Begin typing your search above and press return to search.

పూరీ- విజయ్ మూవీ రిలీజ్.. బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరుగుతోంది?

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వెర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న స్లమ్‌ డాగ్: 33 టెంపుల్ రోడ్ సినిమా విడుదలపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

By:  M Prashanth   |   17 April 2026 8:00 PM IST
పూరీ- విజయ్ మూవీ రిలీజ్.. బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరుగుతోంది?
X

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వెర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న స్లమ్‌ డాగ్: 33 టెంపుల్ రోడ్ సినిమా విడుదలపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్నప్పటికీ.. రిలీజ్ డేట్ ప్రకటించడంలో జాప్యం చోటుచేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఆ ఆలస్యానికి ప్రధాన కారణంగా స్లమ్ డాగ్ మూవీ ఓటీటీ డీల్ ఇంకా ఫైనల్ కాకపోవడమేనని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. థియేటర్లలో విడుదలకు ముందు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ తో డిజిటల్ హక్కుల ఒప్పందాన్ని పూర్తి చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఆ చర్చలు కొనసాగుతున్నాయని, డీల్ ఖరారైన వెంటనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కూడా సినిమా విడుదలపై ప్రభావం చూపుతున్నాయని వినికిడి. ఆయన గత చిత్రాలు లైగర్, డబుల్ ఇస్మార్ట్ తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

నైజాం ప్రాంతానికి చెందిన కొంతమంది ఎగ్జిబిటర్లు పూరీ జగన్నాథ్‌ పై కేసులు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఆ వివాదాల పరిష్కారం కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, అవి క్లియర్ అయిన తర్వాత సినిమా విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్ని సమస్యలు పరిష్కారమైతే, నిర్మాతలు త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఆ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ పై పూరీ జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌ పై జేబీ నారాయణరావు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రంలో టబు, సంయుక్త, దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. పోస్టర్‌ లో విజయ్ సేతుపతి పూర్తిగా భిన్నమైన లుక్‌ లో కనిపించారు. బిచ్చగాడి వేషధారణలో, కళ్లజోడు ధరించి, చేతిలో రక్తంతో తడిసిన కత్తి పట్టుకుని ఉన్న ఆయన గెటప్ సినిమాపై అంచనాలను పెంచింది. మురికివాడల నుంచి ఎవరూ ఆపలేని తుఫాను వస్తుందనే క్యాప్షన్ కూడా సినిమాలో హీరో పాత్ర ఎంత రఫ్‌గా, పవర్‌ ఫుల్‌ గా ఉంటుందో తెలియజేస్తోంది. మొత్తంగా అన్ని విషయాలు సెట్ అయిన తర్వాతే స్లమ్‌ డాగ్: 33 టెంపుల్ రోడ్ రిలీజ్‌ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు సస్పెన్స్ కొనసాగనుంది.