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా టైర్-3, టైర్-4 చిన్న పట్టణాలలో సినిమా హాళ్ల సంఖ్య తక్కువగా ఉండటాన్ని గుర్తించిన కంపెనీ.. మ‌రో ఐదేళ్లలో ఏకంగా 1,000 కొత్త స్క్రీన్లను జోడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఏటా సుమారు 200 కొత్త స్క్రీన్లను ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించింది. చిన్న పట్టణాల్లోని ప్రేక్షకుల అభిరుచులకు, ఆదాయానికి తగినట్లుగా తక్కువ పెట్టుబడితో నిర్మించే `స్మార్ట్ సినిమాస్` అనే కొత్త ఫార్మాట్‌ను ప్రవేశపెట్టి తక్కువ టికెట్ ధరలతో నాణ్యమైన థియేటర్ అనుభవాన్ని అందించాలని భావిస్తోంది.

ఈ భారీ విస్తరణ కోసం పివిఆర్ ఐనాక్స్ తక్కువ మూలధన వ్యయంతో కూడిన `క్యాపిటల్ లైట్` లేదా ఫోకో (FOCO - ఫ్రాంఛైజీ ఓన్డ్, కంపెనీ ఆప‌రేటెడ్‌) మోడల్‌ను ఎంచుకుంది. ఈ విధానంలో స్థానిక రియల్ ఎస్టేట్ డెవలపర్లు లేదా ఫ్రాంచైజీ భాగస్వాములు మౌలిక వసతుల నిర్మాణానికి పెట్టుబడి పెడితే.. పివిఆర్ ఐనాక్స్ కేవలం వాటి నిర్వహణను పర్యవేక్షిస్తుంది. దీనివల్ల కంపెనీపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా వందలాది నగరాలకు విస్తరించడం సాధ్యమవుతుంది. మెట్రో నగరాల్లో అధునాతన మల్టీప్లెక్స్‌లను కొనసాగిస్తూనే.. చిన్న నగరాల్లో మార్కెట్‌ను విస్తరించడం ద్వారా భారతీయ సినిమా ప్రదర్శన రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకోవాలని పివిఆర్ ఐనాక్స్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ విస్త‌ర‌ణ స‌మ‌యంలోనే పివిఆర్ ఐనాక్స్ తమ వాటాదారులకు తీపి కబురు అందించింది. రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు (షేర్ బైబ్యాక్) చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్లు స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ నిర్ణయం ప్రకారం కంపెనీలోని వాటాదారుల వద్ద ఉన్న షేర్లను ప్రీమియం ధరకు కొనుగోలు చేయనున్నారు. ఈ బైబ్యాక్ ప్రక్రియలో భాగంగా ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 1,450 గా నిర్ణయించారు. ఈ ఆఫర్ ద్వారా కంపెనీ మొత్తం 20.69 లక్షల ఈక్విటీ షేర్లను దామాషా పద్ధతిలో `టెండర్ ఆఫర్` మార్గం ద్వారా సేకరించనుంది. ఇది కంపెనీకి ఉన్న మొత్తం చెల్లించిన ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 2.11 శాతానికి సమానం. అర్హులైన వాటాదారులను నిర్ణయించడానికి 2026 సెప్టెంబర్ 4ని రికార్డు తేదీగా కంపెనీ ఖరారు చేసింది.

కంపెనీ యాజమాన్యం, ప్రమోటర్ సమూహాలు కూడా ఈ బైబ్యాక్ ప్రాసెస్ లో పాల్గొనడానికి తమ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు పివిఆర్ ఐనాక్స్ తెలిపింది. రికార్డు తేదీకి ఒక పని దినం ముందు బోర్డు లేదా బైబ్యాక్ కమిటీ అవసరమైతే కొనుగోలు ధరను పెంచి షేర్ల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది. అయితే మొత్తం బైబ్యాక్ పరిమాణం మాత్రం రూ. 300 కోట్లుగానే ఉంటుంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కంపెనీ సెక్రటరీ ముర్లీ మనోహర్ జైన్‌ను కాంప్లైయన్స్ ఆఫీసర్‌గా .. డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్‌ను మేనేజర్‌గా నియమించారు. ఆగస్టు 28 నాటికి ఉన్న డేటా ప్రకారం.. పివిఆర్ ఐనాక్స్‌లో ప్రమోటర్లు 27.53 శాతం వాటాను (2.70 కోట్ల షేర్లు) కలిగి ఉన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు 19.82 శాతం, ఆర్థిక సంస్థలు- మ్యూచువల్ ఫండ్స్ 35.03 శాతం వాటా కలిగి ఉండగా.. మిగిలిన 17.62 శాతం వాటా సాధారణ పబ్లిక్ ఇన్వెస్టర్ల వద్ద ఉంది. బైబ్యాక్ పూర్తయిన తర్వాత కంపెనీలో కొత్త వాటాదారుల వివరాలు స్పష్టమవుతాయని సంస్థ పేర్కొంది.

ఈ అధికారిక బైబ్యాక్ ప్రకటన రావడానికి ముందు రోజు బిఎస్‌ఈ లో పివిఆర్ ఐనాక్స్ షేరు ధర 1.44 శాతం తగ్గి రూ. 1,203.60 వద్ద ముగిసింది. ప్రైవేట్ మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న షేరు ధర కంటే బైబ్యాక్ ఆఫర్ ధర (రూ. 1,450) ఎక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆశాభావం వ్యక్తమవుతోంది. బైబ్యాక్‌కు సంబంధించిన పూర్తి కాలపట్టిక, నిబంధనలు త్వరలోనే విడిగా పబ్లిక్ అనౌన్స్‌మెంట్, ఆఫర్ లెటర్ ద్వారా తెలియజేస్తామని కంపెనీ స్పష్టం చేసింది.