Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్‌ల కంపెనీల్ని కొనేస్తున్న రిల‌య‌న్స్!

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు పలువురు కథానాయికలు ఇప్పుడు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు.

By:  Sivaji Kontham   |   1 May 2026 4:00 AM IST
స్టార్ హీరోయిన్‌ల కంపెనీల్ని కొనేస్తున్న రిల‌య‌న్స్!
X

బ్యూటీ ఉత్ప‌త్తులు- లైఫ్ స్టైల్ రంగంలో ప్రస్తుతం ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ప్రియాంక చోప్రాకు చెందిన `అనోమలీ, ఆలియా భట్ స్థాపించిన `ఎడ్-అ-మమ్మ` వంటి సెలబ్రిటీ బ్రాండ్‌లను రిలయన్స్ రిటైల్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు సొంతం చేసుకోవడం ఒక కొత్త విప్లవానికి నాంది పలికింది. సెలబ్రిటీలకు ఉండే అపారమైన ఫ్యాన్ బేస్, వారి బ్రాండ్ ఇమేజ్‌కు కార్పొరేట్ సంస్థల ఆర్థిక శక్తి తోడవ్వడంతో ఈ ఉత్పత్తులకు మార్కెట్‌లో తక్షణమే విపరీతమైన గుర్తింపు, విశ్వసనీయత లభిస్తున్నాయి. ఇది కేవలం గ్లామర్ కోసమే కాకుండా.. నాణ్యమైన ఉత్పత్తులను సామాన్యులకు చేరువ చేసే వ్యూహంగా మారుతోంది.

ఈ విలీనాల వల్ల భారతీయ వినియోగదారులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన ఉత్పత్తులు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వీగన్, సస్టైనబుల్ .. `క్లీన్ బ్యూటీ` వంటి ఆధునిక కాన్సెప్ట్‌లను ఈ గ్లోబల్ ఐకాన్స్ తమ బ్రాండ్ల ద్వారా పరిచయం చేస్తున్నారు. రిలయన్స్ వంటి సంస్థల వద్ద ఉన్న భారీ పంపిణీ వ్యవస్థ కారణంగా.. ఇన్ని రోజులు ఖరీదైనవిగా భావించిన విదేశీ స్థాయి ఉత్పత్తులు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలకే లభిస్తున్నాయి. ఇది స్థానిక మార్కెట్‌లోని ఇతర బ్రాండ్లకు గట్టి పోటీనిస్తూనే.. మార్కెట్ స్థాయిని పెంచుతోంది.

డిజిటల్ - ఫిజికల్ విస్తరణ విషయంలో ఈ భాగస్వామ్యాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. రిలయన్స్ గ్రూప్‌కు చెందిన `టిరా` వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని ఫిజికల్ స్టోర్ల ద్వారా ఈ సెలబ్రిటీ బ్రాండ్లు మూలమూలలకు చేరుతున్నాయి. కేవలం రిలయన్స్ మాత్రమే కాకుండా.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ వంటి ఇతర సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. ఉదాహరణకు మసాబా గుప్తా ప్రారంభించిన `లవ్‌చైల్డ్` .. ఆమె ఫ్యాషన్ లేబుల్ `హౌస్ ఆఫ్ మసాబా`లో ఆదిత్య బిర్లా గ్రూప్ మెజారిటీ వాటాలను దక్కించుకోవడం విశేషం.

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు పలువురు కథానాయికలు ఇప్పుడు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. కత్రినా కైఫ్ స్థాపించిన `కే బ్యూటీ` నైకా భాగస్వామ్యంతో సంచలనం సృష్టిస్తుండగా.. దీపికా పదుకోన్ 82°ఇ బ్రాండ్ గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోంది. సౌత్ స్టార్ నయనతార కూడా `ది లిప్ బామ్ కంపెనీ` ద్వారా తన వ్యాపార దక్షతను చాటుకుంటున్నారు. సన్నీ లియోన్ వంటి వారు తమ బ్రాండ్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.

మొత్తానికి కార్పొరేట్ సంస్థల వద్ద ఉన్న `పెట్టుబడి శక్తి`..సెలబ్రిటీల వద్ద ఉన్న `బ్రాండ్ ఇమేజ్` కలిసినప్పుడు అది మార్కెట్‌లో తిరుగులేని శక్తిగా మారుతోంది. నటీమణులు కేవలం తెరపై కనిపించే తారలుగానే కాకుండా..తమ సొంత సామ్రాజ్యాలను నిర్మించి వాటిని పెద్ద కంపెనీలకు విక్రయించే స్థాయికి ఎదగడం మహిళా సాధికారతకు కొత్త అర్థాన్ని ఇస్తోంది. ఈ పరిణామం భారతీయ బ్యూటీ మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా.. వినియోగదారులకు నాణ్యమైన.. వైవిధ్యమైన ఎంపికలను అందిస్తోంది.

ప్రియాంక చోప్రా చేరిక‌తో గ్లోబల్ రేంజ్ బిజినెస్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ స్థాపించిన ప్రముఖ హెయిర్ కేర్ బ్రాండ్ `అనోమలీ`ని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ కొనుగోలు చేస్తూ అధికారిక ప్రకటన చేసింది. ఈ కీలక ఒప్పందంతో బ్రాండ్ ట్రేడ్‌మార్క్‌లు, మేధో సంపత్తి .. డిజిటల్ ఆస్తులపై రిలయన్స్‌కు పూర్తి యాజమాన్య హక్కులు లభించాయి. 2021లో క్లీన్, వీగన్ .. సరసమైన ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను అందించే లక్ష్యంతో ప్రారంభమైన ఈ బ్రాండ్.. ఇప్పటికే అంతర్జాతీయంగా విశేష ఆదరణ పొందింది. రిలయన్స్ తన రిటైల్ నెట్‌వర్క్.. `టిరా` వంటి ఆధునిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అనోమలీని భారత్‌తో పాటు ఉత్తర అమెరికా, బ్రిటన్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భారీ ఎత్తున విస్తరించేందుకు గ్లోబల్ రేంజ్ ప్లాన్ సిద్ధం చేసింది.

ఈ బ్రాండ్ విక్రయం తర్వాత కూడా ప్రియాంక చోప్రా ఇందులో `క్రియేటివ్ డైరెక్టర్`గా కొనసాగుతూ.. ఉత్పత్తుల రూపకల్పన.. బ్రాండ్ విజన్‌ను పర్యవేక్షించనున్నారు. ముఖ్యంగా భారతీయ వినియోగదారుల జుట్టు.. స్కాల్ప్ సమస్యలకు అనుగుణంగా సరికొత్త ఉత్పత్తులను తీసుకురావడంపై రిలయన్స్ ప్రత్యేక దృష్టి సారించింది. రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ సారధ్యంలో.. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఈ హెయిర్ కేర్ బ్రాండ్ సామాన్యులకు మరింత చేరువ కానుంది. ప్రియాంక చోప్రా వంటి గ్లోబల్ ఐకాన్ బ్రాండ్‌ను సొంతం చేసుకోవడం ద్వారా విదేశాల‌లోను బ్యూటీ సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని రిలయన్స్ భావిస్తోంది.