ప్రియమణి మళ్లీ టాప్ లీగ్‌లోకి వచ్చేస్తుందా?
కోలీవుడ్ క్రేజీ హీరో కార్తి కథానాయకుడిగా పరిచయమై సంచలనం సృష్టించి మూవీ `పరుత్తివీరన్`. జ్ఞానవేల్ రాజా రిలీజ్ చేసిన ఈ మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకుంది ప్రియమణి.
By: Tupaki Entertainment Desk | 19 Feb 2026 7:00 AM ISTకోలీవుడ్ క్రేజీ హీరో కార్తి కథానాయకుడిగా పరిచయమై సంచలనం సృష్టించి మూవీ `పరుత్తివీరన్`. జ్ఞానవేల్ రాజా రిలీజ్ చేసిన ఈ మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకుంది ప్రియమణి. అప్పటి వరకు నటించిన ఏడు సినిమాల్లో రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని సైతం అందించి ఒక్కసారిగా ప్రియమణి తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాపులర్ అయ్యేలా చేసింది. తెలుగులో `ఎవరే అతగాడు` మూవీతో ఎంట్రీ ఇచ్చినా గుర్తింపుని తెచ్చి పెట్టింది మాత్రం `యమదొంగ`.
ఆ తరువాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాపులర్ స్టార్లతో, మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్ల సినిమాల్లో నటించింది. షారుక్ ఖాన్ నటించిన `చెన్నై ఎక్స్‌ప్రెస్` వంటి సినిమాల్లో ప్రత్యేక గీతాల్లోనూ మెరిసింది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాల్ని దక్కించుకోలేకపోయింది. హిందీ సిరీస్ `ది ఫ్యామిలీ మ్యాన్`తో మళ్లీ వార్తల్లో నిలిచిన ప్రియమణి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో సినిమాలు, సిరీస్ చేస్తూ వస్తోంది. షారుక్ `జవాన్`, `ధురంధర్` ఫేమ్ ఆదిత్యధర్, జ్యోతీ దేశ్ పాండే సంయుక్తంగా నిర్మించిన `ఆర్టికల్ 370` వంటి సినిమాలతో బాలీవుడ్‌లోనూ బిజీ అయింది.
ప్రస్తుతం దళపతి విజయ్ కథానాయకుడిగా నటించి చివరి మూవీ `జన నాయగన్`లోని ఓ కీలక పాత్రలో కనిపించనుంది. తమిళంలో జీడీఎన్, తెలుగులో వరలక్ష్మీ శరత్ కుమార్ నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న `సరస్వతి`లో నటిస్తోంది. నటిగా తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో బిజీగా ఉన్న ప్రియమణి మళ్లీ టాప్ లీగ్‌లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా హాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఈ మూవీతో గ్లోబల్ స్టార్‌గా మారడానికి సిద్ధమవుతోంది.
ఓ ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మించనున్న ఇండో అమెరికన్ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ ప్రియమణిని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. హర్శ్ మహాదేశ్వర్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని రెడ్‌బైసన్ ప్రొడక్షన్స్, ముంబైలోని అజూర్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇండో అమెరికన్ సంస్కృతుల నేపథ్యంలో ఒక వలస కుటుంబం ఎదుర్కొనే సున్నితమైన భావోద్వేగభరిత ప్రయాణం నేపథ్యంలో ఈ మూవీ సాగనుంది.
హాలీవుడ్ సినిమాలకు పని చేసిన ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేయనున్నారు. ఏప్రిల్ నుంచి దీని రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే జాతీయ ఉత్తమ నటిగా పేరు తెచ్చుకున్న ప్రియమణి ఈ హాలీవుడ్ మూవీతో మళ్లీ టాప్ లీగ్‌లోకి వచ్చేస్తుందా? అని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రియమణి నటించిన `జన నాయగన్, జీడీఎన్, సరస్వతి ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
