చిరు టు యష్.. ఆ డైరెక్టర్ స్క్రిప్ట్ జర్నీ ఎక్కడ ఆగుతోంది?
ఒక దర్శకుడి దగ్గర కథలు ఉండటం వేరు.. ఆ స్టోరీలతో స్టార్ హీరోలతో సినిమాలు చేయడం వేరు.
By: M Prashanth | 8 Sept 2026 7:15 PM ISTఒక దర్శకుడి దగ్గర కథలు ఉండటం వేరు.. ఆ స్టోరీలతో స్టార్ హీరోలతో సినిమాలు చేయడం వేరు. ఇప్పుడు నెట్టింట కోలీవుడ్ దర్శకుడు పీఎస్ మిత్రన్ విషయంలో అదే చర్చ జరుగుతోంది. ఇరుంబు తిరై, సర్దార్ వంటి సినిమాలతో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. సౌత్ లో పలువురు స్టార్ హీరోలకు కథలు వినిపించినట్లు రీసెంట్ గా చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ కథల్లో ఒక్కటి కూడా ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో అసలు మిత్రన్ స్క్రిప్ట్ జర్నీ ఎక్కడ ఆగుతోందనే ప్రశ్న వినిపిస్తోంది.
నిజానికి పీఎస్ మిత్రన్ తెరకెక్కించిన సినిమాల్లో కథ, టెక్నాలజీ, సోషల్ ఎలిమెంట్స్ ను కలిపే ప్రయత్నం కనిపిస్తుంది. నార్మల్ కమర్షియల్ ఫార్మాట్ కు భిన్నంగా తన స్టోరీల్లో కొత్త పాయింట్ చెప్పడం ఆయన స్టైల్. అయితే స్టార్ హీరోలతో వర్క్ చేయాలని ఆయనకు ఎప్పటి నుంచో ఉందట. అందుకే మెగాస్టార్ చిరంజీవి, సూర్య సహా పలువురు హీరోలకు కథలు వినిపించినట్లు రీసెంట్ గా సర్దార్ 2 ఈవెంట్ లో చెప్పారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కు కూడా అన్నాత్తే మూవీ తర్వాత ఒక స్టోరీ నెరేట్ చేసినట్లు తెలిపారు. దాదాపు 30 నిమిషాల పాటు కథను వివరించగా.. రజనీ అంతా విన్నారని తెలిపారు. కానీ స్టోరీ కొంత వరకు ఆసక్తికరంగా ఉన్నా.. ఆ తర్వాత తనకు కనెక్ట్ కాలేదని రజనీ మిత్రన్ కు చెప్పారట. అదే సమయంలో రీసెంట్ గా టాక్సిక్ తో నిరాశపరిచిన రాకింగ్ స్టార్ యష్ కు ఓ స్టోరీ నెరేట్ చేశారట మిత్రన్.
అది నార్మల్ యాక్షన్ స్టోరీ కాదని.. ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచర్ కథతో, స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్ తో రూపొందించాలనుకున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మిత్రన్ చెప్పారు. అయితే డేట్స్ సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు టాక్సిక్ పై పరోక్షంగా మాట్లాడారు. అడల్ట్ కంటెంట్ తో కూడిన ఎమోషన్స్ లేని గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా చేయడం కంటే.. ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న అడ్వెంచర్ సినిమా సెలెక్ట్ చేసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
అలా మిత్రన్ కు స్టార్ హీరోలతో పనిచేసే ఇంట్రెస్ట్ అండ్ టాలెంట్ ఉన్నా.. ఆయన కథలకు సరైన టైమ్, సరైన కాంబినేషన్, సరైన మార్కెట్ లెక్కలు కలవాల్సి ఉంది. స్టార్ హీరోల సినిమాలకు ఇప్పుడు భారీ బడ్జెట్లు, ఇంటర్నేషనల్ మార్కెట్, పాన్ ఇండియా రేంజ్ అంచనాలు ఉంటున్నాయి. దీంతో దర్శకుడి ఆలోచన ఎంత బాగున్నా.. దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా పరిస్థితులు కూడా ఉన్నాయి.
ఇక ప్రస్తుతం మిత్రన్ ఆశలన్నీ కార్తీ లీడ్ రోల్ లో నటిస్తున్న సర్దార్ 2పై ఉన్నాయి. ఆ సినిమా ప్రేక్షకులను ఓ రేంజ్ లో మెప్పిస్తే ఆయన నెక్స్ట్ ప్రాజెక్టులపై అందరి దృష్టి పడనుంది. సర్దార్ 2 విజయం సాధిస్తే.. ఇప్పటివరకు నరేషన్ స్టేజ్ లో ఆగిపోయిన కొన్ని కాంబినేషన్లు మళ్లీ సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి మిత్రన్ సర్దార్ 2 తర్వాత ఏ స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ అందుకుంటారో వేచి చూడాలి.
