నానితో కలిసి రాలేదు పీకేతోనైనా కలిసొస్తుందా?
అటుపై మళ్లీ ప్రియాంక మోహన్ బాధ్యత నానినే తీసుకున్నాడు. `సరిపోదా శనివారం`లో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు.
By: Srikanth Kontham | 23 Sept 2025 12:00 PM ISTకన్నడ బ్యూటీ ప్రియాంక మోహన్ నాని హీరోగా నటించిన `గ్యాంగ్ లీడర్` తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికి కన్నడలో ఒక్క సినిమానే చేసింది. అయినా నాని టీమ్ అందం, అభినయం గల నాయిక కావడంతో మరో ఆలోచన లేకుండా ఎంపిక చేసారు. ఈ సినిమా కమర్శియల్ గా సక్సెస్ కానప్పటికీ నటిగా ఓ ఐడెంటిటీని తెచ్చిపెట్టింది. అటుపై శర్వానంద్ కు జోడీగా `శ్రీకారం`లో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా కూడా అమ్మడిని నిరాశ పరిచింది. దీంతో టాలీవుడ్ లో మళ్లీ ఛాన్స్ రావడానికి మూడేళ్లు పట్టింది. మధ్యలో తమిళ్ లో కొన్ని సినిమాలు చేసింది.
అటుపై మళ్లీ ప్రియాంక మోహన్ బాధ్యత నానినే తీసుకున్నాడు. `సరిపోదా శనివారం`లో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా మాత్రం మంచి విజయం సాధించింది. కానీ వెంటనే అవకాశాలు అందుకోవడంలో మాత్రం మళ్లీ విఫలమైంది. సరిగ్గా అదే సమయంలో `ఓజీ` సినిమాకు సుజిత్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రమిది. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. పవన్ కూడా చాలా ఆశలు పెట్టుకున్న ప్రాజెక్ట్ ఇది. అన్ని వైఫల్యాలకు `ఓజీ` సక్సెస్ ఒక్కటే సమాధానం చెబుతుందని నమ్ముతున్నారు.
అటు ప్రియాంక ఆశలన్నీ కూడా ఇదే ప్రాజెక్ట్ పై ఉన్నాయి. ఈ సినిమా విజయంతో బిజీ నటిగా మారాలని ఆశీస్తుం ది. ప్రియాంక గురించి పీకే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రత్యేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ప్రతిభావం తురాలని.. మంచి పాత్రతో ప్రేక్షకుల్ని అలరిస్తుందన్నారు. ఇండస్ట్రీలో మంచి భవిష్యత్ ఉంటుందని ఆకాంక్షించారు. మరేం జరుగుతుందన్నది చూడాలి. అయితే ఇక్కడే ఓ వార్త కూడా తెరపైకి వస్తోంది. పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా నటించిన భామలు పెద్దగా సక్సెస్ అవ్వలేదనే విమర్శ చాలా కాలంగా ఉంది.
ప్రత్యేకించి డెబ్యూ చిత్రాలు ఆయనతో చేస్తే కెరీర్ స్లోగా ఉంటుందనే వాదన ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది. ఆయన సరసన నటించిన వారు అతికొద్ది మంది మాత్రమే సక్సెస్ అయ్యారని అంటారు. పవన్ సరసన ఏ హీరోయిన్ ఎంపికైనా రిలీజ్ సమయంలో ఈ విమర్శ తెరపైకి వస్తుంటుంది. మరి ఆ విమర్శను `ఓజీ`తో తుడిచి పెట్టేస్తారేమో చూడాలి. `ఓజీ` విజయం అనంతరం ప్రియాంక మోహన్ ఓ నాలుగైదు కొత్త ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తే ఆ విమర్శ గంగలో కలిసినట్లే.
