యువ హీరో ప్రిన్స్ వివాహ బంధంలోకి.. పెళ్లి తర్వాత కెరీర్ టర్న్ అవుతుందా?
టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఎలాంటి ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ (సినీ నేపథ్యం) లేకుండా సొంత ప్రతిభతో అడుగుపెట్టిన అతికొద్ది మంది యువ హీరోలలో ప్రిన్స్ సిసిల్ ఒకరు.
By: Sivaji Kontham | 20 July 2026 12:55 AM ISTటాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఎలాంటి ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ (సినీ నేపథ్యం) లేకుండా సొంత ప్రతిభతో అడుగుపెట్టిన అతికొద్ది మంది యువ హీరోలలో ప్రిన్స్ సిసిల్ ఒకరు. ప్రముఖ దర్శకుడు తేజ ఆవిష్కరణగా (తేజ డిస్కవరీ) ఇండస్ట్రీకి పరిచయమైన ప్రిన్స్.. `నీకు నాకు డ్యాష్ డ్యాష్`, `బస్ స్టాప్` వంటి చిత్రాలతో కుర్రకారులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఇటీవల వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ మల్టీ టాలెంటెడ్ నటుడిగా బిజీగా గడుపుతున్నారు.
ఇలా కెరీర్ పరంగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న ఈ యువ హీరో ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. త్వరలోనే అతడు ఓ ఇంటివాడు కాబోతున్నారు. న్యూజిలాండ్‌లో నివసిస్తున్న ఒక ఎన్నారై (NRI) అమ్మాయి సాయి మాచిరాజుతో ప్రిన్స్ వివాహం నిశ్చయమైంది. ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీన వీరి వివాహ వేడుక న్యూజిలాండ్ లోనే అత్యంత వైభవంగా జరగనుందని సమాచారం. తన కాబోయే భార్యకు ప్రపోజ్ చేసిన ఓ అందమైన వీడియోని ప్రిన్స్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెళ్లి అధికారికం అయింది. ఈ వార్త తెలియడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఈ యంగ్ హీరోకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదవలేదు. ఇటీవల నటుడు అఖిల్‌కు పెళ్లి జరిగిన తర్వాత కెరీర్ పరంగా బాగా కలిసివచ్చింది. జైనబ్ ఆయన జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాతే `లెనిన్` రూపంలో అఖిల్ ఒక సాలిడ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే సెంటిమెంట్ ప్రకారం.. ఇప్పుడు పెళ్లి తర్వాత ప్రిన్స్‌కు కూడా అదృష్టం కలిసివచ్చి,, కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ లభిస్తే అది అతడికి అదనపు బోనస్ లాంటిదేనని సినీ విశ్లేషకులు, అభిమానులు ఆశిస్తున్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేదా గాడ్ ఫాదర్ లేకపోయినా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ప్రిన్స్ సొంత బలంతోనే బాగానే ఈదగలిగారు. ప్రిన్స్ ప్రస్తుతం గల్లీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
సెంటిమెంట్ ప్రకారం...!
వివాహ బంధం ఇచ్చే సరికొత్త బాధ్యతలను నెరవేరుస్తూనే ప్రిన్స్ తన కెరీర్‌ను మరింత పునరుత్తేజంతో.. కొత్త ఉత్సాహంతో కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోలు పరిశ్రమలో సుదీర్ఘకాలం నిలబడాలంటే కేవలం ఒకే రకమైన చాక్లెట్ బాయ్ పాత్రలకే పరిమితం కాకూడదు. వైవిధ్యమైన కథలను, విభిన్నమైన క్యారెక్టర్లను ఎంచుకుంటూ తమలోని నటుడిని నిరంతరం ఆవిష్కరించుకోవాలి. హీరో పాత్రలే కాకుండా కథను మలుపు తిప్పే బలమైన సహాయక పాత్రలు లేదా నెగెటివ్ షేడ్స్ ఉన్న వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయడానికి కూడా వెనకాడకూడదు.
దీంతో పాటు ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై వస్తున్న క్రేజీ వెబ్ సిరీస్‌లను సద్వినియోగం చేసుకోవాలి. కొత్త తరం దర్శకులతో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ.. వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలి. పెళ్లి తర్వాత కొత్త జోష్‌తో ప్రిన్స్ తన కెరీర్‌ను మరింత పక్కాగా ప్లాన్ చేసుకుని.. మునుముందు పెద్ద విజయాలున అందుకోవలని ఆకాంక్షిద్దాం.
