Begin typing your search above and press return to search.

పూరి జీవితంలో మ‌ర్చిపోలేని ఒకే ఒక్క రోజు!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్‌లో ఎన్నో విజయాలు.. సంచలనాలు ఉన్నాయి.

By:  Srikanth Kontham   |   20 Oct 2026 12:00 AM IST
పూరి జీవితంలో మ‌ర్చిపోలేని ఒకే ఒక్క రోజు!
X

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్‌లో ఎన్నో విజయాలు.. సంచలనాలు ఉన్నాయి. అయితే ఆయన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని.. గుండెల్లో పదిలంగా దాచుకున్న ఒకే ఒక్క రోజు ఉందంటే అది బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో గడిపిన క్షణాలే! అమితాబ్ బచ్చన్ అమితమైన అభిమాని అయిన పూరి ఆయనతో `బుద్ధా హోగా తేరా బాప్` అనే చిత్రాన్ని తెరకెక్కించి తన డ్రీమ్‌ను నెరవేర్చుకున్నారు. ఈ సినిమా మేకింగ్ సమయంలో జరిగిన ఒక విచిత్రమైన భావోద్వేగంతో కూడిన సంఘటనను పూరి ఎప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు.

సినిమా పూర్తయ్యాక ముంబైలోని ప్రసిద్ధ యష్ రాజ్ స్టూడియోలో ప్రత్యేక ప్రివ్యూ షోను ఏర్పాటు చేశారు. ఆ షోకి అమితాబ్ బచ్చన్ తన కుటుంబ సభ్యులతో సహా విచ్చేశారు. బిగ్ బీ కుటుంబంతో పాటు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. ఒక వైపు చిన్నతనం నుంచి ఆరాధించిన అభిమాన నటుడు, మరోవైపు ఆయన ఇష్టపడి చేసిన సినిమా.. ఈ రెండింటి మధ్య దర్శకుడిగా పూరి జగన్నాథ్ లోలోపల తీవ్ర ఉత్కంఠకు, భావోద్వేగానికి గురవుతూ సినిమా చూస్తున్నారు.

సినిమా ఇంటర్వెల్ కాగానే పూరి జగన్నాథ్ రిఫ్రెష్ అవ్వడానికి టాయిలెట్‌కి వెళ్లారు. అక్కడ ఆయన యూరిన్ పాస్ చేస్తుండగా.. ఊహించని విధంగా అమితాబ్ బచ్చన్ కూడా లోపలికి వచ్చారు. నేరుగా వచ్చి పూరి పక్కన ఉన్న యూరినల్ దగ్గర నిలబడి ఆయన కూడా యూరిన్ వేయడం ప్రారంభించారు. ఆ క్షణంలో పూరి జగన్నాథ్ షాక్‌కు గురయ్యారు. ఏ నటుడిని చూస్తూ తాను పెరిగాడో? ఎవరి ఫోటోను చూసి దర్శకుడు అవ్వాలని కలలు కన్నాడో? ఆ భారతదేశ సినీ దిగ్గజం తన పక్కనే నిలబడి ఉండటం పూరిని మైమరిపింపజేసింది.

ఆ క్షణంలో పూరి మనసులో అనేక ఆలోచనలు సుడులు తిరిగాయి. `ఇది కలా? లేక నిజమా?` అని తనకు తాను ప్రశ్నించుకున్నారు. కళ్లు మూసి తెరిచేలోగా తాను ఎక్కడో నర్సీపట్నం నుంచి వచ్చి బాలీవుడ్ మహానటుడిని డైరెక్ట్ చేయడమే కాకుండా ఆయనతో ఇలా ఒకే ప్రైవేట్ స్పేస్‌లో నిలబడే స్థాయికి రావడం పూరిని తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. ఆ సంఘటనతో పూరి కళ్ల వెంట ఆనంద భాష్పాలు సుడులు తిరిగాయి. ఒక సామాన్య అభిమానికి అంతకంటే పెద్ద విజయం, అనుభూతి మరొకటి ఉండదని పూరి భావించారు.

టాయిలెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమితాబ్ బచ్చన్ పూరి జగన్నాథ్ భుజం తట్టి, సినిమా ఇంటర్వెల్ వరకు వచ్చిన విధానంపై ఆయన టేకింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అమితాబ్ కుటుంబ సభ్యులు కూడా పూరి మేకింగ్‌ను.. బిగ్ బీని చూపించిన మాస్ యాంగిల్‌ను ఎంతగానో అభినందించారు. ఆ రోజు రాత్రి పూరికి నిద్ర పట్టలేదంటే అతిశయోక్తి కాదు. తన కల నెరవేరిన తీరును తలుచుకుంటూ పూరి రోజంతా ఆ భావోద్వేగంలోనే ఉండిపోయారు.

ప్రతి దర్శకుడి కెరీర్‌లో ఎన్నో హిట్లు, ఫ్లాప్‌లు, అవార్డులు రావచ్చు. కానీ అమితాబ్ బచ్చన్ వంటి లెజెండ్‌తో గడిపిన క్షణాలు, యష్ రాజ్ స్టూడియోలో జరిగిన అనుభూతి మాత్రం పూరి జగన్నాథ్ జీవితంలో అత్యంత ప్రత్యేకమైనవి. ఇప్పటికీ ఏ ఇంటర్వ్యూలోనైనా ఈ ప్రస్తావన వస్తే పూరి ఎంతో ఆనందంగా.. గర్వంగా ఆ క్షణాలను గుర్తు చేసుకుంటారు. అభిమానం, కృషి ఉంటే కలలు ఎలా నిజమవుతాయో? చెప్పడానికి పూరి జగన్నాథ్ జీవితంలోని ఈ ఒక్క రోజే నిదర్శనం.