తిరస్కరణే విజయానికి తొలిమెట్టు: పూరి 'మ్యూజింగ్స్' సందేశం
జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తిరస్కరణకు గురవుతూనే ఉంటారు. అది ఉద్యోగం కావచ్చు, ప్రేమ కావచ్చు లేదా మనం ప్రాణప్రదంగా భావించే ఆశయం కావచ్చు.
By: Sivaji Kontham | 29 April 2026 9:28 PM ISTజీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తిరస్కరణకు గురవుతూనే ఉంటారు. అది ఉద్యోగం కావచ్చు, ప్రేమ కావచ్చు లేదా మనం ప్రాణప్రదంగా భావించే ఆశయం కావచ్చు. ఇలాంటి సమయాల్లో కుంగిపోకుండా.. ఆ తిరస్కరణను ఒక పాఠంగా మార్చుకోవాలని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన `పూరి మ్యూజింగ్స్` ద్వారా పిలుపునిచ్చారు. తిరస్కరణ అనేది ఎదుగుదలలో ఒక సహజమైన భాగమని.. ఎవరో మనల్ని కాదన్నంత మాత్రాన మన వ్యక్తిగత విలువ ఏమాత్రం తగ్గిపోవని చాలా స్పష్టంగా విడమరిచి చెప్పారు.
చాలామంది రిజెక్షన్ ఎదురైనప్పుడు అది తమ జీవితానికే ముగింపు అని భావిస్తారు. కానీ పూరి దృష్టిలో అది ఒక అడ్డంకి కాదు.. సరికొత్త ప్రారంభానికి నాంది. ఒక్కోసారి మనకు ఎదురయ్యే తిరస్కరణలే అంతకంటే మెరుగైన అవకాశాల వైపు మనల్ని నడిపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరో మనల్ని వద్దన్నారనే బాధ కంటే.. ఆ తిరస్కరణ మనలో కసిని పెంచాలని..ఆ కసి మనల్ని అనుకున్న లక్ష్యం వైపు మరింత వేగంగా పరిగెత్తించే ఇంధనంలా పని చేయాలని ఆయన సూచించారు.
రిజెక్ట్ అయిన ప్రతిసారీ మనల్ని మనం తక్కువ చేసుకునే కంటే.. ఆత్మపరిశీలన చేసుకోవడం ముఖ్యమని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. మన నైపుణ్యాలలో లేదా టాలెంట్‌లో ఏవైనా లోపాలు ఉన్నాయేమో చూసుకుని.. వాటిని సరిదిద్దుకోవడానికి ఆ సమయాన్ని వెచ్చించాలి. ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు కచ్చితంగా తెరుచుకుంటుందని... కానీ ఆ లోపు మనం మరింత శక్తివంతులుగా తయారుకావాలని పూరి హితవు పలికారు. మన దగ్గర ప్రతిభ ఉన్నంత కాలం ప్రపంచంలో ఏ శక్తి మనల్ని ఆపలేదని అతడు గట్టిగా నమ్ముతారు.
మనం గౌరవించే ఎంతోమంది ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తులు ఒకప్పుడు తీవ్రమైన అవమానాలను, తిరస్కరణలను ఎదుర్కొన్నవారేనని పూరి గుర్తు చేశారు. క్రియేటివిటీ లేదని ఉద్యోగం నుంచి తీసేసిన వాల్ట్ డిస్నీ.. టీమ్ నుంచి తప్పించబడ్డ మైకెల్ జోర్డాన్.. టీవీకి పనికిరావని విమర్శలు ఎదుర్కొన్న ఓప్రా విన్‌ఫ్రే వంటి వారు ఆనాడు కుంగిపోతే ఈరోజు చరిత్రలో ఉండేవారు కాదు. వారి పొటెన్షియల్ ఆనాడు వారిని రిజెక్ట్ చేసిన వారికి తెలియలేదు.. అలాగే మన శక్తి ఏంటో కూడా మనల్ని కాదన్న వారికి అర్థం కాకపోవచ్చని ఆయన ఉదాహరణలతో వివరించారు.
చివరగా... మన గురించి మనకే సరిగ్గా తెలియనప్పుడు.. ఇతరులు మన గురించి ఇచ్చే నెగటివ్ ఫీడ్‌బ్యాక్ లేదా రిజెక్షన్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని పూరి జగన్నాథ్ సందేశాన్ని ఇచ్చారు. మనం ఒంటరిగా ఉన్నామా లేదా వందమంది మనల్ని కాదంటున్నారా అన్నది ముఖ్యం కాదు, మనపై మనకున్న నమ్మకమే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. తిరస్కరణను ఒక ఆభరణంగా మార్చుకుని.. మన టాలెంట్‌ను నిరంతరం మెరుగుపరుచుకుంటూ పోతే విజయం దానంతట అదే వస్తుందనేది ఈ పాడ్‌కాస్ట్ సారాంశం.
పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి `స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్` అనేది టైటిల్. సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఆయన రగ్గడ్ లుక్ .. చేతిలో రక్తంతో ఉన్న కత్తి ఈ సినిమా ఇంటెన్సిటీని ఆవిష్కరించాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై, హైదరాబాద్ పరిసరాల్లోని వివిధ లొకేషన్లలో జరుగుతోంది. 2026 చివరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
