ప్రీమియర్ షో లపై ఎందుకింత మోజు..?
By: Ramesh Palla | 30 July 2025 11:33 AM ISTపవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'హరి హర వీరమల్లు' సినిమా సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి మరీ పబ్లిసిటీ చేయడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్టుగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కావలసినంతగా టికెట్ల రేట్లు పెంచుకోండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే కాకుండా ప్రీమియర్ షో లకు, బెనిఫిట్ షోలు, మిడ్ నైట్ షో లకు కూడా అక్కడక్కడ అనుమతులు వచ్చాయి. దాంతో సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. కానీ రెండో రోజు నుంచి వసూళ్లు పడిపోయాయి అనేది బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వీరమల్లు టీం నుంచి వసూళ్ల పై అధికారిక ప్రకటన రాలేదు. కానీ బ్రేక్ ఈవెన్ కి ఇంకో 30 నుంచి 40 శాతం వసూళ్లు రాబట్టాల్సి ఉందట.
పనిగట్టుకుని విమర్శల
సినిమా కలెక్షన్స్ రెండో రోజే తగ్గడానికి కారణం ప్రీమియర్ షో లు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అత్యధిక రేట్లు పెట్టి పెయిడ్ ప్రీమియర్ షో లు వేయడం ద్వారా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. కానీ ఆ ప్రీమియర్‌ల వల్ల జరిగే డ్యామేజీ గురించి వారు తెలుసుకోలేక పోతున్నారు. సినిమా సూపర్ హిట్ అయితే పర్వాలేదు. కానీ యావరేజ్‌గా ఉన్నా లేదంటే యాంటీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న హీరోల సినిమాలకు పెద్ద డ్యామేజ్ అనే విషయం హరి హర వీరమల్లు సినిమా విషయంలో మరోసారి నిరూపితం అయ్యింది. హరి హర వీరమల్లు సినిమాను కొందరు పనిగట్టుకుని మరీ విమర్శిస్తూ, నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. పవన్ పై కక్షతో, రాజకీయ దురుద్దేశంతో కొందరు వీరమల్లును గురించి నెగటివ్‌గా ప్రచారం చేశారు అనేది చాలా మంది చెబుతున్న మాట.
ముందు రోజే రివ్యూలు
ప్రీమియర్ షో ల వల్ల కేవలం హరి హర వీరమల్లు సినిమాకు మాత్రమే కాకుండా మరికొన్ని పెద్ద సినిమాలకు సైతం పెద్ద డ్యామేజ్ జరిగింది. సినిమా టాక్ ముందు రోజే రావడంతో టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు సైతం వెనక్కి తగ్గుతున్నారు, పైగా రివ్యూలు సైతం ముందు రోజు రాత్రికే పడిపోతున్నాయి. తద్వారా సినిమా ను చూసే ప్రేక్షకులు తగ్గి పోతున్నారు అనేది ఒక విశ్లేషణ. రెండు మూడు రెట్లు టికెట్ల రేట్లు పెంచి ప్రీమియర్ షో లు వేయడం ద్వారా ఆ షో ల వరకు భారీ మొత్తంలో వసూళ్లు వస్తాయి, కానీ ఆ తర్వాత సినిమా పరిస్థితిని గురించి పట్టించుకోవడం లేదు అనేది చాలా మంది అభిప్రాయం. ప్రీమియర్ షో లు అనేవి ఏ విధంగా చూసినా మొత్తం ఇండస్ట్రీకి మంచిది కాదు అనేది విశ్లేషకుల, సినీ పెద్దల అభిప్రాయం.
టికెట్ రేట్లు పెద్ద సమస్య
పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల రేట్లు పెంపు అనేది ఈమధ్య కాలంలో చాలా కామన్‌గా మారింది. మొదటి వారం రోజులు సామాన్యులు చూసే పరిస్థితి లేనంతగా సినిమా టికెట్లు రేట్లు పెంచేస్తున్నారు. జనాలు మొదటి వారం రోజుల్లోనే థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ వారం తర్వాత ఆసక్తి ఉండదు, అప్పటికే సినిమా గురించి జనాల్లో ఏదో రకంగా ప్రచారం జరగడం, ఆగి పోవడం జరుగుతుంది. కనుక రెండో వారం నుంచి థియేటర్‌ల ఆక్యుపెన్సీ 80 శాతం పడి పోతుంది. అప్పుడు టికెట్ల రేట్లు తగ్గించిన ప్రయోజనం ఉండదు. సినిమాలు చూడాలి అనుకునే వారు మొదటి వారంలోనే చూస్తారు, అప్పుడు టికెట్ల రేట్లు ఎక్కువ ఉంటే.. బాబోయ్ వద్దులే తర్వాత చూద్దాం అనుకుంటారు, తర్వాత వారంలో మరో రెండు మూడు వారాల్లో ఓటీటీలో వస్తుంది కదా థియేటర్‌కి వెళ్లడం అవసరమా అనుకుంటారు.
మొదటి వారం రోజుల్లో టికెట్ల రేట్లు పెద్ద ఎత్తున పెంచడం వల్ల ఆదాయం పెరుగుతుందని అనుకుంటున్నారు, కానీ అసలు విషయం ఏంటంటే టికెట్ల రేట్ల పెంపు వల్ల వీక్ డేస్‌లో ఆక్యుపెన్సీ ఉండటం లేదు. వారం రోజుల తర్వాత తగ్గిస్తే అప్పటికే సినిమా పాతబడి పోతుంది. జనాల్లో సినిమా గురించి వేడి వేడిగా చర్చ జరుగుతున్నప్పుడే చూడాలి అనుకుంటారు. కానీ ఆ సమయంలో ప్రీమియర్ షో లు అని, ఇంకేదో కారణం వల్ల భారీ మొత్తంలో ప్రేక్షకుల నుంచి ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు. సినిమాకు అన్ని విధాలుగా నష్టం చేకూర్చుతున్న ప్రీమియర్ షో లపై ఇప్పటికీ ఎందుకు ఇంత మోజు అర్థం కావడం లేదు..!
