ప్రత్యూష పవనంలా వచ్చి...అదృశ్యమైపోయింది
ఆమె పేరు ప్రత్యూష. బహు చక్కని పేరు. ప్రత్యూషం అంటే వేకువ జామున వెలుగు. అంటే ఉషస్సు అని అర్ధం. అవును ఆమె ఉషస్సులా ఉదయించింది.
By: Satya P | 17 Feb 2026 11:38 PM ISTఆమె పేరు ప్రత్యూష. బహు చక్కని పేరు. ప్రత్యూషం అంటే వేకువ జామున వెలుగు. అంటే ఉషస్సు అని అర్ధం. అవును ఆమె ఉషస్సులా ఉదయించింది. వెలుగు జిలుగుల వెండి తెర మీద తన కళలు కాంతులతో మరింత కొత్తగా రంగులను అద్దాలనుకుంది. తన ప్రతిభకు పట్టం కట్టి ఉజ్యలమైన భవిష్యత్తుని చూసుకోవాలనుకుంది. కానీ ప్రత్యూష పవనంగానే ఆమె మెల్లగా నిష్క్రమించింది. మౌన గీతంగా కాలం చాటుకు కదలిపోయింది. తొలి సంధ్యలోనే మలి సంధ్యని మిళితం చేస్తూ ఆమె నిండు జీవితం ముగిసిపోయింది. ఆమె అలనాటి వర్ధమాన తార ప్రత్యూష. ఆమె జీవితం ఒక విషాదంగా సాగిపోయిన తీరు ఈ రోజుకీ ఎందరికో ఆలోచింపచేస్తుంది.
తరుణ ప్రాయంలోనే :
ప్రత్యూష ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. హోటల్ మేనేజ్మెంట్ చదివింది. మోడల్ గా ఉత్తమ స్మైల్ విభాగంలో అవార్డును కూడా అందుకుంది. కేవలం 17 ఏళ్ళ వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశించింది. తొలి సినిమా రాయుడు. ఆ సినిమాలో ఆమెకు మంచి గురింపు లభించింది. ఆ విధంగా తెలుగు, తెలుగు తమిళ భాషా సినిమాల్లో ఏకంగా 22 సినిమాల దాకా నటించింది అంటే ఆమె ప్రతిభకు తగిన అవకాశాలు దక్కాయని భావించాల్లి. రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని మొదలైన సినిమాలలో ఆమె మంచి పాత్రలనే పోషించింది. అంతే కాదు అనేక టివి ధారావాహిక కార్యక్రమాల్లో నటించింది. మొత్తంగా చూస్తే ఆమె సినీ జీవితం 1998 నుంచి 2022 అంటే కేవలం నాలుగేళ్ళు మాత్రమే.
ఎంతో భవిష్యత్తు :
ఆమె హీరోయిన్ గా యువ హీరోల పక్కన నటించింది. ఆనాటి యంగ్ తరంగ్ అయిన ఉదయ్ కిరణ్ తో కలుసుకోవాలని మూవీలో జోడీగా నటించింది. అలాగే స్నేహమంటే ఇదేరా మూవీలో నాగార్జున మేనల్లుడు సుమంత్ పక్కన జంటగా మెరిసింది. ఇలా ఆమె నటనతో తన టాలెంట్ ని ప్రదర్శిస్తూ మంచి భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తూ వచ్చింది.
అనూహ్యమైన ఘటన :
ఈ నేపథ్యంలో 2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష తన స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి కలసి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఇది ఆనాటి మీడియాలో షాకింగ్ న్యూస్ గా వచ్చింది. తమ వివాహాన్ని పెద్దలు అంగీకరించడం లేదని తన స్నేహితుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి ప్రత్యూష ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆ రోజు సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఈ ఇద్దరూ చేరారు. ప్రత్యూష ఫిబ్రవరి 24 న హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
అతి చిన్న వయసులోనే :
ఇక ప్రత్యూష మరణించిన నాటికి కేవలం 21 ఏళ్ళ వయసులో ఉన్నారు. ఆమె చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. బిజీ ఆర్టిస్టుగా ఆమె అవకాశాలు అందుకుంటున్నారు. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు లేరన్న లోటుని పూడ్చేందుకు ప్రత్యూష ఒక ఆల్టనేషన్ గా వచ్చింది. కానీ తొలి ఉషస్సు లోనే తన ఊపిరిని వదిలేసి దివికి చేరిపోయింది.
