కోస్టార్ హద్దు మీరి ప్రవర్తించాడు.. నటికి అండగా నిలిచిన భర్త!
చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడానికి నటీనటులు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.
By: Sivaji Kontham | 8 Jun 2026 5:00 AM ISTచిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడానికి నటీనటులు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రాంతీయ సినిమాల నుండి బాలీవుడ్ వరకు... అలాగే ప్రస్తుతం ఓటీటీ వేదికలపై రాణిస్తున్న ప్రియా బాపట్ వంటి ప్రతిభావంతులైన నటీమణులు వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. అయితే గ్లామర్ ప్రపంచంగా కనిపించే ఈ పరిశ్రమ వెనుక నటీమణులు ఎదుర్కొనే మానసిక ఘర్షణలు, వృత్తిపరమైన హద్దులు దాటే కొన్ని సంఘటనలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. కెరీర్ ప్రారంభంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియక చాలామంది మౌనంగా ఉండిపోతుంటారు.
ఇటీవల ప్రియా బాపట్ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని షేర్ చేస్తూ.. ఒక చిత్రంలో కథకు అనవసరమైనప్పటికీ దర్శకుడి ఒత్తిడి మేరకు ముద్దు సీన్‌లో నటించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. స్క్రిప్ట్ రీడింగ్ సమయం నుంచే ఆ సీన్ విషయంలో తనకు అభ్యంతరాలు ఉన్నా నటిగా తన పరిమితులను దాటి నిరూపించుకోవాలనే ఉద్దేశంతో దానికి అంగీకరించినట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత షూటింగ్ సెట్స్‌పై జరిగిన పరిణామాలు వృత్తిపరమైన మర్యాదను పూర్తిగా దాటిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పాటల చిత్రీకరణ సమయంలో సహనటుడు రిహార్సల్స్‌లో లేని విధంగా... ప్రణాళికకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ హద్దులు మీరి ప్రవర్తించాడని ప్రియా వివరించారు. ఆ సమయంలో ఆకస్మికంగా జరిగిన ఆ ప్రవర్తనకు ఎలా స్పందించాలో తెలియక తన కోసం తాను గట్టిగా మాట్లాడలేకపోయానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కేవలం సెట్ లోనే కాకుండా... హోటల్ గదిలో ఉన్నప్పుడు కూడా సదరు నటుడు మెసేజ్‌లు పెడుతూ.. డిన్నర్ల పేరుతో వేధిస్తూ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించాడని... ఆ సమయంలో తాను తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యానని తెలిపారు.
ఈ క్లిష్ట పరిస్థితిలో ప్రియా బాపట్ భర్త, నటుడు ఉమేష్ కామత్ తీసుకున్న చొరవ తనకు కొండంత అండగా నిలిచింది. భోపాల్ షెడ్యూల్‌లో జరుగుతున్న ఈ మానసిక వేధింపుల గురించి ప్రియా ప్రతిరోజూ ఫోన్ లో భర్తకు వివరించేవారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఉమేష్... ప్రియా అడగకముందే ముంబై నుండి నేరుగా షూటింగ్ సెట్‌కు చేరుకుని... మూడు రోజుల పాటు అక్కడే ఉండి తనకు రక్షణగా నిలిచారు. చిత్ర పరిశ్రమలో ఒంటరిగా పోరాడుతున్న మహిళలకు కుటుంబం - భాగస్వామి ఇచ్చే మద్దతు ఎంత అవసరమో ఈ సంఘటన నిరూపిస్తుంది.
ప్రస్తుతం ప్రియా బాపట్ `దాలింబ్: ది మిత్` వంటి ప్రతిష్టాత్మక సైకలాజికల్ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఈ నటి షేర్ చేసిన గతం పరిశ్రమలో ఇంకా మారాల్సిన పరిస్థితుల గురించి చెబుతోంది. నటీనటుల సమ్మతి, స్క్రిప్ట్ డిమాండ్స్ , సెట్స్‌పై ప్రొఫెషనలిజం అనేవి కేవలం మాటలకే పరిమితం కాకుండా కచ్చితమైన నిబంధనలుగా మారాలి. అప్పుడే ప్రతిభావంతులైన మహిళలు ఎలాంటి భయాలు లేకుండా తమ కళను ప్రదర్శించేందుకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
