Begin typing your search above and press return to search.

యుద్ధ భూమి నుంచి పీవీ సింధు వీడియో.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్

ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా పేరొందిన దుబాయ్, ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ వైమానిక దాడులు, క్షిపణి ప్రయోగాలతో ఒక్కసారిగా రణరంగంగా మారింది.

By:  Sivaji Kontham   |   1 March 2026 6:51 PM IST
యుద్ధ భూమి నుంచి పీవీ సింధు వీడియో.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్
X

యుద్ధ మేఘాల మాటున టెన్ష‌న్ అనుభవించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఈ క్రీడాకారిణి ప్రస్తుతం సురక్షిత ప్రాంతంలో క్షేమంగా ఉన్నట్లు స్వయంగా వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా పేరొందిన దుబాయ్, ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ వైమానిక దాడులు, క్షిపణి ప్రయోగాలతో ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఈ భయానక పరిస్థితుల మధ్య సింధు ఎదుర్కొన్న అనుభవాలు, ఆమె మాటల్లోనే ఒక ఉత్కంఠభరిత కథనంలా మారాయి. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారుతోంది. ఈ వీడియోలో తాను క్షేమంగా ఉన్నాన‌ని, అధికారులు సుర‌క్షిత ప్ర‌దేశానికి త‌ర‌లించార‌ని స్ప‌ష్ఠ‌త‌నివ్వ‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.




బెంగళూరు నుండి బర్మింగ్‌హామ్‌లో జరగనున్న ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బయలుదేరిన సింధు దుబాయ్‌లో ట్రాన్సిట్‌లో ఆగారు. త‌న‌ విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. గగనతలం మూసివేయబడటంతో ప్ర‌యాణీకులంతా విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. ఆ తర్వాతి గంటలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. ఆకాశంలో క్షిపణులను అడ్డుకుంటున్న శబ్దాలు, విస్ఫోటనాల ధ్వనులు విమానాశ్రయం లోపల స్పష్టంగా వినిపించాయి. కొద్దిసేపటికే త‌ను ఉన్న ప్రాంతానికి అత్యంత సమీపంలో ఒక భారీ పేలుడు సంభవించింది.




ఆ సమయంలో సింధు కోచ్ కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉండటం.. ఆ ప్రదేశం నుండి వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాల్సి రావడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇలాంటి అనుభవం ఎదురవడం నిజంగా షాక్‌కు గురిచేస్తుంది. మనకు లేదా మనకు దగ్గరైన వారికి ఇలాంటివి జరుగుతాయని ఎప్పుడూ అనుకోము.. కానీ కొన్నిసార్లు పరిస్థితులు మన నియంత్రణలో ఉండవు! అని సింధు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భయానక క్షణాల తర్వాత విమానాశ్రయ అధికారులు.. భారత రాయబార కార్యాలయం చొరవతో పీవీ సింధును సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ప్రస్తుతం సింధు సురక్షితంగా ఉన్నా కానీ.. యుద్ధం కారణంగా గగనతలం మూసివేయటంతో త‌న‌ స్వదేశానికి తిరిగి రావడంపై సందిగ్ధత నెలకొంది. భారత ప్రభుత్వం ఇప్పటికే `ఆపరేషన్ గల్ఫ్ సేఫ్` పేరుతో భారీ రెస్క్యూ ఆపరేషన్‌కు సిద్ధమైంది. వాయుసేన విమానాలు, నావికాదళ ఓడల ద్వారా భారతీయులను తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సింధుతో పాటు చిక్కుకున్న వేలాది మంది భారతీయులను సురక్షితంగా ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

పీవీ సింధు వంటి క్రీడాకారిణి యుద్ధ భూమిలో చిక్కుకోవడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఆమె క్షేమంగా తిరిగి రావాలని కోట్లాది మంది భారతీయులు ప్రార్థిస్తున్నారు. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, దౌత్యపరమైన ప్రయత్నాలు సింధును, ఇతర భారతీయులను త్వరలోనే సురక్షితంగా స్వదేశానికి తీసుకువస్తాయని ఆశిద్దాం. యుద్ధం ముగిసి, శాంతి నెలకొనాలని ఆకాంక్షిద్దాం.