Begin typing your search above and press return to search.

హాలీవుడ్‌లో డే టార్గెట్ ఒత్తిడి… బాలీవుడ్‌లో రిలాక్డ్స్‌గా..

హాలీవుడ్‌, బాలీవుడ్‌ రెండింట్లోనూ తన ప్రతిభను చాటుకున్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ రెండు సినీ ప‌రిశ్ర‌మ‌ల మ‌ధ్య ఉన్న వ‌ర్కింగ్ స్టైల్ తేడాల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   7 March 2026 10:00 PM IST
హాలీవుడ్‌లో డే టార్గెట్ ఒత్తిడి… బాలీవుడ్‌లో రిలాక్డ్స్‌గా..
X

హాలీవుడ్‌, బాలీవుడ్‌ రెండింట్లోనూ తన ప్రతిభను చాటుకున్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ రెండు సినీ ప‌రిశ్ర‌మ‌ల మ‌ధ్య ఉన్న వ‌ర్కింగ్ స్టైల్ తేడాల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సినిమా నిర్మాణంలో పని వేగం, షెడ్యూల్ నిర్వహణ, షూటింగ్ విధానం లాంటి అంశాల్లో హాలీవుడ్‌, ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీల మధ్య చాలా తేడాలున్నాయ‌ని ఆమె పేర్కొన్నారు.

క్వాంటికో సిరీస్ తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు

2003లో రిలీజైన ది హీరో: ల‌వ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా, త‌ర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తరువాత ప‌లు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకుని 2015లో రిలీజైన హాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ క్వాంటికో ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం హాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాజెక్ట్‌లలో ప్రియాంక బిజీగా ఉన్నారు.

హాలీవుడ్ లో డే టార్గెట్స్

అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ, హాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లు ఎంతో క్రమబద్ధంగా జరుగుతాయని.. అక్కడ ప్రతిరోజూ ఏ సీన్ షూట్ చేయాలి? ఎన్ని షాట్లు తీసుకోవాలి అనేది ముందుగానే చాలా ఖచ్చితంగా ప్లాన్ చేస్తారని తెలిపారు. ఒక రోజులో చేయాల్సిన పని ఆ రోజే పూర్తవ్వాలి అనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని ఆమె వివరించారు. షూటింగ్‌కు ముందు ప్రతి సన్నివేశానికి సంబంధించిన షాట్ బ్రేక్‌డౌన్ సిద్ధంగా ఉండటంతో, ఆ రోజు లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పారు. అందుకే హాలీవుడ్‌లో పని చేసే సమయంలో సమయపాలన, ప్రణాళిక, క్రమశిక్షణ చాలా కీలకంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

బాలీవుడ్ షూటింగుల్లో ఒత్తిడి ఉండ‌దు

ఇక ఇండియ‌న్ సినిమాల విషయానికి వస్తే ఇక్క‌డ పని విధానం కొంత భిన్నంగా ఉంటుందని ప్రియాంక అన్నారు. ఇండియన్ సినిమాల్లో ఒక రోజు షూటింగ్‌లో ప్లాన్ చేసిన పని పూర్తికాకపోయినా పెద్దగా ఒత్తిడి ఉండదని తెలిపారు. అవసరమైతే ఆ సన్నివేశాలను తర్వాతి రోజుల్లో పూర్తి చేస్తారని చెప్పారు. కొన్నిసార్లు ఒక పెద్ద యాక్షన్ లేదా కీలక సన్నివేశాన్ని షూట్ చేసిన త‌ర్వాత కొన్ని రోజులు లేదా వారాల విరామం తీసుకుని మళ్లీ త‌ర్వాతి షెడ్యూల్ ను మొద‌లుపెట్టే పద్ధతి చాలా కామ‌న్ గా చూస్తుంటామ‌ని వివరించారు.

ఈ త‌ర‌హా షెడ్యూల్స్ కారణంగానే భారతీయ నటుల‌కు ఒకేసారి రెండు లేదా మూడు సినిమాల్లో పనిచేసే అవకాశం ఉంటుంద‌ని, కానీ హాలీవుడ్‌లో మాత్రం ఒక సినిమా షూటింగ్ ప్రారంభమైన తరువాత దాదాపు మూడు నెలల పాటూ రెగ్యుల‌ర్ గా పని చేస్తూ మొత్తం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తారని తెలిపారు. ఇది లాజిస్టిక్ పరంగా ఎలా నిర్వహిస్తారో ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ, అక్కడి పరిశ్రమలో ఈ విధానం సమర్థవంతంగా పనిచేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. హాలీవుడ్‌, బాలీవుడ్ రెండింటికీ తమతమ ప్రత్యేకతలున్నాయని.. పని విధానం, షూటింగ్ పద్ధతులు వేర్వేరుగా ఉన్నప్పటికీ రెండు పరిశ్రమలు కూడా తమతమ శైలిలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.