90 కోట్ల అప్పు తీర్చడం కోసం సినిమాలు తీసి 120 కోట్ల అప్పుల పాలయ్యాడు!
ముఖ్యంగా ప్రముఖ తమిళ హీరో నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడం ఈ సంక్షోభాన్ని మరింత పెంచింది.
By: Sivaji Kontham | 7 Jun 2026 9:33 AM ISTసినీ పరిశ్రమలో భారీ విజయాలు ఎంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయో లెక్కలు తప్పితే అంతకుమించిన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తాయని మరోసారి నిరూపితమైంది. ఒక ప్రముఖ సినిమా నిర్మాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెట్టి చివరకు సుమారు 120 కోట్ల రూపాయల భారీ నష్టాలను మూటగట్టుకోవడం ఇండస్ట్రీలో చర్చగా మారింది. త్వరలోనే నటుడిగా కూడా అరంగేట్రం చేయబోతున్న ఆయన గత కొన్ని ఏళ్లుగా తాను అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి గురించి ఓపెనవ్వడమే గాక..సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని బయటపెట్టారు.
అతడు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ఆర్థికంగా కోలుకునేలా చేయడం పక్కన పెడితే మరింతగా అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. అతడు వేరే బ్యానర్లలో రూపొందించాల్సిన సినిమాలను తన సొంత బ్యానర్‌లో నిర్మించాడు. వేరొక నిర్మాణ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడటంతో ఆ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి ఎలాగైనా పాత నష్టాల నుంచి గట్టెక్కవచ్చనే నమ్మకంతోనే అతడు రంగంలోకి దిగాడు.
ప్రముఖ తమిళ హీరోతో ఉన్న సత్సంబంధాలు, అనుబంధం కారణంగా అతడితో కలిసి కొన్ని సినిమాలు పూర్తి చేస్తే సమస్యలన్నీ సమసిపోతాయని సదరు నిర్మాత భావించారు. అయితే కథ అనుకున్న విధంగా సాగలేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లను టేకోవర్ చేయడానికి ముందే అతడికి దాదాపు 90 కోట్ల రూపాయల మేర పాత అప్పులు ఉన్నాయి. 2020 కంటే ముందే వరుస చిత్రాల ద్వారా ఆ అప్పులన్నింటినీ తీర్చేయాలనేది అతగాడి అసలు ప్రణాళిక. కానీ అనుకున్నదొక్కటి అయినదొక్కటి! అన్న చందంగా పరిస్థితులు తలకిందులై ప్రస్తుతం మొత్తం నష్టం అప్పు రూపంలో 120 కోట్లకు చేరిందట.
ముఖ్యంగా ప్రముఖ తమిళ హీరో నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడం ఈ సంక్షోభాన్ని మరింత పెంచింది. ఆ చిత్రంలో మంచి కథాంశం ఉన్నా.. ఆ సమయంలో ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకోలేదు. పాత సూపర్ హిట్ సినిమా `జెంటిల్మెన్` తరహాలోనే ఈ కథ ఉందనే విమర్శలు రావడం... పైగా కమర్షియల్ ఎలిమెంట్స్‌కు భిన్నంగా హీరో ఇందులో పెద్దగా ఫైట్లు చేయకపోవడం వంటి అంశాలు ప్రేక్షకులకు నచ్చలేదు. దాంతో ఆ చిత్రం వల్ల భారీగా నష్టపోవాల్సి వచ్చింది.
దీనికి తోడు అదే సమయంలో కరోనా మహమ్మారి ప్రవేశించడం ఈ నష్టాల తీవ్రతను పతాక స్థాయికి తీసుకెళ్లింది. మహమ్మారి కారణంగా అతడు నిర్మించిన రెండు భారీ చిత్రాల నిర్మాణం, విడుదల దాదాపు మూడేళ్ల పాటు నిలిచిపోయాయి. అందులో ఒక సినిమాకి రీఫండ్ల రూపంలోనే సుమారు 30 కోట్లు వెనక్కి ఇవ్వాల్సి రావడం, మరోవైపు షూటింగులు ఆలస్యమవ్వడంతో అప్పులపై వడ్డీలు కొండలా పెరిగిపోయాయి. నష్టాల నుంచి కోలుకోవడానికి చేసిన ప్రయత్నాలు కాస్తా.. వడ్డీల భారంతో కోలుకోలేని దెబ్బగా మారాయట పాపం! అప్పులు చేసి, ఆ అప్పుల్ని సినిమాలు తీసి తీర్చేద్దామనే ఆశతో మరిన్ని అప్పులు చేసి సదరు నిర్మాత చివరికి వడ్డీల సుడిగుండంలో చిక్కుకుని సర్వనాశనం అయ్యాడు.
