Begin typing your search above and press return to search.

అంత పెద్ద స్టార్ అలా మాట్లాడ‌రు.. ప్రియ‌మ‌ణి ఎమోష‌న‌ల్!

కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా ప్రియమణి నటనకు, అద్భుతమైన నృత్య ప్రతిభకు ఎంతోమంది తెలుగు హీరోలు, దర్శకులు ఫిదా అయ్యారు.

By:  Sivaji Kontham   |   12 Oct 2026 9:00 AM IST
అంత పెద్ద స్టార్ అలా మాట్లాడ‌రు.. ప్రియ‌మ‌ణి ఎమోష‌న‌ల్!
X

జాతీయ ఉత్త‌మ‌ నటి ప్రియమణి కొన్నేళ్ల క్రితం ఒక గెట్-టుగెదర్‌ సందర్భంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ని కలిసిన క్షణాలను.. ఆయన గొప్ప మనసును గుర్తుచేసుకుంటూ ఎంతో ఆనందంగా దానిని పాడ్ కాస్ట్ లో షేర్ చేసారు. సినిమా రంగంలో ఎంతోమంది దిగ్గజాలతో పనిచేసినా షారుఖ్ లాంటి అంతర్జాతీయ స్థాయి స్టార్ వ్యక్తిత్వం -వినయపూర్వక స్వభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ప్రియ‌మ‌ణి తెలిపారు.

ఆ గెట్-టుగెదర్‌కి బాలీవుడ్‌లోని ప్రముఖులందరూ హాజరయ్యారని... ఆ సమయంలో షారుఖ్ ఖాన్ స్వయంగా తనను తోటి నటులకు పరిచయం చేస్తూ ''ఈ అమ్మాయి వల్లనే నేను డాన్స్ నేర్చుకున్నాను.. ఈ అమ్మాయే నా డాన్స్ టీచర్'' అని అందరి ముందు అన్నారని ప్రియమణి వెల్లడించారు. ఆయన అంతగా చెప్పాల్సిన అవసరం లేకపోయినా.. ఒక స్టార్ హీరో అంత గొప్పగా మాట్లాడటం చాలా పెద్ద విషయమనిపించిందని... అక్కడి ఇతర నటులు కూడా షారుఖ్ సర్ సాధారణంగా ఎవరి గురించి అలా మాట్లాడరని చెప్పడంతో ఆ క్షణం తనకెంతో ప్రత్యేకంగా నిలిచిందని పేర్కొన్నారు.

కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా ప్రియమణి నటనకు, అద్భుతమైన నృత్య ప్రతిభకు ఎంతోమంది తెలుగు హీరోలు, దర్శకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా `యమదొంగ` సినిమా ప్రమోషన్స్ సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ -దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సైతం త‌న‌ డ్యాన్సులను, నటనను బహిరంగంగానే ఎంతో కొనియాడారు. ఇలా తెలుగు చిత్రసీమలో కూడా పలు సందర్భాలలో ప్రముఖులు ఆమెలోని నటిని ప్రశంసిస్తూనే ఉన్నారు.

ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు అందుకున్నా షారుఖ్ ఖాన్ ఇచ్చిన ఆ ప్రత్యేకమైన గుర్తింపు మాత్రం తనకు ఎప్పటికీ చాలా స్పెషల్ అని ప్రియమణి భావిస్తున్నారు. మాలాంటి వాళ్ళకి ఒక గ్లోబల్ స్టార్ హీరో నుండి అలాంటి ప్రశంసలు, గౌరవం దక్కడం జీవితంలో ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ప్రియ‌మ‌ణి ఆ ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు.

ఇక ప్ర‌స్తుత‌ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ప్రియమణి వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. 2026లో ఆమె తెలుగులో ఎస్ స‌ర‌స్వ‌తి.. జ‌న నాయ‌గ‌న్ చిత్రాలు విడుద‌ల‌య్యాయి. వాటి ఫ‌లితాలు కూడా వ‌చ్చాయి. అలాగే G.D.N చిత్రంలో చెల్లమ్మాళ్ పాత్రలో అలరించనున్నారు. తదుపరి 2027లో విడుద‌ల కానున్న‌ హిందీ ఫ్రాంచైజీ చిత్రం గోల్ మాల్ 5లోనూ ప్రియ‌మ‌ణి కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

ఫ్యామిలీమ్యాన్ సిరీస్ త‌ర్వాత‌..

ప్ర‌స్తుతం ప్రియ‌మ‌ణికి ఓటీటీ రంగంలోను పెద్ద ఆఫ‌ర్లు ఉన్నాయి. `ది ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్ విజయం ప్రియమణి కెరీర్‌లో ఓ సరికొత్త మైలురాయిగా నిలిచింది, ముఖ్యంగా ఓటీటీ ప్రపంచంలో త‌న‌ క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ఈ సిరీస్‌లో త‌ను పోషించిన సుచిత్ర (సుచి) పాత్రకు వచ్చిన అద్భుతమైన స్పందన.. ఆమె నటనలోని పరిపక్వత దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కేవలం ప్రాంతీయ చిత్రాలకే పరిమితం కాకుండా... పాన్-ఇండియా స్థాయిలో డిజిటల్ ప్రేక్షకులకు ప్రియ‌మ‌ణిని చేరువ చేసిన ఈ సిరీస్.. ఓటీటీ రంగంలో త‌న‌కు వరుసగా క్రేజీ ఆఫర్లు వచ్చేలా చేసింది. ఫలితంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో మోస్ట్ వాంటెడ్ నటిగా ఎదిగి.. తన నటనతో ఓటీటీ ప్రపంచంలో తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్నారు.