Begin typing your search above and press return to search.

సినీసీమకు మెగాస్టార్ ఒక్కడే.. చిరుపై SKN మెగా ఎలివేషన్..

నిర్మాత ఎస్‌కేఎన్‌ ఈ లిస్టులో ముందుంటారు. చిరంజీవిపై తన అభిమానాన్ని చెప్పడానికి ఆయన ఎప్పుడూ వెనకాడరు.

By:  M Prashanth   |   22 Aug 2026 3:10 PM IST
సినీసీమకు మెగాస్టార్ ఒక్కడే.. చిరుపై SKN మెగా ఎలివేషన్..
X

చిరంజీవిని అభిమానించే నిర్మాతలు, దర్శకులు టాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. కానీ కొందరి విషయంలో అది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మొదలైన అభిమానం కాదు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ, అభిమాన సంఘాల్లో తిరిగి.. తర్వాత అదే ఇండస్ట్రీలో నిర్మాతగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు. నిర్మాత ఎస్‌కేఎన్‌ ఈ లిస్టులో ముందుంటారు. చిరంజీవిపై తన అభిమానాన్ని చెప్పడానికి ఆయన ఎప్పుడూ వెనకాడరు.

‘బేబీ’తో నిర్మాతగా పెద్ద విజయాన్ని అందుకున్న తర్వాత ఎస్‌కేఎన్ పేరు మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం వరుస సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నా.. మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని మాత్రం సందర్భం వచ్చిన ప్రతిసారీ గుర్తు చేస్తుంటారు. ముఖ్యంగా చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నిర్మాతగా కంటే అభిమానిగానే ఎక్కువగా కనిపిస్తారు. ఇప్పుడు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి అదే కనిపించింది.

చిరంజీవికి బర్త్‌డే విషెస్ చెబుతూ ఎస్‌కేఎన్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “సృష్టికి సూర్యుడు ఒక్కడే.. దేవతలకు ఇంద్రుడు ఒక్కడే.. చుక్కలకు చంద్రుడు ఒక్కడే.. తెలుగు సినీసీమకు మెగాస్టార్ ఒక్కడే” అంటూ మొదలుపెట్టారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఆపోజిషన్లు మారినా చిరంజీవి పొజిషన్ మాత్రం మారలేదని రాసుకొచ్చారు. తరతరాలకు మార్గదర్శి, తెలుగు సినిమా పరిశ్రమకు దిక్సూచి అంటూ తన అభిమానాన్ని చూపించారు.

అయితే పోస్ట్‌లోని మాటలతో పాటు ఆయన షేర్ చేసిన ఫొటో కూడా హైలెట్ అవుతోంది. చిరంజీవి కాళ్లకు ఎస్‌కేఎన్ నమస్కరిస్తుండగా, చిరు ఆయనను ఆశీర్వదిస్తున్న మూమెంట్‌ను షేర్ చేశారు. “నా దేవుడు.. నా స్ఫూర్తి.. నా ఆక్సిజన్” అంటూ చిరంజీవి తనకు ఎంత ప్రత్యేకమో మరోసారి చెప్పారు. సాధారణంగా బర్త్‌డే రోజు స్టార్స్‌కు ఇండస్ట్రీ నుంచి వందల విషెస్ వస్తాయి. కానీ ఎస్‌కేఎన్ పోస్ట్‌లో మాత్రం ఒక నిర్మాత కంటే పాత అభిమాని ఎక్కువగా కనిపించారు.

నిజానికి ఎస్‌కేఎన్ గతంలోనూ చిరంజీవిపై ఇదే స్థాయిలో అభిమానం చూపించారు. మెగాస్టార్ గురించి మాట్లాడే సందర్భాల్లో తన ప్రయాణంలో ఆయన ప్రభావాన్ని గుర్తు చేస్తుంటారు. ఒకప్పుడు అభిమానిగా దూరం నుంచి చూసిన హీరోతో ఇప్పుడు ఇండస్ట్రీలోనే పరిచయం ఉండటం ఆయనకు ఎమోషనల్ మూమెంట్ అనే విషయం చాలాసార్లు ఆయన మాటల్లో కనిపించింది. అందుకే ఈసారి కూడా రెగ్యులర్ బర్త్‌డే విష్‌తో సరిపెట్టలేదు. చిరంజీవి ఇండస్ట్రీలో ఉన్న స్థానాన్ని తన స్టైల్‌లో చెబుతూ చివరకు “జై చిరంజీవ” అంటూ పోస్ట్ ముగించారు.