'మిత్రమండలి' ట్రైలర్.. కావాల్సినంత ఫన్ పక్కా!
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ట్రైలర్.. ఆకట్టుకుంటోంది. సినీ ప్రియులను కడుపుబ్బా నవ్విస్తోంది.
By: M Prashanth | 7 Oct 2025 3:31 PM ISTటాలీవుడ్ నటుడు ప్రియదర్శి లీడ్ రోల్ లో ఇప్పుడు లేటెస్ట్ మూవీ మిత్రమండలి చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ నిహారిక ఎన్ ఎం హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాలో మ్యాడ్ ఫేమ్ నటీనటులు విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
విజయేందర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను బీవీ వర్క్స్, సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. దీపావళి కానుకగా అక్టోబర్ 16న సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. వరుస అప్డేట్స్ ను రిలీజ్ చేస్తూ ఆసక్తిని పెంచుతున్నారు.
ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఆడియన్స్ లో అంచనాలు పెంచాయి. ఫన్, మిస్టరీ జానర్ లో మూవీని రూపొందించినట్లు క్లియర్ గా చెప్పేశాయి. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ మరింత స్పీడ్ పెంచారు. మిత్రమండలి ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ట్రైలర్.. ఆకట్టుకుంటోంది. సినీ ప్రియులను కడుపుబ్బా నవ్విస్తోంది. ప్రస్తుతం ట్రెండ్ కు అనుగుణంగా సరదా డైలాగులతో మెప్పిస్తోంది. ఒకే అమ్మాయి కోసం స్నేహితులంతా గొడవ పడడంతో ఇలాంటి మహిళా మండలి కోసమే మిత్రమండలి కనుమరుగవుతోందటూ చెప్పిన కొన్ని డైలాగ్స్ ఫుల్ ఫన్నీగా ఉన్నాయి.
ముఖ్యంగా ట్రైలర్ లో రాగ్ మయూర్, ప్రసాద్, విష్ణుతో వెన్నెల కిషోర్ చేసిన కామెడీ మెయిన్ హైలెట్ గా నిలిచేలా ఉంది. సత్య, నిహారిక, వెన్నెల కిషోర్ తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం సన్నివేశం కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. సినిమా ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్ ఇస్తుందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.
కాగా మూవీ విషయానికొస్తే.. బన్నీ వాస్ సమర్పిస్తున్న మిత్రమండలి చిత్రాన్ని కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బన్నీ వాస్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి ఆయన ప్రొడక్షన్ బ్యానర్ పై తొలి మూవీగా వస్తున్న మిత్రమండలి ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
