Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ వేదికపై అద్భుత కలయిక!

ఇండియ‌న్ సినిమా టూ ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయికి ఎదిగిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోరు హాలీవుడ్‌లో సరికొత్త మైలురాళ్లను అందుకుంటోంది.

By:  Sivaji Kontham   |   20 Jun 2026 1:39 PM IST
అంతర్జాతీయ వేదికపై అద్భుత కలయిక!
X

ఇండియ‌న్ సినిమా టూ ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయికి ఎదిగిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోరు హాలీవుడ్‌లో సరికొత్త మైలురాళ్లను అందుకుంటోంది. హాలీవుడ్ వెండితెరపై కూడా వైవిధ్యాన్ని చాటుకుంటున్న పీసీ నిరంతరం క్రేజీ ప్రాజెక్టులతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా అమ్మ‌డు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. హాలీవుడ్ అగ్ర నటి, ఆస్కార్ విజేత ఏంజెలీనా జోలీతో కలిసి సరికొత్త ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు ప్రియాంక స్వయంగా వెల్ల‌డించారు. ఈ ప్రకటన అంత‌ర్జాతీయ మీడియాలో సంచలనాన్ని సృష్టిస్తోంది.

అయితే ఈ కాంబినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పీసీ రహస్యంగా ఉంచారు. ఇదొక పూర్తి స్థాయి హాలీవుడ్ సినిమానా? లేక అంతర్జాతీయ బ్రాండ్ ప్రకటన రంగమా? సమాజంలో మార్పు తీసుకొచ్చే ఏదైనా సామాజిక సేవా కార్యక్రమమా? అనే విషయాలపై పీసీ క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే ఇద్దరు గ్లోబల్ ఐకాన్స్ ఒకే వేదికపైకి వస్తున్నారనే వార్త ప్రపంచవ్యాప్త సినీ ప్రియులలో భారీ అంచనాలను, ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సందర్భంగా ఏంజెలీనా జోలీపై తనకున్న గౌరవాన్ని ప్రియాంక పంచుకున్నారు. ఏంజెలీనా జోలీ వంటి నటీమణులు వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ ఎంతో స్ఫూర్తినిస్తారని కొనియాడారు.

జోలీ కేవలం వెండితెరపైనే కాకుండా ఐక్యరాజ్యసమితి రాయబారిగా అంతర్జాతీయంగా చేస్తున్న సామాజిక సేవలు, మానవతా దృక్పథం ఎందరికో ఆదర్శంగా నిలిచాయని.. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం రావడం ఒక గొప్ప అనుభూతిగా ప్రియాంక భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇద్ద‌రి మధ్య ఉన్న సృజనాత్మక బంధం మరింత బలోపేతం కానుందని తెలుస్తోంది. ఇంకా హాలీవుడ్‌లో తమదైన ముద్ర వేసిన ఇతర అంతర్జాతీయ తారలైన పెనెలోప్ క్రజ్, సల్మా హాయెక్ వంటి నటీమణుల కెరీర్ గ్రాఫ్‌ను కూడా తాను ఎంతో గౌరవిస్తానని ప్రియాంక ఈ సందర్భంగా వెల్లడించారు.

భిన్నమైన సంస్కృతులు, దేశాల నుండి వచ్చి హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర స్థానానికి చేరుకున్న ఈ నటీమణుల ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో నటీనటులకు మార్గదర్శకంగా నిలిచిందని పీసీ కొనియాడారు. హాలీవుడ్‌లో వైవిధ్యాన్ని, గ్లోబల్ సినిమా సంస్కృతిని పెంచడంలో వీరి పాత్ర అనన్య సామాన్య‌మైంద‌ని పీసీ కొనియాడారు. ప్రియాంక చోప్రా కూడా ఇదే తరహా గ్లోబల్ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాల నుండి అంతర్జాతీయ సిరీస్‌ల ద్వారా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి నేడు గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన ఆమె ప్రయాణం ఎంతో మంది ఆసియా నటీనటులకు స్ఫూర్తిదాయకం. హాలీవుడ్ అగ్ర తారలతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతర్జాతీయ ప్రాజెక్టులలో కీలక పాత్రలు పోషిస్తున్న పీసీ ఇప్పుడు ఏంజెలీనా జోలీతో జతకట్టడం ఆమె అంతర్జాతీయ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం.