Begin typing your search above and press return to search.

గొప్ప లక్షణాలున్న వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నా!

తమిళ - తెలుగు చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి ప్రియా భవాని శంకర్ వ్య‌క్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు.

By:  Srikanth Kontham   |   16 Aug 2026 1:23 PM IST
గొప్ప లక్షణాలున్న వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నా!
X

తమిళ - తెలుగు చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి ప్రియా భవాని శంకర్ వ్య‌క్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. ఎల్లప్పుడూ వృత్తిపరమైన విషయాలకే పరిమితమయ్యే బ్యూటీ తాజాగా ప్రేమ వ్యవహారం గురించి బహిరంగంగా మాట్లాడటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు లవ్ లైఫ్ వార్తలను బయటకు చెప్పడానికి ఇష్టపడరు. కానీ ప్రియా భవాని శంకర్ మాత్రం చాలా స్పష్టంగా స్పందించారు. `ఇరుముడి` ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటించిన అమ్మ‌డు మనసులోని మాటను ధైర్యంగా బయటపెట్టారు.

ప్రస్తుతం తాను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, అతనికి ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. తన భాగస్వామి ఎవరో పేరు మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఆ వ్య‌క్తి పై తనకున్న గౌరవం, ఇష్టం అమ్మ‌డి ముఖంలో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఎలాంటి హడావిడి లేకుండా ప్రియ విషయాన్ని పంచుకోవడం అందరినీ ఆకట్టుకుంది. మధ్య తరగతి నేపథ్యం నుండి వచ్చిన ప్రియా భ‌వానీ శంక‌ర్ టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత వెండితెరకు పరిచయమైన ప్రియ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు.

ఆమె ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు అన్నీఇన్నీ కావు. అందుకే ప్రియ‌ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక స్పష్టత ఉంటుందని సన్నిహితులు చెబు తుంటారు. తాజాగా తన వ్యక్తిగత సంతోషాన్ని అభిమానులతో పంచుకోవడం ద్వారా మ‌రోసారి తన పారదర్శకతను చాటుకున్నారు. ఈ ప్రకటన వెలువడిన క్షణం నుండి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ప్రియా భవాని శంకర్ మనసు దోచుకున్న అదృష్ట వ్యక్తి ఎవరై? ఉంటారనే దానిపై నెటిజన్లు ఆరా తీయడం ప్రారంభించారు. గతంలో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే ప్రచారాలు వ‌చ్చినా? ఆమె స్వయంగా నోరు విప్పడం ఇదే మొదటిసారినట్లు తెలుస్తోంది.

దీంతో ప్రియ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. వృత్తిపరంగా కూడా ప్రియా భవాని శంకర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. కంటెంట్ ఓరియెంటెడ్ పాత్రలను ఎంచుకుంటూ నటిగా త‌న‌ పరిధులను విస్తరించుకుంటున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా అభినయానికి ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో కొత్త సంతోషాన్ని ఆస్వాదిస్తూనే ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ దూసుకెళ్తున్న జోరు చూస్తుంటే రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మొత్తానికి ప్రియా భవాని శంకర్ చేసిన అనూహ్య ప్రకటన అమ్మ‌డి కెరీర్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని చెప్పొచ్చు. తన ప్రేమ జీవితంపై ఆమె చూపిన పరిపక్వత, ఓపెన్‌గా మాట్లాడిన తీరు అందరి ప్రశంస‌లు అందుకుంటోంది. త్వరలోనే ప్రియా భ‌వానీ భాగస్వామి ఎవరో అధికారికంగా ప్రకటిస్తారని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.