Begin typing your search above and press return to search.

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

సినిమా నిర్మాణంలో నిర్మాత, ఫైనాన్షియర్, ఇన్వెస్టర్ల బాధ్యతలు వేర్వేరుగా ఉంటాయి. వడ్డీకి అప్పు ఇచ్చే డెట్ ఫైనాన్షియర్లు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అసలు, వడ్డీ తీసుకుంటారు. ఈక్విటీ ఇన్వెస్టర్లు మాత్రం లాభనష్టాల్లో భాగస్వాములవుతారు. పన్నులు, కమీషన్లు, ప్రచార ఖర్చులు, అప్పులు, పెట్టుబడులు మినహాయించిన తర్వాత మిగిలిన నికర లాభాన్ని ఒప్పందం ప్రకారం పంచుకుంటారు.

By:  Sivaji Kontham   |   13 Nov 2026 9:38 AM IST
సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?
X

ఏదైనా సినిమాకి నిర్మాత స‌ర్వ‌స్వం. కానీ సినిమాకి పెట్టుబ‌డి పెట్టే ఫైనాన్షియ‌ర్ లేదా ఇన్వెస్ట‌ర్ ని కూడా నిర్మాత అనుకుని పొర‌బ‌డేందుకు ఆస్కారం ఉంది. ఇలాంటి తెర‌వెన‌క టెక్నిక‌ల్ విష‌యాల‌పై సినిమా రంగంలో వ్య‌క్తులకు ఉన్న అవ‌గాహ‌న‌, ఇన్ సైడ‌ర్ గా మారాల‌నుకునే బ‌య‌టి వ్య‌క్తుల‌కు ఉండ‌దు. నిర్మాత‌, ఇన్వెస్ట‌ర్ బాధ్య‌త‌లు ఒక‌టే అని కూడా క‌న్ఫ్యూజ్ అయ్యేందుకు ఛాన్సుంది.

అయితే ఇలాంటి ట్రేడ్ విష‌యాల‌తో పాటు, సాంకేతిక అంశాల‌పైనా జెన్ -జి ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ కి అవ‌గాహ‌న త‌ప్ప‌నిస‌రి. సినిమాకి వ‌చ్చే లాభ‌, న‌ష్టాల్లో ఇన్వెస్ట‌ర్ కి షేర్ ఎలా ఉంటుంది? నిర్మాత‌కు షేర్ ఎలా వ‌స్తుంది? .. అస‌లు సినిమా లాభాల్లో వాటాల‌ను ఎలా డిఫైన్ చేస్తారు? అనే విష‌యాల్ని స్ప‌ష్ఠంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.

నిజానికి నిర్మాత‌కు ఉండే బాధ్య‌త‌లు ఇన్వెస్ట‌ర్ కి ఉండ‌వు. అత‌డు కేవ‌లం అప్పు ఇచ్చేవాడు మాత్ర‌మే. ఆ అప్పుకు సంబంధించిన అస‌లు, వ‌డ్డీ రెండిటినీ సినిమా రిలీజ్ కి ముందే ల్యాబ్ క్లియ‌రెన్సుల స‌మ‌యంలో ఛేజిక్కించుకుని ఎగ్జిట్ అయిపోతారు. సినిమా ప్రీప్రొడ‌క్ష‌న్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా షూటింగ్ వ‌ర‌కూ వివిధ ద‌శ‌ల్లో సినిమాకి అన్నీ తానే అయి న‌డిపించేవాడే నిర్మాత‌. ఆర్టిస్టుల ఎంపిక‌, టెక్నీషియ‌న్ల సెలెక్ష‌న్, షెడ్యూల్స్, లొకేష‌న్స్, యూనిట్ల నిర్వ‌హ‌ణ, పారితోషికాల చెల్లింపులు వ‌గైరా వ‌గైరా ప్ర‌తి అంశంపైనా స్ప‌ష్ఠ‌మైన అవ‌గాహ‌న‌, ఇన్వాల్వ్‌మెంట్‌తో ముందుకు సాగే వ్య‌క్తి నిర్మాత‌. ఇన్వెస్ట‌ర్ల అవ‌స‌రం కూడా అత‌డు మాత్ర‌మే చూసుకుంటాడు.

సినిమా మేకింగ్ వ్య‌వ‌హారాల్లో ఇన్వెస్ట‌ర్ లేదా ఫైనాన్షియ‌ర్ వేలు పెట్ట‌కూడ‌దు. ఆ ప‌నిని నిర్మాత‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు మాత్ర‌మే హ్యాండిల్ చేయ‌డం సుర‌క్షితం. ఒక ర‌కంగా చెప్పాలంటే సినిమాకి సంబంధించిన ప్ర‌తి రిస్కును నిర్మాత భ‌రిస్తాడు. నిర్మాత రిస్కుల‌తో సంబంధం లేకుండా తాను ఇచ్చిన అస‌లు, వ‌డ్డీ క‌లిపి రిలీజ్ డేట్ ముందే అందుకుని సేఫ్ జోన్ లో ఉండేవాడు ఫైనాన్షియ‌ర్. సినిమా విడుద‌ల‌య్యాక లాభ న‌ష్టాల్లో అత‌డికి ఎలాంటి వాటాలు ఉండ‌వు.

ఇక సినిమాకు పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లలో ప్రధానంగా రెండు రకాలు ఉంటారు. మొదటి రకం `డెట్ ఫైనాన్షియర్`.. వీళ్లు వడ్డీ ప్రాతిపదికన అప్పు ఇస్తారు. నెలకు 1.5 శాతం నుండి 3 శాతం వరకు నిర్ణీత వడ్డీకి డబ్బులు ఇస్తారు. కొన్ని సార్లు ఇంకా ఎక్కువ వ‌డ్డీనే గుంజుతున్నారు. సినిమా వంద కోట్ల లాభం సాధించినా వీరికి అసలు, వడ్డీ మాత్రమే దక్కుతాయి. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా నిర్మాత తన సొంత ఆస్తులు అమ్మి అయినా వీరి బాకీ తీర్చాల్సిందే.. ఫైనాన్షియ‌ర్ ఎన్‌ఓసీ లేనిదే సినిమా విడుదల కాదు. రెండో రకం `ఈక్విటీ ఇన్వెస్టర్`. వీళ్లు వడ్డీ తీసుకోకుండా నిర్మాణంలో భాగస్వామి అవుతారు. సినిమా అన్ని మార్గాల ద్వారా లాభాల్లోకి వస్తేనే వీరికి వాటా దక్కుతుంది, నష్టపోతే వీరి పెట్టుబడి కూడా తుడిచిపెట్టుకుపోతుంది.

సినిమా విడుదలయ్యాక వచ్చే ఆదాయాన్ని పంచడానికి చిత్ర పరిశ్రమలో ఒక ప‌క్కా పద్ధతిని అనుసరిస్తారు. సినిమా ద్వారా వచ్చిన మొత్తం గ్రాస్ ఆదాయం నుండి ముందుగా పన్నులు, కమీషన్లు, ఆ తర్వాత ప్రింట్ అండ్ పబ్లిసిటీ ఖర్చులను మినహాయిస్తారు. అనంతరం వడ్డీకి డబ్బులు ఇచ్చిన ఫైనాన్షియర్ల అసలు, వడ్డీలను పూర్తిగా సెటిల్ చేస్తారు. ఆ తర్వాతే నిర్మాత, ఈక్విటీ ఇన్వెస్టర్లు తాము పెట్టిన అసలు పెట్టుబడిని వెనక్కి తీసుకుంటారు.

పై ఖర్చులు, అప్పులు, అసలు పెట్టుబడులన్నీ పోగా మిగిలిన సొమ్మును `నికర లాభం` (నెట్ ప్రాఫిట్) అంటారు. ఈ నికర లాభాన్ని ముందస్తు ఒప్పందం ప్రకారం నిర్మాత, ఈక్విటీ ఇన్వెస్టర్లు(స‌హ‌నిర్మాత‌లు) కొంత‌ నిష్పత్తిలో డ‌బ్బును షేర్ చేసుకుంటారు. ప్రస్తుత ట్రెండ్‌లో కొందరు స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ నికర లాభాల్లోనే 10 నుండి 30 శాతం వరకు వాటా (ప్రాఫిట్ షేర్) తీసుకుంటున్నారు. ఏదైనా సినిమాకి అత్యధిక రిస్క్ తీసుకునే నిర్మాతకు సినిమా హిట్ అయితే భారీ లాభాలతో పాటు శాశ్వత హక్కులు దక్కుతాయి. ఫ్లాప్ అయితే అంతే స్థాయిలో నష్టాలు ఎదురవుతాయి.