Begin typing your search above and press return to search.

కామన్ మ్యాన్ పాత్రలో ఎవరు బెస్ట్?

వెండితెరపై ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి పాత్రను పండించడం అనేది నటులకు ఒక పెద్ద సవాల్.

By:  Srikanth Kontham   |   10 April 2026 12:00 AM IST
కామన్ మ్యాన్ పాత్రలో ఎవరు బెస్ట్?
X

వెండితెరపై ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి పాత్రను పండించడం అనేది నటులకు ఒక పెద్ద సవాల్. ఈ విషయంలో బాలీవుడ్ అగ్ర హీరోలు షారూఖ్ ఖాన్ - అక్షయ్ కుమార్‌లలో ఎవరు మెరుగ్గా సరిపోతారనే అంశంపై దర్శకుడు ప్రియదర్శన్ ఇటీవల లోతైన విశ్లేషణ చేశారు. వీరిద్దరితోనూ పని చేసిన అనుభవం ఉన్న ఆయన, ఒక పాత్రలోని సహజత్వం , నటుడికి ఉండే ఇమేజ్ ఆ పాత్రను ఎలా ప్రభావితం చేస్తాయో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రియదర్శన్ అభిప్రాయం ప్రకారం ఒక‌ సామాన్యుడి పాత్రను పోషించడంలో అక్షయ్ కుమార్ అత్యంత సహజంగా కనిపిస్తారు.

అక్షయ్ బాడీ లాంగ్వేజ్ ఆయన మాట్లాడే తీరు సగటు మధ్యతరగతి వ్యక్తికి చాలా దగ్గరగా ఉంటాయని పేర్కొన్నారు. అందుకే హేరా ఫేరి, భూల్ భూలయ్యా వంటి చిత్రాలలో అక్షయ్ పోషించిన పాత్రలు సామాన్య ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయ్యాయి. అక్షయ్ తన స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి చాలా సులభంగా పాత్రలోకి ఒదిగి పోతారని ప్రియదర్శన్ కొనియాడారు. షారూఖ్ ఖాన్ గురించి మాట్లాడుతూ, `ఆయన ఒక గొప్ప నటుడు అనడంలో సందేహం లేదు. కానీ ఆయనకు ఉన్న లార్జర్ దన్ లైఫ్ ఇమేజ్ ఒక సాధారణ వ్యక్తి పాత్రకు అడ్డుగా మారుతుందని ప్రియదర్శన్ అభిప్రాయపడ్డారు.

షారూఖ్ తెరపైకి రాగానే ప్రేక్షకులు ఒక సూపర్‌స్టార్‌ను చూస్తున్న అనుభూతికి లోనవుతారు తప్ప పక్కింటి అబ్బాయిగా చూడటం కొంచెం కష్టమని విశ్లేషించారు. కింగ్ ఖాన్ అనే బిరుదు ఆయన ఇమేజ్‌ను ఒక ప్రత్యేకమైన ఎత్తులో నిలబెట్టిందని తెలిపారు. అలాగే షారూఖ్ ఖాన్ తన కెరీర్‌లో కొన్ని సినిమాల్లో సామాన్యుడి పాత్ర లను అద్భుతంగా పండించిన సందర్భాలు ఉన్నాయని ప్రియదర్శన్ గుర్తు చేశారు. తాను దర్శకత్వం వహించిన బిల్లూ చిత్రంలో షారూఖ్ ఒక స్టార్ హోదాలో ఉంటూనే తన నటనతో భావోద్వేగాలను పండించారన్నారు.

కానీ ఒక పక్కా లోకల్ లేదా మిడిల్ క్లాస్ పాత్ర అవసరమైనప్పుడు అక్షయ్ కుమార్ ఇచ్చే సహజత్వం షారూక్ నుంచి ఆశించడం కష్టమని స్పష్టం చేశారు. నటుడి ప్రతిభ కంటే కొన్నిసార్లు వారి శారీరక ఆకృతి , ముఖ కవళికలు కూడా అటువంటి పాత్రలకు ప్లస్ అవుతాయని ప్రియదర్శన్ విశ్లేషించారు. అక్షయ్ కుమార్ కామెడీ టైమింగ్ , సాధారణ వ్యక్తిగా ఆయన చేసే చిన్న చిన్న మేనరిజమ్స్ ప్రేక్షకులకు తమ స్వంత జీవితాలను గుర్తు చేస్తాయి. అందుకే సామాన్యుడి కథలను చెప్పాల నుకున్నప్పుడు దర్శకులకు అక్షయ్ మొదటి ఎంపికగా మారుతుంటారని వెల్లడించారు.

షారూఖ్ ఖాన్ గ్రేస్ - రొమాంటిక్ ఇమేజ్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంటే? అక్షయ్ కుమార్ తన సహజత్వంతో సామాన్యుల గుండెల్లో చోటు సంపాదిం చుకున్నారని అర్థమవుతోంది. ప్రియదర్శన్ చేసిన విశ్లేషణ బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పాత్ర ఏదైనా నటుడు అందులో పరకాయ ప్రవేశం చేయగలిగితేనే అది పండుతుంది. కానీ స్టార్‌డమ్ అనేది ఒక్కోసారి నటుడికి వరంగానూ మరికొన్ని సార్లు శాపంగానూ మారుతుందని ఈ చర్చ నిరూపిస్తోంది.