పూల్‌సైడ్ ట్రీట్.. హైదరాబాద్ వేడికి ప్రియాంక చోప్రా సొల్యూషన్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో పాటు టాలీవుడ్‌లోనూ బిజీగా గడుపుతోంది.
By: Sivaji Kontham | 1 Jun 2026 9:46 AM ISTగ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో పాటు టాలీవుడ్‌లోనూ బిజీగా గడుపుతోంది. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న `వారణాసి` చిత్రంలో ఈ గ్లోబల్ బ్యూటీ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై టు హైదరాబాద్.. హైదరాబాద్ టు ముంబై ప్రయాణాలతో పీసీ ఎంతో బిజీగా ఉంటోంది. ఒకవైపు ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాను పూర్తి చేయడంపైనే కాకుండా..అటు హాలీవుడ్‌లో తన ప్రాజెక్టులను పునరుద్ధరించడంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ప్రముఖ హాలీవుడ్ నటుడు ఓర్లాండోతో కలిసి ఒక సరికొత్త థ్రిల్లర్ మూవీ `రీసెట్`లో నటిస్తున్నట్లు పీసీ ఇటీవల వెల్లడించింది.
ప్రస్తుతం ఈ సమ్మర్‌లో భాగ్యనగరం వేడితో మండిపోతోంది. హైదరాబాదులో వారణాసి షూటింగ్ షెడ్యూల్స్ మధ్య ఈ విపరీతమైన వేడి నుండి ఉపశమనం పొందేందుకు ప్రియాంక చోప్రా స్విమ్మింగ్ పూల్‌ను ఆశ్రయించింది. పూల్‌సైడ్ బికినీ లుక్‌లో తన ఒంపుసొంపులను ప్రదర్శిస్తూ.. ఎంతో అందంగా కనిపించిన కొన్ని ఫోటోలు, వీడియోలను పీసీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా.. అవి కాస్తా అంతర్జాలంలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు పీసీ పూల్‌సైడ్ గ్లామర్ ట్రీట్‌ను చూసి క్రేజీ లైకులు, కామెంట్లు పెడుతూ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు.
మరోవైపు సోషల్ మీడియా వేదికలలో ప్రియాంక నటించిన సైన్స్ ఫిక్షన్ స్పై యాక్షన్ సిరీస్ `సిటాడెల్` గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అదే సమయంలో ప్రియాంక ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ విశేషాలు కూడా వైరల్ అవుతున్నాయి. మహిళల ఆర్థిక స్వేచ్ఛ, స్త్రీ సాధికారత గురించి మాట్లాడిన ప్రియాంక.. తన వజ్రాభరణాలను తానే సంపాదించిన సొంత డబ్బుతో కొనుక్కుంటానని స్పష్టం చేసింది. ఒకరిపై ఆధారపడకుండా సొంతంగా ఎదగాలనే ఆమె ఆలోచనా విధానం - ఆత్మవిశ్వాసం ఈ ఇంటర్వ్యూలో కనిపించింది.
నిజానికి 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకున్నప్పటి నుండి ప్రియాంక చోప్రా ప్రస్థానం ఎంతో స్పూర్తిదాయకంగా సాగింది. బాలీవుడ్‌లో ఫ్యాషన్ (2008), బర్ఫీ (2012), భాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలలో అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన పీసీ అమెరికన్ టెలివిజన్ సిరీస్ `క్వాంటికో` ద్వారా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తొలి సౌత్ ఏషియన్ మహిళగా చరిత్ర సృష్టించింది. కేవలం నటిగానే కాకుండా ప్రొడ్యూసర్, వ్యాపారవేత్త - యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా విద్యా రంగం, మహిళల హక్కులు, బాలల సంక్షేమం కోసం తను నిరంతరం పోరాడుతోంది.
2018లో పాప్ సింగర్ కమ్ యాక్టర్ నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న తర్వాత పీసీ భారతదేశానికి అంతర్జాతీయ సాంస్కృతిక చిహ్నంగా తన ఛరిష్మాను ప్రదర్శిస్తోంది. ప్రతిభ, భారీ లక్ష్యాలు, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో హాలీవుడ్, బాలీవుడ్ మార్కెట్లను ఏకకాలంలో శాసిస్తున్న భారతీయ మహిళగా ప్రియాంక దూసుకుపోతోంది. ముఖ్యంగా సంబంధాల కంటే కూడా ఒక మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం- సొంత గుర్తింపు ఎంత అవసరమో ఆమె చెప్పిన మాటలు నేటి తరం యువతులలో స్ఫూర్తిని నింపుతున్నాయి.
