Begin typing your search above and press return to search.

కాపీ క్యాట్ విమర్శలపై మండిపడ్డ సంగీత దర్శకుడు!

తాను ఎంతో కష్టపడి ఒరిజినల్ కంపోజిషన్స్ చేస్తుంటే? ప్రతి చిన్న ట్యూన్‌ను వేరే పాటలతో పోల్చుతూ బురదజల్లడం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని ప్రీతమ్ ఆవేదన వ్యక్తం చేశారు.

By:  Srikanth Kontham   |   21 May 2026 1:24 PM IST
కాపీ క్యాట్ విమర్శలపై మండిపడ్డ సంగీత దర్శకుడు!
X

బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో మెలోడీ కింగ్‌గా, ఎన్నో చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్ అందించిన పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలోనే ప్రీత‌మ్ పై పలుమార్లు ట్యూన్స్ కాపీ కొట్టారనే ఆరోపణ లున్నా? తనదైన మ్యూజిక్‌తో బాలీవుడ్‌ను శాసిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఆయన నుంచి వ‌స్తోన్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ `కాక్టైల్ 2` చిత్రంలోని ఓ పాట విషయంలో సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై ప్రీతమ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వ‌స్తోన్న కాపీ ట్యూన్ ఆరోపణలను తిప్పికొట్టారు. షాహిద్ కపూర్ , కృతి సనన్ జంట‌గా నటిస్తోన్న‌ మోస్ట్ అవేటెడ్ మూవీ `కాక్టైల్ 2` నుండి ఇటీవల `మషూకా` అనే ప్రమోషనల్ సాంగ్ విడు దలైన సంగ‌తి తెలిసిందే.

ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు, యూట్యూబర్లు ఈ ట్యూన్ ఓ పాత ఇంటర్నేషనల్ , రీజినల్ సాంగ్ లా ఉందంటూ పోలికలు పెట్టడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తమకు తామే సంగీత డిటెక్టివ్‌లు గా ప్రకటించుకునే వారిపై ప్రీతమ్ తీవ్రంగా మండిపడ్డారు.

తాను ఎంతో కష్టపడి ఒరిజినల్ కంపోజిషన్స్ చేస్తుంటే? ప్రతి చిన్న ట్యూన్‌ను వేరే పాటలతో పోల్చుతూ బురదజల్లడం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని ప్రీతమ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రెండు నోట్స్ లేదా మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాడే విధానం ఒకేలా ఉన్నంత మాత్రాన దానిని కాపీ అని ముద్ర వేయడం సరికాదన్నారు.

`స్వయం ప్రకటిత సంగీత పరిశోధకులు వ్యూస్ కోసం, లైక్స్ కోసం సోషల్ మీడియాలో నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది ఒక టెక్నీషియన్ శ్రమను, వారి సృజనాత్మకతను అవమానించడమే` అని ప్రీతమ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. చిత్ర పరిశ్రమలో ఒక పాటను కంపోజ్ చేయడానికి ఎంతో సమయం, బృందం శ్రమ అవసరమవుతుందని `మషూకా` సాంగ్ కోసం తాము పూర్తి ఒరిజినల్ ట్యూన్‌ను సరికొత్త సౌండింగ్‌ను ఉప యోగించామని వివరించారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి అవగాహన లేని వారు కూడా సంగీతాన్ని విశ్లేషిస్తూ మేకర్స్‌ను వేధించడం ఎక్కువైందని విమర్శించారు.

ఒక పాటలోని సోల్ ను అర్థం చేసుకోకుండా కాపీ అనే ఆరోపణలు చేయడం వల్ల ఇండస్ట్రీలో ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసే వారి ఉత్సాహం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిత్రంపై బాలీవుడ్ ట్రేడ్ వర్గాలలో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన మొదటి భాగం మ్యూజికల్‌గా ఎంతటి సంచలనం సృష్టించిందో? తెలిసిందే. అందుకే ఈ సీక్వెల్ ఆల్బమ్ పై ప్రీతమ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇలాంటి తరుణంలో మషూకా సాంగ్ చుట్టూ వివాదం ముదరడం దానికి సంగీత దర్శకుడే స్వయంగా వచ్చి కౌంటర్ ఇవ్వడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చిత్ర యూనిట్ ప్రీతమ్‌కు మద్దతుగా నిలుస్తూ పాట సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాక్ అని చెప్తోంది.