Begin typing your search above and press return to search.

'వార‌ణాసి' త‌ర్వాత పీసీ ఈ న‌టుడితోనే ఎందుకిలా? అంత‌మంది పెద్ద హీరోలు ఉండ‌గా!

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌‌లో పెద్ద హీరోలతో ఎందుకు సినిమాలు చేయడం లేదనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్రంగా నడుస్తోంది.

By:  Sivaji Kontham   |   3 Oct 2026 9:35 AM IST
వార‌ణాసి త‌ర్వాత పీసీ ఈ న‌టుడితోనే ఎందుకిలా? అంత‌మంది పెద్ద హీరోలు ఉండ‌గా!
X

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌‌లో పెద్ద హీరోలతో ఎందుకు సినిమాలు చేయడం లేదనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్రంగా నడుస్తోంది. ఒకప్పుడు వరుస హిట్లు సాధించి..బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ బ్యూటీ డన్‌గా హిందీ చిత్రాలకు దూరంగా జరగడం వెనుక పలు ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో కొందరి తీరు కారణంగా తాను ఇండస్ట్రీలో అణచివేతకు గురయ్యానని అందుకే బాలీవుడ్‌ను వీడి హాలీవుడ్ బాట పట్టానని ప్రియాంక స్వయంగా గత ఇంటర్వ్యూలలో వెల్లడించారు. బాలీవుడ్ అగ్ర హీరోలు లేదా నిర్మాణ సంస్థలు తన స్టార్‌డమ్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం...సినిమాల్లో సరైన పాత్రలు దక్కకపోవడం వంటి అంశాలు ఈ నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించాయి.

సైఫ్ అలీ ఖాన్ మినహా దాదాపు బాలీవుడ్‌లోని ఇతర టాప్ హీరోలు, ఖాన్‌ల త్ర‌యంతో పీసీకి సరైన సినిమాలు పడకపోవడానికి వాతావరణం అనుకూలించకపోవడమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫర్హాన్ అక్తర్ నిర్మాణంలో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయాల్సి ఉన్నా అది రకరకాల సమస్యల కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. నిజానికి ప్రియాంక చోప్రా వంటి గ్లోబల్ స్టార్‌డమ్‌ ఉన్న నటితో పెద్ద హీరోలు సినిమా చేస్తే.. ఆ చిత్రానికి నేరుగా పాన్ వరల్డ్ అప్పీల్ వస్తుంది. అయినా బాలీవుడ్ మేకర్స్ గ్లోబ‌ల్ ఐకాన్ ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోవడంతో పీసీ ఇతర పరిశ్రమల వైపు అడుగులు వేయాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం `వారణాసి`లో నటించే అవకాశాన్ని ప్రియాంక చోప్రా వెంటనే క్యాచ్ చేసారు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన ఈ బ్యూటీ అవ‌కాశం ద‌క్కించుకుంది. రాజమౌళి లాంటి గ్లోబల్ డైరెక్టర్ తనను ఈ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించడం.. సెట్స్‌లో ఆయన కల్పించిన సౌకర్యవంతమైన వాతావరణం.. తనను ఎంతో రక్షణాత్మకంగా చూసుకునే విధానంపై ప్రియాంక ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్ట్ తో పీసీ తిరిగి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోకి ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇస్తుండటం అభిమానులకు పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు.

`వారణాసి` సినిమా తర్వాత ప్రియాంక చోప్రా తన తదుపరి ప్రణాళికలను మరింత పక్కాగా అమలు చేస్తున్నారు. చాలా కాలం తర్వాత `ది లంచ్ బాక్స్` దర్శకుడు రితేష్ బత్రా తెరకెక్కించనున్న ఒక ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కోసం సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి నటించేందుకు చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఖరారైతే.. ఈ ఇద్దరు స్టార్స్ లీడ్ రోల్స్‌‌లో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇన్నాళ్లు బాలీవుడ్ డైరెక్ట్ సినిమాలకు దూరంగా ఉన్న ప్రియాంక ఇప్పుడు గ్లోబల్ స్టాండర్డ్స్‌తో కూడిన కంటెంట్-డ్రివెన్ చిత్రాలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను వినూత్నంగా మలుచుకుంటున్నారు.

బాలీవుడ్ అగ్ర హీరోలు లేదా పెద్ద బ్యానర్లు తన ఇమేజ్‌‌కు తగినట్లుగా గౌరవించకపోవడం... ఇండస్ట్రీలోని కొన్ని పక్షపాత ధోరణుల వల్లే ప్రియాంక చోప్రా హిందీ సినిమాలకు దూరమయ్యారు. అయితే కేవలం బాలీవుడ్ పరిధిలోనే ఆగిపోకుండా తన గ్లోబల్ ఇమేజ్‌ను అడ్డుపెట్టుకుని హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో పాటు రాజమౌళి లాంటి దర్శక ధీరులతో పాన్ ఇండియా చిత్రాలు చేయడం ద్వారా తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. భ‌విష్య‌త్ లైనప్ చూస్తుంటే..బాలీవుడ్ పెద్ద హీరోలతో సంబంధం లేకుండానే పీసీ తనకంటూ ఒక ప్రత్యేకమైన.. తిరుగులేని స్థానాన్ని అంతర్జాతీయ స్థాయిలో సుస్థిరం చేసుకుంటున్నారని స్పష్టమవుతోంది.