Begin typing your search above and press return to search.

ప్రేమ్ ర‌క్షిత్ కి హాలీవుడ్ నుంచి పిలుపా?

`ఆర్ఆర్ఆర్` చిత్రంలో `నాటు నాటు` పాటకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపులో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కృషి ఎంతో ఉంది.

By:  Srikanth Kontham   |   21 March 2026 11:00 PM IST
ప్రేమ్ ర‌క్షిత్ కి హాలీవుడ్  నుంచి పిలుపా?
X

`ఆర్ఆర్ఆర్` చిత్రంలో `నాటు నాటు` పాటకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపులో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కృషి ఎంతో ఉంది. ఆ పాట గ్లోబల్ స్థాయిలో ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకున్న వేళ, దిగ్గజ పాప్ గాయకుడు మైఖెల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ విన్సెంట్ పీటర్సన్ ప్రేమ్ రక్షిత్‌ను చూసి ఎంతో ఆశ్య‌ర్యపోయారు. ప్రేమ్ ర‌క్షిత్ పనితనాన్ని అమితంగా ప్రశంసించారు. తాను చూసిన గొప్ప ప్ర‌తిభావంతుడిగా ప్రేమ్ ర‌క్షిత్ ను మెచ్చుకున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హాలీవుడ్ నుంచి ప్రేమ్ రక్షిత్‌కు ఒక అరుదైన ఆహ్వానం అందిందట. ఓ భారీ హాలీవుడ్ ప్రాజెక్టులోని ముఖ్యమైన పాట కోసం కొరియోగ్రఫీ చేయవలసిందిగా విన్సెంట్ పీటర్సన్ స్వయంగా ప్రేమ్ రక్షిత్‌ను కోరారని వార్త‌లొస్తున్నాయి. నిజంగా ఇది నిజ‌మైతే? అంతర్జాతీయ స్థాయి కొరియోగ్రాఫర్ నుండి వచ్చిన ఈ పిలుపు భారతీయ సినీ పరిశ్రమకు దక్కిన మ‌రో గౌరవంగా భావించొచ్చు. ప్రేమ్ రక్షిత్ శైలి అంటేనే ఎంతో ఎనర్జిటిక్ , కాంప్లెక్స్ స్టెప్పులతో కూడి ఉంటుంది. `నాటు నాటు` పాటే అందుకు నిదర్శనం. మైఖెల్ జాక్సన్ వంటి అంతర్జాతీయ స్థాయి అద్భుతాలను సృష్టించిన విన్సెంట్ పీటర్సన్, ప్రేమ్ రక్షిత్ టాలెంట్‌ను గుర్తించి పిలవడం అంటే ఆషామాషీ కాదు.

భారతీయ నృత్య శైలికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణగా భావించాలి. ఇది కేవలం ఒక పాట కోసం చేయ‌డం మాత్ర‌మే కాదు. హాలీవుడ్ తెరపై ఇండియన్ స్టైల్ మార్కును వేయడానికి దక్కిన ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు.

ఒక భారతీయ కొరియోగ్రాఫర్ నేరుగా హాలీవుడ్ సినిమాకు పనిచేయడం అనేది దేశ సినిమా చరిత్రలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచిపోతుంది. ఇప్పటికే ఆస్కార్ గెలిచిన ప్రేమ్ రక్షిత్, ఇప్పుడు హాలీవుడ్ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంటే? ఆయన క్రేజ్ రెట్టింపు అవ్వ‌డం ఖాయం. అగ్రశ్రేణి హాలీవుడ్ నటులు , డాన్సర్లతో ప్రేమ్ రక్షిత్ కంపోజిషన్ చూడాలని సినీ అభిమానులు అంతే కోరుకుంటున్నారు.

మ‌న ప్ర‌తిభ‌ను హాలీవుడ్ లో సైతం చూసుకోవాలని ఎంతో మంది భార‌తీయులు ఆశ ప‌డుతున్నారు. ఆ కోరిక ప్రేమ్ ర‌క్షిత్ రూపంలో నెర‌వేరితే నిజంగా అద్భుత‌మే. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు గోప్యంగా ఉన్నాయి. ఎలాంటి అధికారిక స‌మాచారం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. మ‌రి ఈ ప్ర‌చారమంతా నిజ‌మా? అబ‌ద్దామ‌? అన్న‌ది తేలాల్సి ఉంది. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి.

తిరుపతిలో పెట్టి పెరిగారు. అక్క‌డే చ‌దువుకున్నారు. సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఆయన హైదరాబాద్‌కు వచ్చి తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాల‌కు ప‌ని చేసారు. కొరియోగ్రాఫ‌ర్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు.