మేకర్స్‌ని భయపెడుతున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు. అందులో ఇప్పుడు ప్రధానంగా కొంత మంది పేరే వినిపిస్తోంది.
By: Ravindar Gorantla | 6 March 2026 3:00 PM ISTటాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు. అందులో ఇప్పుడు ప్రధానంగా కొంత మంది పేరే వినిపిస్తోంది. అందులో ఓ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు, తమిళ భాషల్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెళిగి యువతతో పాటు స్టార్స్‌ని కూడా తనదైన మార్కు మ్యూజిక్‌తో ఉర్రూతలూగించాడు. స్టేజ్‌పైనే పెర్ఫార్మ్ చేస్తూ స్టార్‌ల నుంచి విలువైన గిఫ్ట్‌లని సొంతం చేసుకుని టాలీవుడ్ మ్యూజిక్ వరల్డ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. పాన్ ఇండియా సినిమా టైమ్‌లోనూ అందరి దృష్టిని ఆకర్షించాడు.
అయితే ఆ మూవీ నుంచి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కెరీర్ మలుపు తిరిగింది. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో పాన్ ఇండియా మూవీకి డైరెక్టర్, హీరో మార్పులు చేశారు. ఫలితంగా సదరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ పాన్ ఇండియా మూవీకి కేవలం సాంగ్స్ కి మాత్రమే మ్యూజిక్ చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి క్రమంగా తన గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. అయితే సరే తను పారితోషికం విషయంలో ఎక్కడా తగ్గడం లేదట. ఒక్కో సినిమాకు తను రూ.12 కోట్లు డిమాండ్ చేస్తుండటంతో ప్రొడ్యూసర్స్ ఆయన పేరు చెబితేనే భయపడుతున్నారు.
ఆడియో పరంగా మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో తనతో చేయాలని ప్లాన్ చేసుకుంటున్న ప్రొడ్యూసర్లు తను డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ చూసి భయపడి ఆ ఆలోచనని విరమించుకుంటున్నారట. అంత మొత్తం చెల్లించి సదరు మ్యూజిక్ డైరెక్టర్‌ని తీసుకున్నా మ్యూజిక్ రైట్స్ రూపంలో పెట్టిన డబ్బుల్లో సగానికి పైగానే తిరిగి వస్తున్నాయట కానీ మొత్తానికి మొత్తం రావడం లేదట. దీంతో తన కంటే తమిళ సంచలనం అనిరుధ్ బెటర్ అని, అతన్ని తీసుకుంటే ఆడియో రైట్స్ పెట్టిన మొత్తానికి మించి వస్తుండటంతో అంతా ఇప్పుడు అనిరుధ్ వెంటపడుతున్నారని ఇన్ సైడ్ టాక్.
రీసెంట్‌గా ఓ పాన్ ఇండియా మూవీకి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించే అవకాశాన్ని వదులుకున్న సదరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తాజాగా మరో క్రేజీ స్టార్ మూవీని కూడా అలాగే వదులుకున్నాడని, ఆ అవకాశం తమన్‌ని వెతుక్కుంటూ వెళ్లిందని తెలిసింది. ఇలా వరుసగా అవకాశాలు చేజారుతున్నా తన యాటిట్యూడ్‌లో మాత్రం మార్పు రావడం లేదని, ఆ కారణంగానే సదరు మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెబితే ప్రొడ్యూసర్స్ భయపడుతున్నాని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. తన అవకాశాలని ఏ.ఆర్. రెహమాన్, అనిరుధ్ ఎగరేసుకుపోతున్నా సదరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌లో ఎలాంటి మార్పులు రాకపోవడం గమనార్హం.
ప్రస్తుతం సదరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా ఓ రూటెడ్ స్టోరీతో సినిమా చేస్తున్నాడు. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు తను మ్యూజిక్ అందిస్తున్నాడు. పారితోషికం భారీగానే తీసుకుంటున్నాడట. ఈ సినిమా తరువాతైనా సదరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పులు ఏమైనా వస్తాయా? లేక అదే యాటిట్యూడ్‌ని కంటిన్యూ చేసి తెలుగులో అవకాశాలు లేకుండా చేసుకుంటాడా? అని అంతా అవాక్కవుతున్నారు.
