రిటైర్ అయిపోదనుకుంటే షాక్ ఇచ్చిన నటి!
ప్రీతి ఝంగియాని పరిచయం అసవరం లేని పేరు. టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలలో తనదైన ముద్ర వేసిన నటి.
By: Srikanth Kontham | 10 Jun 2026 4:00 AM ISTప్రీతి ఝంగియాని పరిచయం అసవరం లేని పేరు. టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలలో తనదైన ముద్ర వేసిన నటి. పవన్ కళ్యాణ్ సరసన `తమ్ముడు` వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించి అప్పట్లో ఓవెలుగు వెలిగింది. హిందీలో `మొహబ్బతేన్` చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ బ్యూటీ కొంతకాలంగా వెండితెరపై కనిపించకపోవడంతో నటనకు స్వస్తి పలికింది. విదేశాల్లో స్థిరపడిపోయిందనుకున్నారంతా. కానీ అమ్మడు అలాందిలేదంటూ నేను ఇంకా యాక్టివ్ గానే ఉన్నానంటూ షాక్ ఇచ్చింది. `నేను నటనను విడిచిపెట్టాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నటన నా ప్రాణం.. సినిమా కెరీర్‌ను ఎంతో ప్రేమిస్తాను` అని ప్రకటించింది.
గత కొన్నేళ్లుగా వ్యక్తిగత జీవితంలో కొత్త బాధ్యతలు పెరగడం, పిల్లల ఎదుగుదలపై దృష్టి పెట్టడం వల్లే సినిమాల నుంచి కాస్త విరామం తీసుకోవాల్సి వచ్చిందని అంతే తప్ప పరిశ్రమను వదిలి వెళ్లాలనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని వెల్లడించింది. సినిమాలకు తాత్కాలికంగా దూరమైన ఈ సమయంలో ప్రీతి ఝంగియాని భర్త పర్విన్ దబాస్‌తో కలిసి వ్యాపార రంగంలో బిజీగా గడిపారు. ఇద్దరు సంయుక్తంగా ప్రో పంజా లీగ్ అనే ఆర్మ్ రెజ్లింగ్ క్రీడా లీగ్‌ను ప్రారంభించి దేశంలో దానికి మంచి ఆదరణ తెచ్చిపెట్టారు.
ఒక పక్క లీగ్ వ్యవహారాలు చూసుకుంటూనే.. మరోపక్క ఇద్దరు కుమారుల బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించినట్లు తెలిపారు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లు కావడంతో మళ్లీ నటన వైపు దృష్టి పెట్టడానికి సమయం దొరికింందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఓటిటి విప్లవం సినీ పరిశ్రమను పూర్తిగా మార్చేసిందన్నారు. ఇది నటీనటులకు అద్భుతమైన వరమని ప్రీతి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వయసుతో పని లేకుండా నటుల నైపుణ్యానికి తగ్గట్టుగా బలమైన పాత్రలు రూపుదిద్దుకుంటున్నాయని కొనియాడారు.
కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా కథను మలుపు తిప్పే ఎలాంటి వైవిధ్యమైన క్యారెక్టర్లు వచ్చినా? చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని నటిగా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు హింట్ ఇచ్చారు. త్వరలోనే కొత్త సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వస్తాయని అభిమానులకు భరోసా ఇచ్చారు. ఎన్నేళ్లు గడిచినా ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యంగా సౌత్ ప్రేక్షకులు తమ్ముడు సినిమాను ఇప్పటికీ గుర్తుపెట్టుకోవడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన నటీమణులు పెళ్లయి, పిల్లలు పుట్టిన తర్వాత పరిశ్రమకు పూర్తిగా దూరమై పోతారనే పాతకాలపు ఆలోచనా ధోరణిని ప్రీతి ఝంగియాని మాటలు బద్దలు కొడుతున్నాయి. నటనపై ఉన్న మక్కువతో ఇటు కుటుంబాన్ని అటు కెరీర్‌ను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్న ఆమె నిర్ణయం తోటి నటీమణులకు స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు.
