Begin typing your search above and press return to search.

డిప్రెషన్ వల్ల ప్రయోజనాలా? 'పూరి మ్యూజింగ్స్'లోతైన విశ్లేషణ!

సాధారణంగా డిప్రెషన్ అనగానే అది ఒక చెడు స్థితి అని.. దానివల్ల నష్టాలే ఉంటాయని మనమందరం భావిస్తాం.

By:  Sivaji Kontham   |   9 May 2026 11:12 PM IST
డిప్రెషన్ వల్ల ప్రయోజనాలా? పూరి మ్యూజింగ్స్లోతైన విశ్లేషణ!
X

సాధారణంగా డిప్రెషన్ అనగానే అది ఒక చెడు స్థితి అని.. దానివల్ల నష్టాలే ఉంటాయని మనమందరం భావిస్తాం. అయితే ఈ వేగవంతమైన ప్రపంచంలో అప్పుడప్పుడు ఎదురయ్యే తక్కువ స్థాయి డిప్రెషన్ వల్ల కొన్ని ఊహించని ప్రయోజనాలు కూడా ఉన్నాయని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిప్రెషన్ మనల్ని శారీరకంగా మానసికగా కాస్త `స్లో డౌన్` చేస్తుంది. ఈ నిశ్శబ్దం మన గురించి మనం లోతుగా ఆలోచించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది ఇదే విష‌యాన్ని ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ త‌న పూరి మ్యూజింగ్స్ లో ఎంతో స్ప‌ష్ఠంగా వివ‌రించిన తీరు ఆక‌ట్టుకుంది.

డిప్రెషన్ ఫేస్‌లో ఉన్నప్పుడు మనం సాధారణంగా స్నేహితులను కలవడం మానేసి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాం. ఈ మూడ్ ఆఫ్ స్థితి మనల్ని`డీప్ థింకింగ్` వైపు నడిపిస్తుంది. మన అలవాట్లు ఏమిటి? మన సంబంధాలు ఎలా ఉన్నాయి? మనం వెళ్తున్న దారి సరైనదేనా? అని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. ఈ క్రమంలో మన జీవితం గురించి మనం అత్యంత నిజాయితీగా ఒక విశ్లేషణ చేసుకునే అవకాశం లభిస్తుంది.

ముఖ్యంగా ఈ సమయంలో మనిషిలో`అనలిటికల్ పవర్` పెరుగుతుంది. సమాజంలో ఇతరులతో పాటు మనం కూడా చేస్తున్న పొరపాట్లు ఏమిటో ఈ దశలో స్పష్టంగా అర్థమవుతాయి. మన వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దుకోవడానికి, సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఈ ఆత్మపరిశీలన ఒక పునాదిలా పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. భవిష్యత్తులో మనం మరింత దృఢంగా ఎదగడానికి ఇది ఒక లెర్నింగ్ ఫేస్‌లా ఉపయోగపడుతుంది.

అయితే ఇవన్నీ చదివాక డిప్రెషన్ చాలా మంచిది కదా అని అనుకుంటే పొరపాటే. దీనివల్ల లాభాలు ఉన్నా. అది పరిమితి దాటితే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. డిప్రెషన్ వల్ల నిద్ర కరువవ్వడం, విపరీతమైన ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది శారీరక ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. మానసిక వేదన పెరిగేకొద్దీ అది మనిషిని నిస్తేజంగా మార్చివేస్తుంది.. కాబట్టి దీనిని ప్రాథమిక దశలోనే గుర్తించి నియంత్రించడం ముఖ్యం.

తక్కువ స్థాయిలో ఉండే డిప్రెషన్ లేదా బాధ మనల్ని మనం మార్చుకోవడానికి తోడ్పడవచ్చు కానీ.. అది మరీ ఎక్కువైతే మాత్రం హానికరంగా మారుతుంది. జీవితంలో ప్రతి విషయంలోనూ సమతుల్యత పాటించడం చాలా అవసరం. బాధ కలిగినప్పుడు కుంగిపోకుండా... ఆ సమయాన్ని మన తప్పులను సరిదిద్దుకోవడానికి వాడుకుంటూనే.. మానసిక ఆరోగ్యం విష‌యంలో అప్రమత్తంగా ఉండాల‌నేది పూరి మ్యూజింగ్స్ సారాంశం. పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌లో ఒక భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి `స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్` అనేది టైటిల్. ఈ సినిమా షేప‌ప్ అవుతున్న విధానంపైనా, ద‌ర్శ‌కుడు పూరి పైనా సేతుప‌తి ఇప్ప‌టికే ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. కొంత గ్యాప్ త‌ర్వాత పూరి స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌నే కసితో ఉన్నారు.