ఆ విషయంలో రాజమౌళి హెల్ప్ తీసుకుంటున్నా
తెలుగు సినిమా స్థాయి గతంతో పోలిస్తే విపరీతంగా మెరుగైన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తెలుగులో సినిమాలు చేయడానికి, తెలుగు వారితో పని చేయడానికి, తెలుగు మాట్లాడటానికి ఆసక్తి చూపుతున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 8 Feb 2026 12:00 AM ISTతెలుగు సినిమా స్థాయి గతంతో పోలిస్తే విపరీతంగా మెరుగైన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తెలుగులో సినిమాలు చేయడానికి, తెలుగు వారితో పని చేయడానికి, తెలుగు మాట్లాడటానికి ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే ఇతర భాషలకు చెందిన స్టార్లు కూడా తెలుగులో సినిమాలు చేస్తుంటే, మరికొందరు కేవలం సినిమాలు చేయడమే కాకుండా తెలుగులో మాట్లాడి, తమ డబ్బింగ్ ను తామే చెప్పుకుని ఆడియన్స్ ను ఇంప్రెస్ కూడా చేస్తున్నారు.
తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి
అయితే తెలుగు సినిమా స్థాయి అంతగా పెరగడానికి కారణం రాజమౌళి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి గత సినిమాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయి గుర్తింపుని అందుకున్నాయో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వారణాసి అనే యాక్షన్ డ్రామాను చేస్తున్నారు.
సెట్స్ పై ఉన్న వారణాసి
ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లి పలు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్ గా చిత్ర యూనిట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో హోస్ట్ ప్రియాంకను మీరు వారణాసి కోసం కొత్త భాషను నేర్చుకుంటున్నారు కదా ఆ జర్నీ ఎలా ఉందని అడిగారు.
ఇంకా తెలుగు నేర్చుకోలేదు
దానికి ప్రియాంక మాట్లాడుతూ, తాను ఇంకా తెలుగు నేర్చుకోలేదని, ఇంకా చెప్పాలంటే తానేం మాట్లాడుతున్నానో కూడా తనకు తెలియదని, సినిమాలో డైలాగ్స్ ను మాత్రం డైరెక్టర్ రాజమౌళి దగ్గర నేర్చుకుని చెప్తున్నానని, కానీ తెలుగు మాత్రం ఇప్పటివరకు రాదని ఆమె చెప్పారు. తనతో పాటూ తన తోటి నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ కు కూడా తెలుగు రాదని, కానీ తనకంటే అతనే బెటర్ అని ఆమె చెప్పారు.
మామూలుగా తెలుగులో మాట్లాడటం ఒకెత్తు అయితే, సెట్స్ లో మాట్లాడటం చాలా కష్టమని ఆమె చెప్పారు. అందుకే ఈ విషయంలో తాను తన డైరెక్టర్ రాజమౌళి హెల్ప్ తీసుకుని, ఆ డైలాగ్ ను ఎలా చెప్పాలి? అసలు దాని అర్థమేంటనేది తెలుసుకుని, ఓ పది నిమిషాల పాటూ దానిపై వర్క్ చేసి, ఆ తర్వాత తన స్టైల్ లో ఆ డైలాగ్ ను చెప్తున్నానని, ఇది అంత ఈజీ ఏమీ కాదని, కానీ తనకు ఛాలెంజెస్ అంటే ఇష్టమని ఆమె చెప్పారు. తెలుగు భాష నేర్చుకోవడం గురించి ప్రియాంక మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
