నార్త్ - సౌత్ మధ్య తేడా ఇదే..
ఇకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా నార్త్ ఇండస్ట్రీని ప్రియమణి టార్గెట్ చేస్తోందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
By: Madhu Reddy | 28 Oct 2025 12:01 PM ISTప్రముఖ నటి ప్రియమణి తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా నార్త్ ఇండస్ట్రీని ప్రియమణి టార్గెట్ చేస్తోందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న ప్రియమణి అప్పుడప్పుడు నార్త్ ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ చేసే కామెంట్లు అలాగే అనిపిస్తున్నాయని సదరు నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. అలాంటి ఈమె ఇప్పుడు మరొకసారి నార్త్ ఇండస్ట్రీపై అలాగే నార్త్ సెలెబ్రిటీలపై చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈసారి దేనిని ఉద్దేశించిందో కామెంట్స్ చేసిందో ఇప్పుడు చూద్దాం.
విషయంలోకి వెళ్తే.. గత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలో పారితోషకం విషయంలోనే కాదు పని గంటల విషయంలో కూడా వ్యత్యాసం చూపిస్తున్నారు అంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నటి ప్రియమణి కూడా ఇదే విషయంపై మాట్లాడింది. ముఖ్యంగా సౌత్ కి నార్త్ కి తేడా అదే అంటూ కామెంట్లు చేసిన ఈమె.. అసలు ఇలా ఎందుకు అంది అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది.
ప్రియమణి మాట్లాడుతూ.." ఏ రోజు కూడా నేను డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎక్కడైనా సరే మన స్టార్డంను బట్టి పారితోషకం ఇస్తారు. అందుకే దానిని దృష్టిలో పెట్టుకొని నేను కూడా దర్శక నిర్మాతలను పారితోషకం అడుగుతాను. ఒక్కొక్కసారి నాతోపాటు నటించిన వారి కంటే కూడా నేను తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న రోజులు ఉన్నాయి. అందుకు నేనేమి బాధపడడం లేదు. ఒకవేళ నేను చేసే పాత్రను బట్టి, నిడివిని బట్టి అవసరం అనిపిస్తే నేనే డిమాండ్ చేస్తాను. అనవసరంగా రెమ్యూనరేషన్ పెంచమని ఇప్పటివరకు ఎవరిని బలవంత పెట్టలేదు" అంటూ రెమ్యూనరేషన్ పై స్పందించింది.
అలాగే పని గంటల పై మాట్లాడుతూ.."రెండు ప్రాంతాలలో చిత్రీకరణ టైమింగ్ చాలా భిన్నంగా ఉంటుంది. సౌత్ ఇండస్ట్రీలో ఉదయం 8 గంటలకే షూటింగ్ మొదలుపెడతాము అని షెడ్యూల్ ఇస్తే.. ఖచ్చితంగా ఆ సమయానికి షూటింగ్ ప్రారంభిస్తారు. అయితే నార్త్ లో ఇలా ఉండదు. ఎనిమిది గంటలకు షూటింగ్ అంటే ఆ సమయానికి నటీనటులు తమ ఇంటి నుంచి బయలుదేరుతారు. ఇదే నార్త్ కీ సౌత్ కి తేడా" అంటూ ప్రియమణి తెలిపింది. ఇక ప్రియమణి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ గా మారుతున్నాయి.
ప్రియమణి కెరియర్ విషయానికి వస్తే.. రావణ్ అనే హిందీ చిత్రం ద్వారా నటన రంగ ప్రవేశం చేసిన ఈమె.. తెలుగులో ఎవరే అతగాడు అనే సినిమాతో పరిచయమైంది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో తమిళ్ కి వెళ్ళిపోయి అక్కడే పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. తర్వాత మళ్లీ తెలుగులో పెళ్లయిన కొత్తలో అనే సినిమా చేసి ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది ప్రియమణి. అప్పటినుంచి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియమణి ఒకవైపు సినిమాలు మరొకవైపు పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటుంది. ప్రియమణి అప్కమింగ్ సినిమాల విషయానికొస్తే.. విజయ్ జన నాయగక్ చిత్రంతో పాటు ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 లో కూడా నటిస్తోంది.
