పూరికి విజయ్ సేతుపతి బ్రేక్
పూరి పేరు మీద తెలుగులో ఇప్పుడు పెద్దగా బిజినెస్ జరిగే పరిస్థితి లేదు. అందుకే ‘స్లమ్ డాగ్’కు విజయ్ సేతుపతికి మంచి మార్కెట్ ఉన్న తమిళనాట రిలీజే కీలకం.
By: Garuda Media | 14 Aug 2026 7:15 AM ISTఒక బలమైన కమ్ బ్యాక్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ డిజాస్టర్ల తర్వాత ఆయన చాలా టైం తీసుకుని చేసిన సినిమా.. స్లమ్ డాగ్. తెలుగులో స్టార్లు ఎవరూ తనకు డేట్లు ఇచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో ఈసారి ఆయన తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో ఈ సినిమా చేశారు.
ఐతే ‘స్లమ్ డాగ్’ షూట్ గత ఏడాదే పూర్తయినా.. ఫస్ట్ కాపీ కూడా ఎప్పుడో రెడీ అయినా.. విడుదలకు మాత్రం నోచుకోవట్లేదు. ముందేమో పూరి గత సినిమాలకు సంబంధించిన ఫైనాన్స్ గొడవల వల్ల ఈ చిత్రం విడుదల కావట్లేదన్నారు. తర్వాత ఆ సమస్యలను పరిష్కరించుకుని సినిమాను బయటికి తేవాలని చూస్తున్నా కుదరడం లేదు. ఇక్కడ సమస్య విజయ్ సేతుపతినే అని తెలుస్తోంది.
పూరి పేరు మీద తెలుగులో ఇప్పుడు పెద్దగా బిజినెస్ జరిగే పరిస్థితి లేదు. అందుకే ‘స్లమ్ డాగ్’కు విజయ్ సేతుపతికి మంచి మార్కెట్ ఉన్న తమిళనాట రిలీజే కీలకం. ఐతే అక్కడ సేతుపతి దారి ఇవ్వట్లేదని తెలుస్తోంది. ఆయన నటించిన రెండు సినిమాలు వచ్చే రెండు నెలల్లో రిలీజ్ కానున్నాయి. మిస్కిన్ దర్శకత్వంలో సేతుపతి నటించిన ‘ట్రైన్’ ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా.. సెప్టెంబరులో కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు. మరోవైపు సేతుపతితో ‘నడువుల కొంజం పక్కత కానం’ లాంటి క్లాసిక్ తీసిన బాలాజీ.. ఇప్పుడీ హీరోతో ‘బత్తా’ అనే మూవీ చేశాడు. అది అక్టోబరులో రిలీజ్ కాబోతోంది.
పూరి సినిమా లైన్లో ముందు ఉన్నప్పటికీ.. దాన్ని పక్కన పెట్టి వేరే రెండు చిత్రాలనే ముందు థియేటర్లలోకి తీసుకొస్తున్నాడు సేతుపతి. దీంతో ‘స్లమ్ డాగ్’ను ఈ ఏడాది చివరికి కానీ రిలీజ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ముందు పూరి వల్లే ‘స్లమ్ డాగ్’ విడుదల ఆలస్యం అయినప్పటికీ.. ఇప్పుడు సేతుపతి వల్ల మరింత లేట్ తప్పట్లేదు. విడుదల మరీ ఆలస్యం అయితే సినిమాకు బజ్ ఇంకా ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. మరి లేటుగా వచ్చినా, లేటెస్ట్‌గా పూరి హిట్ కొడతాడేమో చూడాలి.
