Begin typing your search above and press return to search.

మోసం చేసిన వాడిని మైండ్ నుంచి ఎరేజ్ చేయ‌డ‌మే!

సాధారణంగా ఎవరైనా మోసం చేసినప్పుడు లేదా వెన్నుపోటు పొడిచినప్పుడు మనసులో సహజంగానే ఆగ్రహం, కక్ష, పగ వంటి ప్రతికూల భావాలు రగిలిపోతాయి.

By:  Srikanth Kontham   |   29 Sept 2026 9:41 AM IST
మోసం చేసిన వాడిని మైండ్ నుంచి ఎరేజ్ చేయ‌డ‌మే!
X

జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో సంద‌ర్భంలో నమ్మకద్రోహానికి .. మోసానికి గురవుతూనే ఉంటారు. అయితే ఆ మోసాన్ని ఎలా స్వీకరించాలి? మనల్ని దెబ్బతీసిన వారి పట్ల ఎలా వ్యవహరించాలి? అనే అంశంపై దర్శకుడు పూరి జగన్నాథ్ అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తాయి. `మోసం చేసిన వాడిని మైండ్ నుంచి శాశ్వతంగా ఎరేజ్ చేయడమే చేయాల్సిన మొదటి పని అని ఆయన ఇచ్చిన పిలుపు కేవలం ఒక సినీ డైలాగ్ కాదు.. నిత్య జీవితంలో ప్రశాంతతను కాపాడుకునే అద్భుతమైన జీవిత సత్యం.

సాధారణంగా ఎవరైనా మోసం చేసినప్పుడు లేదా వెన్నుపోటు పొడిచినప్పుడు మనసులో సహజంగానే ఆగ్రహం, కక్ష, పగ వంటి ప్రతికూల భావాలు రగిలిపోతాయి. `వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, మోసం చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకునేలా చేయాలి అని ఆలోచిస్తూ రోజూ మనసులోనే తెలియ‌ని నరకం అనుభవిస్తుంటాం. కానీ పగ పెంచుకోవడం వల్ల ఎదుటి వారికి జరిగే నష్టం ఏం ఉండదు. దానివల్ల మన అమూల్యమైన సమయం, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం మాత్రమే దెబ్బతింటాయి. కక్ష అనేది మనల్ని మనమే దహించుకునే అగ్ని లాంటిది.

అందుకే పూరి జగన్నాథ్ చెప్పినట్లుగా మోసగాళ్లను మైండ్ నుంచి పూర్తిగా డిలీట్ చేసేయాలి. మెదడు అనేది ప్రశాంత‌మైన స్థలం, అక్కడ మ‌న ఎదుగుదలకు, కుటుంబానికి, సంతోషానికి సంబంధించిన మంచి ఆలోచనలు మాత్రమే ఉండాలి. ముంచిన వ్యక్తుల గురించి ఆలోచిస్తూ వారిని మనసులో ఉంచుకోవడం అంటే? మన ప్రశాంతతను ఉచితంగా వారికి అప్పగించడమే. ద్రోహులను జ్ఞాపకాల నుంచి తుడిచిపెట్టడమే మనస్సుకు ఇచ్చే అతిపెద్ద బహుమతి.

ఒకవేళ జీవితంలో ఎప్పుడైనా అలాంటి వ్యక్తులు మళ్లీ ఎదురైతే ఏం చేయాలి? అనే ప్రశ్నకు పూరి చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. అలాంటి వారు కనిపిస్తే కనీసం చూడకూడదు. వారి ఉనికిని కూడా గుర్తించనట్లుగా ముందుకు వెళ్ళిపోవాలి. కోపం లేదా కక్ష కంటే అలక్ష్యం చాలా శక్తివంతమైనది. మనం వారిని పట్టించుకోకపోవడమే వారికి ఇచ్చే అతిపెద్ద శిక్ష. వారి పట్ల ఎలాంటి భావోద్వేగాన్ని చూపించకుండా ఉదాసీనంగా ఉండటమే నిజమైన పరిణతి.

మోసాన్ని అనుభవంగా భావించి పాఠాలు నేర్చుకోవాలే తప్ప దాన్నే ఒక భారంగా మోస్తూ జీవితాన్ని వృథా చేసుకోకూడదు. పగ తీర్చుకోవడం కంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడమే మనల్ని మోసం చేసిన వారికి ఇచ్చే సరైన జవాబు. దృష్టి ఎప్పుడూ గమ్యంపైనా ..భవిష్యత్తుపైనా ఉండాలి గానీ గడిచిపోయిన గతంపై లేదా నమ్మకద్రోహులపై ఉండకూడదు. స్వీయ ఎదుగుదలే అన్నింటికంటే గొప్ప విజయం అని గుర్తుంచుకోవాలి.

చివ‌రిగా ప్రశాంతత కన్నా విలువైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ మనతోనే ఉండరని.. కొందరు కేవలం పాఠాలు నేర్పడానికే వస్తారని గ్రహించాలి. మోసం చేసిన వారిని ద్వేషిస్తూ కాలం గడపడం కంటే? వారిని మైండ్ నుంచి పూర్తిగా డిలీట్ చేసి మనశ్శాంతిని కాపాడుకుంటూ ముందుకు సాగడమే పూరి మాటల అంతరార్థం. ఈ సూత్రాన్ని పాటిస్తే జీవితంలో ఎలాంటి మానసిక ఆందోళనలు లేకుండా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండొచ్చు.