Begin typing your search above and press return to search.

స్టార్ హీరో చెంప ప‌గ‌ల‌గొట్టిన హీరోయిన్‌ స‌డెన్‌గా ఏమైంది?

ఆ తర్వాత షారుఖ్ ఖాన్, ఐశ్వర్యా రాయ్‌లతో కలిసి `జోష్` చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది.

By:  Sivaji Kontham   |   26 May 2026 4:00 AM IST
స్టార్ హీరో చెంప ప‌గ‌ల‌గొట్టిన హీరోయిన్‌ స‌డెన్‌గా ఏమైంది?
X

నేటి సోషల్ మీడియా విప్లవం.. ఫోటోగ్రాఫ‌ర్లు వెంట‌ప‌డే సంస్కృతి బాలీవుడ్‌ను శాసించకముందు.. కేవలం తన స్వచ్ఛమైన నటన, గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో 90ల చివరలో ఓవ‌ర్‌నైట్‌లోనే స్టార్‌డమ్ తెచ్చుకున్న నటి ప్రియా గిల్. బ్లాక్‌బస్టర్ ప్రేమకథా చిత్రాల్లో నటించి మెప్పించిన ప్రియాను, కెరీర్ పీక్ స్టేజ్‌లో అందాల ఆరబోతలో ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌తో పోల్చేవారు. ఇద్దరూ ఇంచుమించు ఒకే సమయంలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినా.. ఐశ్వర్య గ్లోబల్ సూపర్‌స్టార్‌గా ఎదిగితే ప్రియా గిల్ మాత్రం బాలీవుడ్‌లో తన స్థానాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది. దిగ్గ‌జ హీరోల స‌ర‌స‌న న‌టించిన ఈ ప్ర‌తిభావ‌ని ఉన్న‌ట్టుండి స‌డెన్ గా గ్లామ్ అండ్ గ్లిజ్ ప్ర‌పంచం నుంచి అదృశ్య‌మైంది.

అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏబీసీఎల్‌) నిర్మాణంలో 1996లో వచ్చిన `తేరే మేరే సప్నే` చిత్రంతో అర్షద్ వార్సి, చంద్రచూర్ సింగ్ సరసన ప్రియా గిల్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం న‌టిగా మంచి గుర్తింపు తెచ్చినా సంజయ్ కపూర్‌తో కలిసి నటించిన `సిర్ఫ్ తుమ్సే` చిత్రం త‌న‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆనాటి కాలంలో ఈ చిత్రం ఒక భారీ మ్యూజికల్ అండ్ ఎమోషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులోని పాటలు ప్రియా గిల్ చూపించిన అమాయకత్వంతో కూడిన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని ఆమెను దేశవ్యాప్తంగా పాపులర్ ఫేస్‌గా మార్చేశాయి.

ఆ తర్వాత షారుఖ్ ఖాన్, ఐశ్వర్యా రాయ్‌లతో కలిసి `జోష్` చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో ప్రియా లుక్స్ చూసిన నెటిజన్లు త‌న‌ను ఐశ్వర్యతో మరింతగా పోల్చడం ప్రారంభించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను ప్రియా గిల్ తన సినీ కెరీర్‌లోనే అత్యంత ఇబ్బందికరమైన విషయంగా పేర్కొంది. ఒక సీన్ లో భాగంగా కింగ్ ఖాన్ షారుఖ్‌ను గట్టిగా కొట్టాల్సి వచ్చింది. గోవాలో జరిగిన ఈ షూటింగ్‌లో దర్శకుడు మన్సూర్ ఖాన్ సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం షారుఖ్‌ను గట్టిగా కొట్టు! అని పదే పదే ఒత్తిడి తెచ్చారు.

షారుఖ్ ఖాన్ కూడా పర్లేదు నన్ను కొట్టు! అని ప్రోత్సహించడంతో ప్రియా గిల్ నిజంగానే ఆయన ముఖంపై గట్టిగా పంచ్ ఇచ్చింది. ఆ దెబ్బకు సెట్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. షాక్ తిన్న డైరెక్టర్ `కట్` చెప్పడం కూడా మర్చిపోయారు. కెమెరామెన్ కె.వి. ఆ సమయంలో ప్రియాతో ``నువ్వు షారుఖ్‌ను కొట్టావు కాబట్టి అమ్మాయిలంతా నిన్ను ద్వేషిస్తారు`` అని సరదాగా అన్నారట. అంత పెద్ద సూపర్ స్టార్ తనను కొట్టినా ఏమాత్రం కోప్పడకుండా ఎంతో కూల్‌గా బిహేవ్ చేశారని.. ఆ సీన్ తర్వాతే పాట షూటింగ్ ప్రారంభం కావడంతో తాను ఎంతో టెన్షన్ పడ్డానని ప్రియా గిల్ ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది.

ఇలాంటి మరుపురాని విజయాలు ఎన్ని ఉన్నా.. అగ్ర హీరోల సినిమాల్లో భాగమైనా ప్రియా గిల్ తన తొలి రోజుల్లోని వేగాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత త‌ను నటించిన పలు ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద వరుసగా ప్లాప్ కావడంతో కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. దీంతో 2006లో ప్రియా నటనకు పూర్తిగా స్వస్తి చెప్పి లైమ్‌లైట్ నుండి వైదొలిగింది. గత రెండు దశాబ్దాలుగా గ్లామర్ ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉంటూ అత్యంత ర‌హ‌స్యంగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్న ప్రియా గిల్.. ప్రస్తుతం డెన్మార్క్‌లో పెళ్లి చేసుకుని అక్కడి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా స్థిరపడినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.