Begin typing your search above and press return to search.

చిన్నారి పున‌ర్విక పై మ‌నోజ్ ఎమోష‌నల్ పోస్ట్..

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మాట‌ను మ‌నం రెగ్యుల‌ర్ గా వింటూనే ఉంటాం.

By:  Sravani Lakshmi Srungarapu   |   24 Feb 2026 12:40 PM IST
చిన్నారి పున‌ర్విక పై మ‌నోజ్ ఎమోష‌నల్ పోస్ట్..
X

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మాట‌ను మ‌నం రెగ్యుల‌ర్ గా వింటూనే ఉంటాం. సాటి మనిషి కష్టంలో ఉంటే వారిని కాపాడమ‌ని దేవుణ్ణి కోరుకోవ‌డం కంటే తోచిన సాయం చేయ‌డ‌మే ఎంతో గొప్ప అని నిరూపిస్తూ 11 నెల‌ల ప‌సిపాప ప్రాణాలు కాపాడేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు చేయి, చేయి క‌లిపారు. 2025, మే 12న పుట్టిన పున‌ర్విక శ్రీ పుట్టి ఆరు నెల‌ల‌వుతున్నా త‌న శ‌రీరాన్ని క‌దిలించ‌క‌పోవ‌డంతో పాపకు స్పైన‌ల్ మ‌స్క్యుల‌ర్ అట్రోఫీ అనే స‌మ‌స్య ఉంద‌ని డాక్ట‌ర్లు నిర్ధారించారు.

ఆ వ్యాధికి సంబంధించి జోల్‌జెన్‌స్మా ఇంజెక్ష‌న్ ఇవ్వాల‌ని డాక్ట‌ర్లు చెప్ప‌గా, ఆ ఇంజెక్ష‌న్ ధ‌ర అక్ష‌రాలా రూ.16 కోట్లు. కానీ పాప తండ్రి సురేష్ కు అంత ఆర్థిక‌ స్థోమ‌త లేదు. అందుకే పాప‌ను బ‌తికించుకోవ‌డానికి ఎన్నో విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మంత్రి టీజీ భ‌ర‌త్ ను క‌లిసి సాయం కోర‌గా, ఆయ‌న ప్ర‌భుత్వానికి లేఖ కూడా రాశారు. అలాగే అమ‌రావ‌తికి వెళ్లి అధికారుల్ని క‌లిసి త‌మ బిడ్డ‌కు సాయం చేయ‌మ‌ని కోరారు.

ఫండ్ రైజింగ్ చేయ‌గా, కొంత డ‌బ్బు వ‌చ్చింది. కానీ అది స‌రిపోదు. పున‌ర్విక‌కు వ‌చ్చిన క‌ష్టం గురించి తెలుసుకున్న తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌లు, సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు చలించిపోయారు. అంద‌రూ క‌లిసి #SavePunarvika పేరుతో ఫండ్ క‌లెక్ట్ చేసేందుకు క్యాంపెయిన్ ను స్టార్ట్ చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఒకే మాట అదే #SavePunarvika. ఇప్ప‌టికే ఈ క్యాంపెయిన్ లో భాగంగా ఎంతోమంది సైకిల్ ర్యాలీలు చేస్తూ, ఇంటింటికీ తిరిగి డ‌బ్బుల్ని క‌లెక్ట్ చేస్తుండ‌గా, పెద్ద వాళ్ల నుంచి పిల్ల‌ల వ‌ర‌కు అంద‌రూ త‌మ‌కు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. తుపాకీ. కామ్ కూడా ఇప్ప‌టికే మా వంతు స‌హాయాన్ని అందించ‌గా, ఈ విష‌యంపై ఇప్పుడు తాజాగా సినీ ఇండ‌స్ట్రీ నుంచి మంచు మ‌నోజ్ రియాక్ట్ అవుతూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.

మ‌నోజ్ త‌న పోస్ట్ లో SMA టైప్1 వ్యాధితో బాధ‌ప‌డుతున్న పున‌ర్విక ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉంద‌ని, ఈ వ్యాధికి రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఇస్తేనే న‌య‌మ‌వుతుంద‌ని కుటుంబ స‌భ్యులు చెప్తున్నార‌ని, అంత భారీ మొత్తం డ‌బ్బును జ‌మ చేయ‌డం సాధారణ కుటుంబానికి అసాధ్య‌మైన‌ప్ప‌టికీ #SavePunarvika పేరుతో దేశం న‌లుమూల‌ల నుంచి ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చి ఇప్ప‌టికే రూ.1 కోటి పైగా విరాళాలివ్వ‌డం ఆశాజ‌న‌కంగా మారింద‌ని, మాన‌వ‌త్వ‌తంతో ప్ర‌జ‌లు చేసిన స‌హ‌కారం ఇప్పుడు చిన్నారి ప్రాణాల‌కు ఆశాకిర‌ణంగా నిలుస్తోంద‌ని, ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి, తెలంగాణ సీఎం, ఏపీ సీఎం కార్యాల‌యాలు కూడా త‌క్ష‌ణం స్పందించి అవ‌స‌ర‌మైన ఆర్థిక సాయం అందించాల‌ని మ‌నోజ్ కోరారు.

పున‌ర్విక కోలుకుంటే అది ఆ ఒక్క కుటుంబ స‌క్సెస్ మాత్ర‌మే కాద‌ని, స‌మాజ‌మంతా క‌లిసి సాధించిన మాన‌వ‌త్వ విజ‌యంగా నిలుస్తుంద‌ని మ‌నోజ్ పోస్ట్ చేశారు. ఇప్ప‌టికే ఈ విష‌యంపై ప‌లువురు రెస్పాండ్ అయి, త‌మ వంతు సాయాన్ని చేస్తుండ‌గా, మ‌నోజ్ లాంటి సినీ సెల‌బ్రిటీ దీనిపై స్పందించ‌డంతో పున‌ర్విక‌కు మ‌రింత త్వ‌ర‌గా ట్రీట్‌మెంట్ జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మ‌నోజ్ ను చూసి మ‌రింత మంది సెల‌బ్రిటీలు స్పందించి, సాయం చేసే అవ‌కాశముంది. త్వ‌ర‌లోనే పున‌ర్విక ఇంజెక్ష‌న్ కు డ‌బ్బు సమ‌కూరి వైద్యం అందాల‌ని ఆశిద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పోరాటాలు గ‌తంలో కూడా జ‌రిగాయి. హైద‌రాబాద్ కు చెందిన ఆయాన్ష్ గుప్తా కోసం రూ.16 కోట్లు క‌లెక్ట్ చేసి ప్రాణాలు నిల‌బెట్టారు. రాజ‌స్తాన్ కు చెందిన నూర్ ఫాతిమా అనే పాప నిధులు స‌మ‌కూరే లోపే క‌న్నుమూయ‌గా, కోయంబ‌త్తూరుకు చెందిన జూహా జైనాబ్ కు అమెరికా కంపెనీ నిర్వ‌హించిన ల‌క్కీడ్రాలో ఉచితంగా ఇంజెక్ష‌న్ ల‌భించింది. ఇప్పుడు పున‌ర్విక విష‌యంలో కూడా అలాంటి అద్భుతం ఏదైనా జ‌ర‌గాల‌ని అంద‌రూ కోరుతున్నారు.