మళ్లీ మళ్లీ చెప్పుకునేలా గట్టిగా కొట్టాలి పూరీ సర్!
తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈరోజు (జూన్ 8) `స్లమ్ డాగ్` అధికారిక టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
By: Sivaji Kontham | 6 Jun 2026 9:39 AM ISTదర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ అతడికి ఆశించిన విజయాలను అందించలేదు. అందుకే ఇప్పుడు అతడు కచ్ఛితంగా కంబ్యాక్ కోసం ఏదైనా కొత్తగా చేస్తున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద సరైన విజయం కోసం ఆకలితో ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నారు పూరి. ఆయన మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే కేవలం ఒక క్రేజీ టీజరో, అదిరిపోయే ట్రైలరో సరిపోదు.. ఏకంగా థియేటర్లలో బొమ్మ దద్దరిల్లేలా బంపర్ హిట్టు కొట్టాల్సిందే. ఇలాంటి కీలక పోరాటంలో ఉన్న పూరీకి వైవిధ్యమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జాతీయ ఉత్తమనటుడు విజయ్ సేతుపతి రూపంలో గొప్ప అవకాశం దక్కింది. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా `స్లమ్ డాగ్` (సబ్‌టైటిల్: 33 టెంపుల్ రోడ్) పై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈరోజు (జూన్ 8) `స్లమ్ డాగ్` అధికారిక టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ ప్రకటన కోసం డిజైన్ చేసిన పోస్టర్ సినిమాలోని తీవ్రతను కళ్ళకు కడుతోంది. విజయ్ సేతుపతి కళ్లకు గంతలు కట్టుకుని చేతిలో రక్తం అంటిన కత్తితో వెనుతిరిగి నిలబడిన తీరు... బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న పొగమంచు వాతావరణం పూరీ మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కి సింబాలిక్ గా కనిపిస్తోంది. పూరీ ఈసారి ఏదైనా కొత్తగా చేస్తున్నాడని అంతా ఆశిస్తున్నారు. ఈ కొత్తదనాన్ని అతడు టీజర్ లోనే చూపిస్తాడేమో చూడాలి. నిజానికి మళ్లీ మళ్లీ చెప్పుకునేలా అతడు సరిగ్గా కొట్టాల్సిన టైమ్ ఇది.
పూరీ కనెక్ట్స్ - జె.బి. మోషన్ పిక్చర్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి సరసన సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టీజర్ విడుదలతో పాటే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా అనౌన్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తన విలక్షణమైన డైలాగ్స్, హీరో క్యారెక్టరైజేషన్స్‌తో ట్రెండ్ సెట్ చేసిన పూరీ జగన్నాథ్.. ఈసారి విజయ్ సేతుపతి లాంటి పవర్‌హౌస్ పర్‌ఫార్మర్‌ను ఎలా వాడుకున్నాడనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూరీ ఈ చిత్రంతో మళ్లీ ఇండస్ట్రీ తన గురించి గొప్పగా చెప్పుకునేలా కంబ్యాక్ ఇస్తాడా? లేదా అనేది తెలియాలంటే కాస్త వేచి చూడాలి.
ముఖ్యంగా పూరి తన గత చిత్రాలతో చేసిన తప్పును సరిదిద్దుకుని ఈసారి జాతీయ ఉత్తమ నటుడు సేతుపతిని ఎలా చూపించబోతున్నారో చూడాలనే క్యూరియాసిటీ జనంలో ఉంది. దీనిని అతడు ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. కచ్ఛితంగా తప్పు రిపీట్ కాకూడదు. ఒక అద్భుతమైన కథ-కథనంతో అతడు తనదైన శైలి నెరేషన్ తో మెప్పిస్తాడనే ఆశిస్తున్నవారికి నిరాశకలిగించకూడదు. ఇటీవలి కాలంలో కథ-కంటెంట్ కి ప్రాధాన్యత పెరిగింది. దీని ప్రకారమే పూరి తన సినిమాలో మంచి కథను కూడా ఇన్ బిల్ట్ చేసాడని భావిద్దాం.
