వారణాసి సెట్స్‌లో పృథ్వీరాజ్ పడ్డ కష్టం ఇదే!
రాజమౌళి సినిమాలో హీరో ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో, విలన్ కూడా అంతే ధీటుగా కనిపిస్తారు.
By: M Prashanth | 4 Feb 2026 10:57 AM ISTరాజమౌళి సినిమాలో హీరో ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో, విలన్ కూడా అంతే ధీటుగా కనిపిస్తారు. ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న 'వారణాసి'లో విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ఎంచుకోవడమే ఒక పెద్ద సంచలనం. రీసెంట్ గా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ తన పాత్ర గురించి పంచుకున్న విషయాలు చూస్తుంటే, జక్కన్న ఈసారి ఒక విభిన్నమైన విలనిజాన్ని మనకు పరిచయం చేయబోతున్నారని అర్థమవుతోంది. అసలు ఈ 'కుంభ' పాత్ర వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో పృథ్వీరాజ్ మాటల్లోనే బయటపడింది.
ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే ఒక క్రూరమైన విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్ గురించి ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం మంచి లేదా చెడు అనే కోణంలో ఉండదని చెప్పారు. తన కెరీర్ లోనే అత్యంత అన్‌ప్రెడిక్టబుల్ గా సాగే క్యారెక్టర్ ఆర్క్ దీనికి ఉందని ఆయన వివరించారు. అంటే విలన్ చేసే పనులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరన్నమాట. తన నిజజీవితానికి ఏమాత్రం సంబంధం లేని ఇంతటి డార్క్ రోల్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.
రాజమౌళి డైరెక్షన్ స్టైల్ గురించి కూడా పృథ్వీరాజ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. జక్కన్న సెట్స్‌లో నటీనటులు ఎప్పుడూ కంఫర్ట్‌గా ఉండరట. ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజ్ ఇస్తూ నటులను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటారని, ఆ ఒత్తిడి వల్లే నటుల నుండి బెస్ట్ అవుట్‌పుట్ వస్తుందని ఆయన తెలిపారు. ఎక్కడా రిలాక్స్ అవ్వకుండా నిరంతరం శ్రమిస్తేనే రాజమౌళి మార్క్ పర్ఫెక్షన్ వస్తుందనేది పృథ్వీరాజ్ మాటలను బట్టి స్పష్టమవుతోంది.
సినిమాలో కుంభ గెటప్ కూడా చాలా విభిన్నంగా ఉండబోతోంది. టెక్నాలజీతో కూడిన ఒక అధునాతనమైన వీల్ ఛైర్, అలాగే 'డాక్టర్ ఆక్టోపస్' తరహాలో ఉండే రోబోటిక్ చేతులతో పృథ్వీరాజ్ లుక్ చాలా భయంకరంగా ఉంటుందని టాక్. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు చూడని ఒక సైకో విలన్‌గా ఈ కుంభ పాత్రను రాజమౌళి డిజైన్ చేశారట. కేవలం కళ్లతోనే భయపెట్టే ఈ విలనిజం సినిమాకే ఒక పెద్ద హైలైట్ కానుందని సినీ వర్గాలు అంటున్నాయి.
ఇన్ని గ్రాఫిక్స్, భారీ సెట్లు ఉన్నా సరే రాజమౌళి మాత్రం నటుల ఎక్స్‌ప్రెషన్స్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తారట. ఒక నటుడు నిజాయితీగా ఇచ్చే 'క్లోజప్ షాట్' కంటే పవర్‌ఫుల్ విజువల్ మరొకటి ఉండదని జక్కన్న నమ్ముతారని పృథ్వీరాజ్ చెప్పారు. అందుకే ఎంత పెద్ద యాక్షన్ సీన్ జరుగుతున్నా, నటుడి ఫేస్ లోని చిన్న మార్పును కూడా క్యాచ్ చేయడానికి రాజమౌళి చాలా సమయం కేటాయిస్తారట. అలా ప్రతి సీన్ పక్కాగా వచ్చే వరకు వదిలిపెట్టరని పృథ్వీరాజ్ వెల్లడించారు.
ఇక 'వారణాసి'లో రుద్రకు పోటీగా నిలిచే ఈ కుంభ పాత్ర బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి టాలెంటెడ్ నటుడు విలన్ గా మారడం ఈ సినిమాపై ఉన్న క్యూరియాసిటీని మరింత పెంచింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కాబోతున్న ఈ గ్లోబల్ ఎడ్వెంచర్ లో హీరో, విలన్ మధ్య జరిగే ఆ మైండ్ గేమ్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
