Begin typing your search above and press return to search.

హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా జోరు త‌గ్గిందే!

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ తార ప్రియాంక చోప్రా జోనాస్ హాలీవుడ్‌లో ప్రయాణాన్ని కొన‌సాగిస్తున్నా? రెండేళ్ల‌గా అక్క‌డా సినిమాల సంఖ్య తగ్గడం చర్చనీయాంశమైంది.

By:  Srikanth Kontham   |   19 July 2026 10:00 PM IST
హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా జోరు త‌గ్గిందే!
X

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ తార ప్రియాంక చోప్రా జోనాస్ హాలీవుడ్‌లో ప్రయాణాన్ని కొన‌సాగిస్తున్నా? రెండేళ్ల‌గా అక్క‌డా సినిమాల సంఖ్య తగ్గడం చర్చనీయాంశమైంది. ఈ రెండేళ్ల‌ కాలంలో అమ్మ‌డు పరిమిత ప్రాజెక్టులకు మాత్రమే పరిమితమయ్యారు. గ‌త ఏడాది రిలీజ్ అయిన `హెడ్స్ ఆఫ్ స్టేట్`, ఇటీవల విడుదలైన `ద బ్లఫ్` వంటి సినిమాల్లోనే కనిపించారు. అంత‌కు ముందు ఏడాది మూడు సినిమాలు చేసిన న‌టి? ఒక్క‌సారిగా అక్క‌డా సైలెంట్ అవ్వ‌డం అభిమానుల్ని నిరూత్సాహ ప‌రుస్తోంది. మ‌రి అందుకు కార‌ణాలు ఏంటి? అంటే? ర‌క‌ర‌కాలు రీజ‌న్స్ తెర‌పైకి వస్తున్నాయి.

పీసీ వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పులేనని కొంద‌రంటున్నారు. వివాహం .. మాతృత్వం ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయని ప్రియాంక స్వయంగా వెల్ల‌డించిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో పీసీ మాట్లాడుతూ, `నేను ఇప్పుడు పాతలాగా ఏడాదికి ఐదు సినిమాలు చేయలేను. నా జీవితంలో సమతుల్యత ముఖ్యం` అని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడంలో సమర్థవంతమైన ప్రణాళికను అనుసరిస్తున్నారు. హాలీవుడ్‌లో తనకు లభిస్తున్న పాత్రల వైవిధ్యంపై కూడా అసంతృప్తిగా ఉన్నారు.

బాలీవుడ్‌లో వ‌చ్చిన‌న్ని అవ‌కాశాలు హాలీవుడ్‌లో ఇంకా దక్కలేదని ఓ సంద‌ర్భంలో బహిరంగంగానే అభిప్రాయపడ్డారు. కేవలం నటించడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న పాత్రల కోసం కూడా అంతే ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే సొంత ప్రొడక్షన్ సంస్థ ద్వారా కథలను ఎంచుకోవడం.. నిర్మించడంపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. పనితీరు విషయంలో ఆందోళన అవసరం లేదని అమ్మ‌డి కెరీర్ గ్రాఫ్ చెబుతోంది. `ద బ్లఫ్` చిత్రంలోని నటనకు గానూ పీసీ ఇప్పటికే ఉత్తమ నటిగా క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్‌కు నామినేషన్ పొందడం విశేషం.

ఇది పీసీలోని అభినేత్రికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఆదరణను సూచిస్తోంది. పరిమాణం కంటే నాణ్యతకే పీసీ ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రియాంక భారతీయ సినీ రంగంలో కూడా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్ `వారణాసి`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇలా హాలీవుడ్ అవకాశాలతో పాటు భారతీయ సినిమాల వైపు పీసీ మళ్లడం కెరీర్ స్ట్రాటజీలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నా? మూలాలను మర్చిపోకుండా ప్రాజెక్టులను ఎంచుకోవడంలో పరిణతి కనిపిస్తోంది. చివ‌రిగా ప్రియాంక చోప్రా కెరీర్ హాలీవుడ్‌లో నెమ్మ దించలేదని అభిమానులు న‌మ్ముతున్నారు. కేవలం కెరీర్‌ను వ్యూహాత్మకంగా మలుచుకుంటున్నారు. పీసీ గమ్యం సినిమాల సంఖ్య కాదు. పాత్రలోని లోతు, ప్రభావం. మాతృత్వ బాధ్యతలు, గ్లోబల్ ప్రాజెక్టులు స్వదేశీ సినిమాలు ఇలా అన్నింటినీ సమతుల్యం చేస్తూ ప్రియాంక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు..