Begin typing your search above and press return to search.

పూరి రెండున్న‌ర ద‌శాబ్దాల ప్ర‌యాణం!

ఏ క్రియేటర్ జీవితంలోనైనా ఎత్తుపల్లాలు సహజం. పూరి జగన్నాధ్ కూడా వరుస అపజయాలను ఎదుర్కొన్నారు.

By:  Srikanth Kontham   |   21 April 2026 12:11 PM IST
పూరి రెండున్న‌ర ద‌శాబ్దాల ప్ర‌యాణం!
X

తెలుగు సినీ పరిశ్రమలో మాస్ అనే పదానికి స‌రి కొత్త నిర్వచనం ప‌రిచ‌యం చేసిన‌ దర్శకుడు పూరి జగన్నాధ్. ఎలాంటి సినీ నేప‌థ్యం లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి అదే ప‌రిశ్ర‌మ‌లో తానో బ్రాండ్ గా ఎదిగారు. త‌న క‌లం బ‌లంతో ద‌ర్శ‌కుల్లో స్టార్ హీరోల ఇమేజ్ నే మార్చేసిన ఓ కొత్త త‌రం ద‌ర్శ‌కుడాయ‌న‌. సిటీకి ఎంతో మంది క‌మీష‌న‌ర్లు వ‌స్తుంటారు...పోతుంటారు. కానీ చంటిగాడు లోక‌ల్ అన్న డైలాగ్ లా `ప‌రిశ్ర‌మ‌కు ఎంతో మంది ద‌ర్శ‌కులు వ‌స్తుంటారు. పోతుంటారు. కానీ పూరి అనేవాడు ఓ బ్రాండ్ అంటూ త‌న డైలాగ్ నే త‌న ఐడెంటీగా మార్చేసు కున్నాడు.

హీరో క్యారెక్టరైజేషన్‌లో పూరి చూపించే వైవిధ్యం, రాసే పవర్ ఫుల్ డైలాగ్స్ పూరిని ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలబెట్టాయి. పూరి ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టి నేటితో 26 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. పూరి కెరీర్ ప్రారంభంలోనే `బద్రి` వంటి సంచలన విజయంతో పవన్ కళ్యాణ్ కెరీర్‌ను మలుపు తిప్పారు. అటుపై రిలీజ్ అయిన `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`,` ఈ అమ్మాయి చాలా మంచి వాడు`వంటి చిత్రాలు ఆయనలోని సున్నితమైన భావోద్వేగాలను ఆవిష్కరించాయి. అయితే `ఇడియట్` సినిమాతో పూరి జగన్నాధ్ టాలీవుడ్ ముఖచిత్రాన్నే మార్చేశారు. అప్పటి వరకు ఉన్న పద్ధతి గల హీరో పాత్రలను ప‌క్క‌న బెట్టి `పోకిరి` తత్వమున్న హీరోని పరిచయం చేసి యువతలో ఓ ఊపు తెచ్చారు.

పూరి కెరీర్‌లో `పోకిరి` ఓ మైలురాయి. ఆ సినిమాతో మహేష్ ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేయడమే కాదు. అప్పటి వరకూ ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన చిత్ర‌మది. మ‌హేష్ ని వంద కోట్ల క్ల‌బ్లో చేర్చిన చిత్ర‌మ‌ది. ఈ చిత్రం తో పూరి జగన్నాధ్ ఇమేజ్ ను తెచ్చుకున్నారు. స్టార్ హీరోలెవరైనా సరే? తమలోని మాస్ కోణాన్ని బయటకు తీయాలంటే పూరి దగ్గరకు వెళ్లాల్సిందే అనే పరిస్థితిని సృష్టించారు. రవితేజను మాస్ మహారాజాగా మార్చడంలో, అల్లు అర్జున్‌ను `దేశముదురు`గా చూపించడంలో విజన్ స్పష్టంగా కనిపిస్తుంది. `అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి`, `శివ‌మ‌ణి`, `చిరుత‌`, `టెంప‌ర్` , `ఇస్మార్ట్ శంక‌ర్` ఇలా ఎన్నో విజ‌యాలు పూరి చూసాడు. `బిజినెస్ మ్యాన్` చిత్రం పూరికి జాతీయ స్థాయిలో ప్ర‌త్యేక‌మైన గౌర‌వాన్ని, గుర్తింపును తెచ్చి పెట్టాయి. పూరి ట్యాలెంట్ చూసే బిగ్ బీ అమితాచ్చ‌న్ సైతం ఓ అవ‌కాశం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఏ క్రియేటర్ జీవితంలోనైనా ఎత్తుపల్లాలు సహజం. పూరి జగన్నాధ్ కూడా వరుస అపజయాలను ఎదుర్కొన్నారు. ఒక దశలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కథల విషయంలో మొరటుతనం పెరిగిందనే విమర్శలు ఎదుర్కున్నారు. భారీ అంచనాలతో వచ్చిన `ఆంధ్రావాలా`, `పైసా వ‌సూల్`, `లైగర్` స‌హా ప‌లు సినిమాలు డిజాస్టర్‌గా నిలవడం పూరి కెరీర్‌ను కొంత ఇబ్బందుల్లో నెట్టింది. కానీ ఓటమిని అంగీకరిస్తూనే మళ్ళీ పుంజుకోవడం పూరి శైలి. పూరి జగన్నాధ్ దర్శకుడే కాదు. మంచి ఫిలాసఫర్ కూడా. ఆయన సినిమాల్లోని పాత్రలు సమాజానికి భిన్నంగా ఆలోచిస్తాయి. `పూరి ముసింగ్స్` పేరుతో ఆయన పంచుకునే ఆలోచనలు నేటి యువతను బాగా ఆకర్షిస్తున్నాయి.

జీవితాన్ని, విజయాన్ని, అపజయాన్ని సమానంగా స్వీకరించే ఆయన వ్యక్తిత్వం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా? తనదైన శైలిలో సినిమాలు తీస్తూ వెండితెరపై నేటికి ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. మొత్తంగా పూరి జగన్నాధ్ 26 ఏళ్ల ప్రయాణం ఓ అద్భుతమైన పాఠం. టాలీవుడ్‌కి ఎందరో దర్శకులు వస్తుంటారు. వెళ్తుంటారు. కానీ పూరి జగన్నాధ్ సృష్టించిన `మ్యానరిజమ్స్` , `డైలాగ్స్` ఎప్పటికీ గుర్తుండిపోతాయి. పూరి మళ్ళీ బలమైన కథతో బాక్సాఫీస్ సత్తాను చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో పూరి పేరు సంచలనంగానే నిలిచిపోతుంది. ప్ర‌స్తుతం మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తితో హీరోగా పూరి `స్ల‌మ్ డాగ్ 33 టెంపుల్ రోడ్` అనే సినిమా చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.