ప్రియదర్శి కొత్త సినిమా.. సుకుమార్ తో ఇలా..
టాలీవుడ్ లో కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ దక్కుతుంది. ఈ క్రమంలోనే సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లు కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాయి.
By: M Prashanth | 21 Jun 2026 8:15 PM ISTటాలీవుడ్ లో కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ దక్కుతుంది. ఈ క్రమంలోనే సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లు కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాయి. యంగ్ హీరో ప్రియదర్శి మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమా పనులు లేటెస్ట్ గా మొదలయ్యాయి. రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లే ముందు చిత్ర యూనిట్ మొత్తం సుకుమార్ ను కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ చిత్రానికి వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదొక పక్కా తెలంగాణ ఫ్యామిలీ డ్రామా అని మేకర్స్ ముందుగానే క్లారిటీ ఇచ్చారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే కథల్లో సహజత్వం ఉంటే జనాలు ఈజీగా కనెక్ట్ అవుతారు. అందుకే ఈ సినిమాలో కామెడీతో పాటు కుటుంబ భావోద్వేగాలను కూడా సమపాళ్లలో మిక్స్ చేస్తూ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బలగం లాంటి హిట్ తర్వాత ప్రియదర్శికి ఇలాంటి రూరల్ కాన్సెప్ట్ దొరకడం నిజంగా కలిసి వచ్చే అంశం.
ఇక ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎంపిక ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. తెలంగాణ జానపద పాటలు, డాన్స్ లతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు ఇదే టాలీవుడ్ లో ఫస్ట్ సినిమా. గ్లామర్ కోసమే కాకుండా కథలోని పల్లెటూరి వాతావరణానికి, ఆ నేటివిటీకి సరిగ్గా సరిపోయే అమ్మాయి కావాలనే ఉద్దేశ్యంతోనే మేకర్స్ ఆమెను ఎంచుకున్నట్లు అర్థమవుతోంది.
కొత్త సినిమా పనులు మొదలుపెడుతున్న సందర్భంగా టీమ్ అంతా సుకుమార్ ను కలవడం విశేషం. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో సుకుమార్ ఎప్పుడూ ముందుంటారు. ఈ మీట్ లో ఆయన టీమ్ కు తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. అదే సమయంలో నాగదుర్గ పుట్టినరోజు కూడా ఉండటంతో సుకుమార్ సమక్షంలోనే ఆమె బర్త్ డే వేడుకలను కూడా సింపుల్ గా సెలబ్రేట్ చేశారు. ఇది ఆ కొత్త హీరోయిన్ కు మంచి మెమరీ అని చెప్పొచ్చు.
సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ చేతులు కలిపాయి అంటే ఆ ప్రాజెక్ట్ వెనుక కచ్చితంగా బలమైన కంటెంట్ ఉంటుందని ఇండస్ట్రీలో ఒక నమ్మకం ఉంది. లో బడ్జెట్ లోనే క్వాలిటీ సినిమాలు తీసి హిట్లు కొట్టిన ట్రాక్ రికార్డ్ ఈ రెండు సంస్థలకు ఉంది. ప్రియదర్శి నాచురల్ యాక్టింగ్, నాగదుర్గ ఫ్రెష్ లుక్ ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. కొత్త దర్శకుడు వంశీ రెడ్డి ఈ అవకాశాన్ని ఏ స్థాయిలో వాడుకుంటాడనేది చూడాలి.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ తెలంగాణ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అఫీషియల్ గా బయటకు రానున్నాయి.
