పూరి మ్యూజింగ్స్: 'హవాలా' పుట్టుక వెనుక అసలు కథ!
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన `పూరి మ్యూజింగ్స్` ద్వారా ప్రపంచంలోని వింతలు, విశేషాలను తనదైన శైలిలో విశ్లేషిస్తుంటారు. తాజాగా `హవాలా` అనే వ్యవస్థ ఎలా పుట్టిందో వివరిస్తూ ఆయన ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు.
By: Sivaji Kontham | 9 May 2026 5:11 PM ISTప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన `పూరి మ్యూజింగ్స్` ద్వారా ప్రపంచంలోని వింతలు, విశేషాలను తనదైన శైలిలో విశ్లేషిస్తుంటారు. తాజాగా `హవాలా` అనే వ్యవస్థ ఎలా పుట్టిందో వివరిస్తూ ఆయన ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు. నేడు హవాలా అంటే కేవలం అక్రమ నగదు బదిలీ అని చాలామంది భావిస్తారు.. కానీ దీని వెనుక కొన్ని శతాబ్దాల నాటి చరిత్ర .. నాటి వ్యాపారుల అవసరాలు దాగి ఉన్నాయని పూరి తన మ్యూజింగ్స్‌లో చమత్కరించారు.
ఒకప్పుడు సముద్ర మార్గాలు కనిపెట్టక ముందు..విమానాలు లేని కాలంలో ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్లడం అంటే ప్రాణాలతో చెలగాటమే. వ్యాపారం చేయాలంటే గుర్రాలు, గాడిదలపై నెలల తరబడి ప్రయాణించాల్సి వచ్చేది. అప్పట్లో బంగారం, మసాలా దినుసులు, పట్టు వస్త్రాలు వంటి విలువైన వస్తువులను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలించేటప్పుడు వ్యాపారులకు అతిపెద్ద ముప్పు `దారి దోపిడీ దొంగల` రూపంలో ఎదురయ్యేది. తమ వెంట భారీగా నగదు లేదా బంగారం తీసుకువెళ్తే దారిలో దొంగలు దోచుకోవడమే కాకుండా ప్రాణహాని కూడా ఉండేది.
డబ్బు మనతో పాటు ప్రయాణించకూడదు.. కానీ మనం వెళ్లే గమ్యస్థానానికి ఆ డబ్బు క్షేమంగా చేరాలి అనే ఆలోచన నుండే ఈ వ్యవస్థ పుట్టింది. వ్యాపారులు తమ సమస్యకు పరిష్కారం కోసం ఆలోచిస్తున్న తరుణంలో కొన్ని శతాబ్దాల క్రితం మిడిల్ ఈస్ట్‌లో ఒక వినూత్న పద్ధతి మొదలైంది. నగదును భౌతికంగా తమ వెంట తీసుకెళ్లే బదులు.. నమ్మకస్థులైన వ్యక్తుల మధ్య జరిగే ఒక ఒప్పందంగా ఇది రూపుదిద్దుకుంది. ఇదే కాలక్రమేణా ప్రపంచవ్యాప్తమైంది.
దీని పనితీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక వ్యాపారి ఒక నగరంలో తనకు తెలిసిన ఏజెంట్‌కు డబ్బు ఇచ్చి మరో నగరంలో ఉన్న ఆ ఏజెంట్ భాగస్వామి దగ్గర అదే మొత్తాన్ని తీసుకునేవాడు. అంటే ఇక్కడ డబ్బు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణించదు. కేవలం సమాచారం మాత్రమే వెళ్తుంది. కేవలం ఒక కోడ్ లేదా ఒక గుర్తు ద్వారా ఈ లావాదేవీలు పూర్తయ్యేవి. వ్యాపారులకు వచ్చిన ఈ అద్భుతమైన ఆలోచనే నేటి `హవాలా`కు పునాది వేసింది.
ఈ వ్యవస్థలో నగదు కంటే ఎక్కువగా ప్రయాణించేది కేవలం `నమ్మకం` మాత్రమేనని పూరి అసలు విషయం చెప్పారు. ఎలాంటి కాగితాలు, బ్యాంకింగ్ రికార్డులు లేకపోయినా శతాబ్దాల తరబడి ఈ వ్యవస్థ సజావుగా సాగడానికి కారణం వ్యక్తుల మధ్య ఉండే ఆ అచంచలమైన నమ్మకమేనని పూరి జగన్నాథ్ అభిప్రాయపడ్డారు. వస్తువుల మార్పిడి జరుగుతున్నా..డబ్బు కదలకుండానే వ్యాపారాలు సాగడం వెనుక ఉన్న ఈ `నమ్మకపు మ్యాజిక్` గురించి ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.
అయితే ఇటీవలి కాలంలో కొందరు దురంధరులు భారతదేశం నుంచి బ్లాక్ మనీని విదేశాలకు తరలించడానికి కూడా హవాలా మార్గాన్ని ఎన్నుకోవడం తెలిసిందే. విదేశాలలో షెల్ కంపెనీలకు డబ్బు పంపించేందుకు అనీల్ అంబానీ లాంటి వ్యాపార ప్రముఖులు కూడా హవాలా మార్గాన్ని ఎన్నుకున్నారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీనిపై కోర్టు విచారణ సాగుతోంది. చాలా మంది హవాలా పేరుతో దేశాన్ని దోచుకోవడంపై నిరంతర చర్చ సాగుతోంది. ఒకప్పుడు వ్యాపారులు బందిపోట్ల నుంచి ఆస్తిని, ప్రాణాల్ని కాపాడుకునేందుకు కనిపెట్టిన `హవాలా ఈరోజుల్లో దేశాన్ని దోచుకు తినే మార్గంగా అవతరించింది.
