Begin typing your search above and press return to search.

ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ఎప్పటికి తెలుసుకుంటారో?

సినిమా ఇండస్ట్రీలో గడచిన 20 ఏళ్లలో బడ్జెట్‌ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఓటీటీ మార్కెట్‌ పెరిగిన తర్వాత నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్‌ను సునాయాసంగా పెట్టేస్తున్నారు.

By:  Ramesh Palla   |   17 Sept 2026 10:26 AM IST
ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ఎప్పటికి తెలుసుకుంటారో?
X

సినిమా ఇండస్ట్రీలో గడచిన 20 ఏళ్లలో బడ్జెట్‌ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఓటీటీ మార్కెట్‌ పెరిగిన తర్వాత నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్‌ను సునాయాసంగా పెట్టేస్తున్నారు. ఒకప్పుడు స్టార్‌ హీరోల సినిమాల కోసం చేసే ఖర్చుకు డబుల్‌ ఇప్పుడు చిన్న హీరోల సినిమాలకు ఖర్చు చేస్తున్నారంటే ఏ స్థాయిలో బడ్జెట్‌ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోల పారితోషికం భారీగా పెరగడంతో పాటు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు పెద్ద ఎత్తున పెరగడం వల్లే బడ్జెట్‌ పెరుగుతుందని నిర్మాతలు అంటున్నారు. పారితోషికంతో పాటు మేకింగ్‌ కోసం దర్శకులు అనవసరపు ఖర్చులు ఎక్కువ చేస్తుండటం వల్ల కూడా బడ్జెట్‌ ఎక్కువ అవుతుంది అనేది విశ్లేషకుల మాట. సినిమా కథతో సంబంధం లేకుండా అందులో ఉన్న హీరోను, ఆ దర్శకుడిని బట్టి నిర్మాతలు ఎంత బడ్జెట్‌ అంటే అంత ఖర్చు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

బాలీవుడ్‌, టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ సినిమాలు...

ఇతర భాషల ఇండస్ట్రీలతో పోల్చితే టాలీవుడ్‌, బాలీవుడ్‌లో అత్యధికంగా బడ్జెట్‌ పెరిగిందనే అభిప్రాయం ఉంది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ మీడియం రేంజ్‌ బడ్జెట్‌లో సినిమాలు చేస్తూ వందల కోట్ల వసూళ్లు రాబడుతున్న ఫిల్మ్‌ మేకర్స్ ఉన్నారు. అక్కడ స్టార్‌డం కంటే, దర్శకుడి మార్కెట్‌ కంటే ఎక్కువగా కంటెంట్‌ను నమ్ముతున్నారు. ప్రేక్షకులు సైతం కంటెంట్‌ ఉన్న సినిమాలకు మార్కులు వేస్తున్నారు, వసూళ్లు ఇస్తున్నారు. తాజాగా అదే విషయాన్ని మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ క్లారిటీగా చెప్పుకొచ్చాడు. ఆయన ఫిల్మ్‌ మేకర్‌గా నటుడిగా వరుస సినిమాలు చేస్తూ, ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఆయన స్టార్‌డం, భారీ బడ్జెట్‌ అని కాకుండా మంచి కథ, కథనంతో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. అందుకే ఆయనకు పాన్ ఇండియా రేంజ్ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కుతున్నాయి.

హనుమాన్‌ అంశ్‌ సినిమా వసూళ్లు...

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటుడు, దర్శకుడు అయిన పృథ్వీరాజ్ సుకుమారన్‌ మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో సినిమాల బడ్జెట్‌లు భారీగా పెరిగి పోతున్నాయి. సినిమాల స్థాయి అనేది ఆ సినిమా కోసం ఖర్చు చేసిన డబ్బు, ఆ సినిమాలో నటించిన నటుడిపై ఆధారపడి ఉండదు. ఆ విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపితం అయ్యింది. ఆ రెండే సినిమాల స్థాయిని నిర్ధారించేవి అయితే ఇటీవల హిందీలో వచ్చిన హనుమాన్‌ అంశ్‌ సినిమాకు ఈ స్థాయిలో స్పందన వచ్చి ఉండేది కాదని అన్నాడు. సినిమాలో ఉన్న కంటెంట్‌ వల్లే సినిమా ఈ స్థాయికి చేరిందని, ప్రేక్షకులు చూసేది కంటెంట్‌ను మాత్రమే అని, స్టార్‌డంను చూసి వచ్చే వారు కొంత మందే అనే అభిప్రాయంను పృథ్వీరాజ్ సుకుమారన్‌ వ్యక్తం చేశాడు. సినిమా విజయం సాధించాలంటే మంచి కంటెంట్‌ తప్పని సరి అని ఆయన సదరు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ వ్యాఖ్యలు..

పృథ్వీరాజ్ వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజం. సినిమా స్థాయి అనేది హీరోల స్టార్‌డం, బడ్జెట్‌తో పెరగదు. అందులో ఉన్న కంటెంట్‌ వల్లే పెరుగుతుంది. సినిమా విడుదల సమయంలో పెద్దగా సందడి చేయకున్నా విడుదలైన తర్వాత కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడుతారు. కంటెంట్‌ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రాండ్‌ అంబాసిడర్స్ అయ్యి మరీ సినిమాను ప్రమోట్‌ చేస్తారు. భారీ బడ్జెట్‌ కాకుండా మంచి కంటెంట్‌ సినిమాలను తీసుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ ఎప్పటికి తెలుసుకుంటారో అని సగటు సినీ అభిమాని ఎదురు చూస్తున్నాడు. టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ సినిమాలు ఎక్కువ వస్తున్నాయి, కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు లిమిటెడ్‌గా వస్తున్నాయి. కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలకు ఇండస్ట్రీ నుంచి ప్రోత్సాహం కూడా దక్కడం లేదు. ఒకటి రెండు వస్తే కచ్చితంగా ప్రేక్షకులు వాటిని ఆధరించారు, ముందు ముందు కూడా ఆధరించేందుకు రెడీగా ఉంటారు. కనుక టాలీవుడ్‌ నుంచి భారీ బడ్జెట్‌ సినిమాలతో పాటు మంచి కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు రావాల్సిన అవసరం ఉంది.