Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ.. కానీ?

అయితే ధరలపై కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఇండియ‌న్ ఆడియ‌న్స్ ను ఆకట్టుకునే అంశం మరోటి ఉంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   11 May 2026 4:08 PM IST
ఓటీటీలోకి వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ.. కానీ?
X

హాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా భారీ స్థాయిలో చర్చకు దారితీసిన సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఒకటి. థియేటర్లలో అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి అడుగుపెట్టింది. ర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం భారతీయ ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్క‌డో ట్విస్ట్ ఉంది. సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చినప్పటికీ ఇది ఉచితంగా అందుబాటులో లేదు. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడాలంటే రూ.389 చెల్లించి రెంట్ తీసుకోవాల్సి ఉండగా, యాపిల్ టీవీలో రూ.299 రెంట్ లేదా రూ.599 పర్చేజ్ మోడల్‌ను అమలు చేస్తున్నారు.

ఇప్పటివరకు ఇండియ‌న్ ఆడియ‌న్స్ ఓటీటీ అంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని సినిమాలు చూడొచ్చనే మైండ్‌సెట్‌కు అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు హాలీవుడ్ స్టూడియోలు కొత్త బిజినెస్ మోడల్ వైపు అడుగులు వేస్తున్నాయి. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన సినిమాల‌ను వెంటనే ఉచిత స్ట్రీమింగ్‌కు ఇవ్వకుండా ముందుగా ప్రీమియం రెంటల్ మోడల్‌లో విడుదల చేస్తూ అదనపు ఆదాయం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే డ్యూన్, ఓపెన్‌హైమ‌ర్, బార్బీ లాంటి సినిమాల విషయంలో కూడా ఈ స్ట్రాటజీ కొంతవరకు కనిపించింది. ఇప్పుడు ప్రాజెక్ట్ హెయిల్ మేరీతో అదే మోడల్‌ను మరింత బలంగా అమలు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయ మార్కెట్‌లో కూడా ఈ విధానం నెమ్మదిగా బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు థియేటర్ కలెక్షన్స్, మరోవైపు ప్రీమియం ఓటీటీ రెంటల్స్ ద్వారా డబుల్ రెవెన్యూ సాధించాలనే ఆలోచనలో హాలీవుడ్ స్టూడియోలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

అయితే ధరలపై కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఇండియ‌న్ ఆడియ‌న్స్ ను ఆకట్టుకునే అంశం మరోటి ఉంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం విశేషం. గతంలో హాలీవుడ్ సినిమాలు ప్రధానంగా ఇంగ్లీష్, హిందీ వరకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు దక్షిణాది మార్కెట్ ప్రభావం పెరగడంతో రీజినల్ లాంగ్వేజ్ డబ్బింగ్‌కు భారీ ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంట‌ర్‌స్టెల్లార్, అవ‌తార్, డ్యూన్ లాంటి సినిమాల‌కు వచ్చిన రెస్పాన్స్ తర్వాత హాలీవుడ్ స్టూడియోలు నేరుగా ప్రాంతీయ ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా విజువల్ స్పెక్టకిల్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా డబ్బింగ్ ఇప్పుడు వారి వ్యూహంలో కీలక భాగంగా మారింది.

ఇక థియేటర్లలో కూడా ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శితమవుతుండటం ఆసక్తికరం. భారీ విజువల్స్, మంచి సౌండ్ డిజైన్, స్పేస్ అడ్వెంచర్ అంశాలతో రూపొందిన ఈ సినిమా చిన్న స్క్రీన్ కంటే పెద్ద తెరపైనే అసలైన అనుభూతిని ఇస్తుందనే అభిప్రాయం సినీ ప్రియుల్లో బలంగా ఉంది. అందుకే ఓటీటీలో అందుబాటులోకి వచ్చినప్పటికీ థియేటర్లలో దీనికి ఇంకా డిమాండ్ కొనసాగుతుండటం విశేషం. దీంతో ఫ్యూచ‌ర్‌లో కూడా భారీ హాలీవుడ్ సినిమాలు ఇలానే డ్యూయ‌ల్ బిజినెస్ మోడల్‌ను మరింత దూకుడుగా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.