మంత్రితో నిర్మాతల భేటీ అందుకేనా.. ఇలా ట్విస్ట్ ఇచ్చావేంటి వంశీ!
గత కొన్ని వారాల నుంచి 30% వేతనాలు పెంచాలని , లేకపోతే సినిమా షూటింగ్ కి హాజరుకామని పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు సినీ కార్మికులు.
By: Madhu Reddy | 11 Aug 2025 6:19 PM ISTతెలుగు సినీ ఇండస్ట్రీలో కార్మికుల సమ్మె సెగలు పుట్టిస్తోంది. గత కొన్ని వారాల నుంచి 30% వేతనాలు పెంచాలని , లేకపోతే సినిమా షూటింగ్ కి హాజరుకామని పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు సినీ కార్మికులు. అయితే ఒకేసారి 30% వేతనం అంటే నిర్మాతలకు భారంగా మారుతుందని, ప్రస్తుతం సినీ పరిశ్రమ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కార్మికుల డిమాండ్ ను అంగీకరించలేమని నిర్మాతలు స్పష్టం చేశారు. దీంతో సినీ కార్మికులు, ఫిలిం ఫెడరేషన్ సభ్యులు బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నిర్మాతలకు యూనియన్ల వల్లే అసలు సమస్య ఏర్పడుతోందని, సినీ పరిశ్రమ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, దయచేసి అర్థం చేసుకోవాలని నిర్మాతల గిల్డ్ కూడా కోరింది. అంతేకాదు పలువురు సినీతారలను కూడా ఇండస్ట్రీ నిర్మాతలు కలిశారు. కానీ సమస్య మాత్రం కొలిక్కి రావడం లేదు.
ఇకపోతే ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ఆధ్వర్యంలో దాదాపు 12 మంది నిర్మాతలు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ వేదికగా ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు ఒక్కొక్కరిగా తమ వాదనలు వినిపించారు. సినిమా పరిశ్రమ చాలా అద్వాన స్థితిలో ఉంది అని, నిర్మాతలు ఆర్థికంగా దిగజారిపోతున్నారని, ఇలాంటి సమయంలో కార్మికుల సమ్మె ఇండస్ట్రీ నష్టానికి దారితీస్తుంది అని స్పష్టం చేశారు.
ఇక మరొకవైపు ఇదే రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో సినీ, బడా నిర్మాతలు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ అయ్యారు. అయితే ఇలా భేటీ అవడంతో ఇండస్ట్రీలో సమస్యలను పరిష్కరించడానికి ఈ భేటీ జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ భేటీ అసలు ఉద్దేశం సమ్మె కాదు అంటూ నిర్మాత నాగ వంశీ సడన్ ట్విస్ట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.
అసలు విషయంలోకి వెళ్తే.. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ పై ప్రముఖ నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.." సినీ కార్మికుల సమ్మెతో ఈ భేటీకి ఎటువంటి సంబంధం లేదు. సినీ రంగాన్ని 'ప్రత్యేక పరిశ్రమ' గా గుర్తించాలని మంత్రిని కోరాము. రాష్ట్రంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసే యోచనలో భాగంగానే ఈ భేటీ నిర్వహించడం జరిగింది. అయితే త్వరలో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి సమస్యలను వివరిస్తామని సినిమాటోగ్రఫీ మంత్రి తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా కలుస్తాము".. అంటూ నిర్మాత క్లారిటీ ఇచ్చారు.
మొత్తానికి అయితే సమ్మె కోసం కాకుండా సినీ పరిశ్రమను ప్రత్యేక పరిశ్రమగా గుర్తించాలని కారణంతోనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినీ పరిశ్రమలో అన్ని సమస్యలు ఉంటే.. ఇప్పుడు మళ్లీ ప్రత్యేక పరిశ్రమ ఎందుకు అని కొంతమంది నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
