Begin typing your search above and press return to search.

'వార‌ణాసి' టైటిలే కాదు.. 99శాతం స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాం!

సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సంచలనాత్మక చిత్రం `వారణాసి` టైటిల్ వివాదం సునాయాసంగా ముగియడం వెనుక కౌన్సిల్ కృషి ఎంతో ఉందని ప్రసన్న కుమార్ వెల్లడించారు.

By:  Sivaji Kontham   |   6 Sept 2026 9:43 AM IST
వార‌ణాసి టైటిలే కాదు.. 99శాతం స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాం!
X

తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతల సంక్షేమం, టైటిళ్ల నమోదు ప్రక్రియలో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పాత్ర అత్యంత కీలకమైనదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోని నిర్మాతల ఎదుర్కొంటున్న దాదాపు 99 శాతం సమస్యలను గిల్డ్ కంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిలే విజయవంతంగా పరిష్కరించిందని తెలిపారు. చెరుకూరి సుధాకర్ కోరగానే వై.వి.ఎస్. చౌదరి అమెరికాలో ఉండి కూడా `దసరా` టైటిల్‌ను బదిలీ చేయడం, సమంత నటించిన `మా ఇంటి బంగారం`, `కొరియన్ కనకరాజు`, `ఇరుముడి`, కమల్ హాసన్ `విక్రమ్: హిట్ లిస్ట్`, `సీతారామం`, అలాగే భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమైన `కల్కి 2898 AD` వరకు ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలు కౌన్సిల్ ద్వారానే టైటిల్ ప్రక్రియ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించాయని గుర్తుచేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సంచలనాత్మక చిత్రం `వారణాసి` టైటిల్ వివాదం సునాయాసంగా ముగియడం వెనుక కౌన్సిల్ కృషి ఎంతో ఉందని ప్రసన్న కుమార్ వెల్లడించారు. ఈ `వారణాసి` అనే టైటిల్‌ను ముందుగా ఒక చిన్న డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. అయితే కౌన్సిల్ ప్రతినిధులు సదరు నిర్మాతతో సామరస్యంగా మాట్లాడగా.. ఆయన సూపర్ స్టార్ కృష్ణ - మహేష్ బాబు కి అభిమాని కావడంతో పాటు.. ఈ చిత్రం భారతీయ సినిమా ప్రతిష్టను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్ అని గుర్తించి.. ఎంతో ఉదారతతో ఈ టైటిల్‌ను నిర్మాత కేఎల్ నారాయణ గారికి అప్పగించారని వివరించారు. ఈ అత్యంత భారీ బడ్జెట్ సినిమా కూడా కౌన్సిల్ నుంచే ముందడుగు వేసిందని.. ఇది కౌన్సిల్ సాధించిన మరో పెద్ద విజయమని ధీమా వ్యక్తం చేశారు.

చ‌ద‌ల‌వాడ సేవ‌లపై ప్ర‌శంస‌లు:

పరిశ్రమలోని చిన్న నిర్మాతలు - ఎగ్జిబిటర్ల ప్రయోజనాల కోసం వెట‌ర‌న్ నిర్మాత‌ చదలవాడు శ్రీనివాసరావు చేసిన సేవలను ప్రసన్న కుమార్ కొనియాడారు. థియేటర్ల వ్యవస్థను కాపాడుకునేందుకు.. చిన్న సినిమాలకు ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, పన్ను మినహాయింపులు వచ్చేలా ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా పాండమిక్ సమయంలో స్వయంగా తన సొంత నిధులతో వేలాది మంది సినీ కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు మరియు అత్యవసర ఆర్థిక సాయం అందించిన మహోన్నత వ్యక్తి అని గుర్తుచేశారు. అటు విలేకరులకు (జర్నలిస్టులకు) ఫ్లాట్లు అందించే ప్రణాళికతో పాటు.. సినీ ఇండస్ట్రీ డైరెక్టర్లకు నిరంతరం అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

సినీ దిగ్గజాలైన నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్).. రామోజీరావుల ఘనతను.. వారి జ్ఞాపకాలను సజీవంగా నిలిపేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆయన వివరించారు. రామోజీ ఫిల్మ్ సిటీ రామ్మోహనరావు గారి నివాసాన్ని.. అలాగే చెన్నైలోని ఎన్టీఆర్ గారి చారిత్రాత్మక నివాసాన్ని కొనుగోలు చేసి వాటిని సంరక్షిస్తున్న వైనాన్ని తెలియజేశారు. తమిళనాడులోని ఆ ప్రాంగణంలో ఎన్టీఆర్ `దాన వీర శూర కర్ణ` దుర్యోధనుడి రూపంలో 10 అడుగుల భారీ విగ్రహంతో పాటు, శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించి ఒక అద్భుతమైన మ్యూజియంగా తీర్చిదిద్దుతున్నారని వెల్లడించారు.

లాభాపేక్ష లేకుండా.. ఎటువంటి స్వార్థం లేకుండా చిత్ర పరిశ్రమ పురోగతి కోసం... నిరుపేద కళాకారుల సంక్షేమం కోసం పాటుపడుతున్న సదరు మహనీయుల సేవలను ప్రసన్న కుమార్ కీర్తించారు. పరిశ్రమ కష్టకాలంలో ఉన్నప్పుడల్లా సినీ కార్మికులకు, చిన్న నిర్మాతలకు బాసటగా నిలుస్తున్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో చిత్రసీమ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తుందని స్పష్టం చేశారు.