రూ.140 కోట్ల నష్టం రికవరీ అవ్వలేదు.. అయినా తగ్గను: మిరాయ్ నిర్మాత
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
By: M Prashanth | 19 Sept 2025 10:54 AM ISTరీసెంట్ గా వచ్చిన మిరాయ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ప్రస్థానంలోనే బిగ్గెస్ట్ హిట్ ను ఆయన సొంతం చేసుకున్నారు. రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఇప్పుడు దూసుకుపోతోంది.
దీంతో విశ్వప్రసాద్ హ్యాపీ మోడ్ లో ఉన్నారు. అంతే కాదు వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న ఆయన.. ఇప్పుడు బిగ్ రిలీఫ్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. తమ సంస్థ నుంచి కొన్ని నెలలుగా వచ్చిన పలు సినిమాల వల్ల భారీగా నష్టపోయినట్లు చెప్పారు.
తమ సంస్థ నుంచి వచ్చిన గత ఆరు సినిమాల వల్ల ఏకంగా రూ.140 కోట్ల నష్టాలను చవి చూశానని ఆయన చెప్పారు. నాన్ థియేట్రికల్ హక్కుల అమ్మే విషయంలో చేసిన పొరపాటే నష్టాలకు కారణమని చెప్పారు. 2021-2023 మధ్యకాలంలో నాన్ థియేట్రికల్ హక్కులకు ఫుల్ డిమాండ్ ఉండేదని విశ్వప్రసాద్ చెప్పారు.
కానీ గత ఏడాది నుంచి మొత్తం పరిస్థితులు మారిపోయాయని చెప్పిన విశ్వప్రసాద్.. ఓటీటీ ప్లాట్ ఫామ్ ల నుంచి డిమాండ్ చాలా వరకు తగ్గిపోయిందని తెలిపారు. అందుకే సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు అమ్మడం ఇబ్బందిగా మారిందని చెప్పుకొచ్చారు. ఆ కారణంగానే రూ.140 కోట్ల వరకు నష్టపోయానని తెలిపారు.
ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్, స్వాగ్, విశ్వం, వడక్కు పట్టి రామసామి వంటి సినిమాలు థియేట్రికల్ గా ఓకే అని.. కానీ ఓటీటీ హక్కుల డిమాండ్ తగ్గడం వల్ల భారీ నష్టం వచ్చిందని చెప్పారు. అ నష్టాల నుంచి ఇంకా రికవరీ జరగలేదని తెలిపారు. 2024లో రవితేజ ధమాకా సినిమా మాత్రమే లాభాలు తెచ్చిందని వెల్లడించారు.
ఓటీటీల క్యాలెండర్ ప్రకారం పలు సినిమాలను విడుదల చేయడం వల్ల కూడా నష్టాలు పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. అదే కంటిన్యూ అయితే కష్టమని చెప్పారు. ఏదేమైనా సినిమాలపై ప్రేమ మాత్రం మారదని చెప్పిన విశ్వప్రసాద్.. కొత్త తరహా కథలు ఎంపిక చేసుకుంటూ చిత్రాలు నిర్మిస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
