థియేటర్ వర్సెస్ సినిమా: నటనలో మార్పే అసలైన నైపుణ్యం!
`కోహ్రా`, `క్రిమినల్ జస్టిస్`, `ఛలాంగ్` లాంటి ప్రాజెక్ట్‌లలో వైవిధ్యమైన పాత్రలతో డిజిటల్, వెండితెరలపై ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు ప్రేరక్ మెహతా.
By: Srikanth Kontham | 3 Oct 2026 6:00 PM IST`కోహ్రా`, `క్రిమినల్ జస్టిస్`, `ఛలాంగ్` లాంటి ప్రాజెక్ట్‌లలో వైవిధ్యమైన పాత్రలతో డిజిటల్, వెండితెరలపై ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు ప్రేరక్ మెహతా. నాటకరంగం నేర్పిన క్రమశిక్షణతో, కమర్షియల్ హంగుల కంటే కథలో ఉండే నిజాయితీకే ప్రాధాన్యత ఇస్తూ నటనలో తనదైన ముద్ర వేస్తున్నారు. నాటకరంగం (థియేటర్), సినిమా అనేవి రెండూ వేర్వేరు మాధ్యమాలు కావడంతో ఆయా వేదికలకు తగినట్లుగా నటన పట్ల వేర్వేరు దృక్పథాలు, విభిన్న విధానాలు అవసరమని పేర్కొన్నారు. రంగానికి తగ్గట్టు నటనలో మార్పులు చేసుకోవడం నటీనటులకు కీలకమైన నైపుణ్యమని చెబుతూ తన నటనా ప్రయాణంలోని ముఖ్యమైన ఘట్టాలను పంచుకున్నారు.
నాలుగు సంవత్సరాల పిన్న వయస్సులోనే నాట్యంతో ప్రేరక్ మెహతా ప్రయాణం ప్రారంభమైంది. డ్యాన్స్ పట్ల ఉన్న మక్కువతో ప్రత్యేక శిక్షణ పొందిన ఆయన డ్యాన్స్ రియాలిటీ షో `డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్` వేదికపై అద్భుత ప్రదర్శన ఇచ్చి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. డ్యాన్స్ ద్వారా లభించిన లయ, శరీర భాషపై పట్టు తదనంతరం ఆయన నటనా రంగానికి రావడానికి బలమైన పునాదిగా ఉపయోగపడ్డాయి.
డ్యాన్స్ నుంచి ప్రేరక్ నాటకరంగంలోకి అడుగుపెట్టారు. థియేటర్‌లో పనిచేయడం ద్వారా నటనలోని మెళకువలు, ప్రత్యక్ష ప్రేక్షకుల ముందు ప్రదర్శన ఇచ్చేటప్పుడు ఉండే ఉద్వేగం , పాత్రలోకి పూర్తిగా లీనమయ్యే విధానాన్ని నేర్చుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నేపథ్యం, నాటకరంగంలో సంపాదించిన అనుభవం ఆయనను బహుముఖ ప్రజ్ఞాశాలిగా తీర్చిదిద్దాయి. నాటకాల్లో వేదికపై స్పష్టమైన స్వరంతో, పెద్ద ఎత్తున హావభావాలు ప్రదర్శించాల్సి ఉంటుందని వివరించారు.
నాటకరంగంతో పోలిస్తే కెమెరా ముందు నటించే సినిమా రంగం పూర్తిగా భిన్నమైనదని ప్రేరక్ మెహతా స్పష్టం చేశారు. నాటకాల్లో ప్రేక్షకులు చాలా దూరంలో కూర్చుని ఉంటారు కాబట్టి ఉద్వేగాలను కాస్త స్పష్టంగా చూపించాల్సి వస్తుంది. కానీ సినిమాల్లో కెమెరా ప్రతి చిన్న కదలికను, చివరికి కంటిపాప కదలికను కూడా నిశితంగా బంధిస్తుంది. అందుకే సినిమాలో నటిస్తున్నప్పుడు హావభావాలు చాలా సహజంగా, పాత్రకు తగినట్లుగా అంతర్గతంగా ఉండాలని ఏమాత్రం అతిగా ఉన్నా కెమెరా ముందు స్పష్టంగా తెలిసిపోతుందని వెల్లడించారు.
ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇచ్చే ప్రేరక్ మెహతా విభిన్న భాషలు, యాసలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఏ పాత్ర చేసినా ప్రేక్షకులకు అది నిజమైన వ్యక్తిగానే కనిపించాలి తప్ప అభినయంలా అనిపించకూడదని నమ్ముతారు. ట్రెండ్స్‌ను గుడ్డిగా అనుసరించడం వల్ల కథల్లో భావోద్వేగ సత్యం లోపిస్తుందని.. అందుకే కమర్షియల్ హంగుల వెంట పడకుండా ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యే పాత్రలు చేయడమే లక్ష్యమన్నారు.
